అది హత్యే..!

ABN , First Publish Date - 2022-05-23T07:20:06+05:30 IST

అబద్దం బద్దలైంది.. నిజం బయటకొచ్చింది.. అందరూ అనుమానిం చినట్లే డ్రైవర్‌ది హత్యే అని తేలింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ చెప్పింది కట్టుకథే అని తేలిపోయింది. పథకం ప్రకారం డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. చిత్రహింసలు పెట్టి తీవ్రంగా కొట్టి చంపినట్లు పోస్టుమార్టం బయటపెట్టింది. పీకపై బలంగా తొక్కడంతో ఊపిరాడక గుండె ఆగి సుబ్రహ్మణ్యం చనిపోయాడని పంచనామా స్పష్టం చేసింది. నూటికి నూరుపాళ్లు హత్యే అని నిజాలను బట్టబయలు చేసింది.

అది హత్యే..!
జి.మామిడాడలో సుబ్రహ్మణ్యం పార్థీవదేహం వద్ద రోధిస్తున్న కుటుంబసభ్యులు

  • డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ తీవ్రంగా కొట్టిచంపేశారు
  • పీకపై బలంగా తొక్కడంతో ఊపిరాడక గుండె ఆగి మృతి
  • పోస్టుమార్టంలో విస్తుపోయే వాస్తవాలు.. నూటికి నూరుశాతం హత్యగా నిర్ధారణ
  • పోలీసుశాఖకు ప్రాథమిక నివేదిక అందజేసిన ఫోరెన్సిక్‌ నిపుణులు
  • కట్టుకథ అల్లిన ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ బండారం బట్టబయలు
  • నివేదిక అందడంతో అరెస్ట్‌ కోసం గాలింపు.. కానీ అదుపులోనే ఉన్నట్లు సమాచారం
  • నేడు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచే అవకాశం
  • ఉదయభాస్కర్‌ స్నేహితులను ప్రశ్నిస్తున్న పోలీసులు
  • జి.మామిడాడలో మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి

అబద్దం బద్దలైంది.. నిజం బయటకొచ్చింది.. అందరూ అనుమానిం చినట్లే డ్రైవర్‌ది హత్యే అని తేలింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ చెప్పింది కట్టుకథే అని తేలిపోయింది. పథకం ప్రకారం డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. చిత్రహింసలు పెట్టి తీవ్రంగా కొట్టి చంపినట్లు పోస్టుమార్టం బయటపెట్టింది. పీకపై బలంగా తొక్కడంతో ఊపిరాడక గుండె ఆగి సుబ్రహ్మణ్యం చనిపోయాడని పంచనామా స్పష్టం చేసింది. నూటికి నూరుపాళ్లు హత్యే అని నిజాలను బట్టబయలు చేసింది. 

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)/కాకినాడ క్రైం:

డ్రైవర్‌ది హత్యేనని తేలడంతో ఉదయభాస్కర్‌ అరెస్ట్‌ ఖాయమని అంతా అనుకున్నారు. కానీ పోలీసులు నిందితుడి అరెస్ట్‌ ఇప్పటికీ చూపలేదు. ఆదివారం తెల్లవారజామున సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవడంతో స్వగ్రామం జి.మామిడాడకు పార్థీవదేహాన్ని తరలించారు. ఆదివారం ఉదయం అంత్యక్రియలు పూర్తయ్యాయి.

ఎంత దారుణం...

కాకినాడ జీజీహెచ్‌ ఫొరెన్సిక్‌ విభాగం వద్ద పోలీస్‌ పహారా నడుమ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. దీంతో 2.52 గంటలకు సుబ్రహ్మణ్యం పార్థీవదేహాన్ని మృ తుడి స్వస్థలమైన పెదపూడి మండలం జి.మామిడాడకు మహాప్రస్థా నం వాహనంలో తరలించారు. శవపంచనామా పూర్తవడంతో అందు లో అనేక నివ్వెరపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఫోరెన్సిక్‌ నిపుణుల ద్వారా ‘ఆంధ్రజ్యోతి’కి పక్కాగా అందిన వివరాలు పరిశీలిస్తే డ్రైవర్‌ను చాలా దారుణంగా హింసించి చంపిన విషయం పోస్టుమా ర్టం ద్వారా నిర్ధారణ అయింది. కాకినాడ బీచ్‌ పరిసరాల్లో గురువారం రాత్రి డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని విచక్షణారహితంగా కొట్టినట్లు తేలింది. ఒంటిపై తీవ్ర దెబ్బలు వైద్యులు గుర్తించారు. తలపై గాయాలుండ డంతో కర్ర లేదా రాడ్డుతో బలంగా కొట్టినట్లు శవపంచనామాలో తేలిం ది. కాళ్లు, చేతులు విరిచేసి అతి క్రూరంగా హత్య చేసినట్లు ఫోరెన్సిక్‌ వైద్య వర్గాలు తెలిపాయి. చాలా కక్ష పెంచుకున్న వాళ్లే ఈ తరహాలో క్రూరంగా కొట్టి చంపుతారని వైద్యవర్గాలు వివరించాయి. కాగా తమ ప్రాథమిక నివేదికను ఫోరెన్సిక్‌ నిపుణులు ఆదివారం మధ్యాహ్నం పోలీ సుశాఖకు అందించారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ ఉదయభా స్కర్‌ను అరెస్టు ఖాయమని అంతా భావించారు. కానీ ఆదివారం అరెస్ట్‌ జరగలేదు. పోలీసుల అదుపులోనే ఉదయభాస్కర్‌ ఉన్నప్పటికీ అరెస్ట్‌ ఎందుకు చూపడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమ వారం అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటిస్తారని తెలుస్తోంది. అరెస్ట్‌ చూ పిస్తారా? లేదా ఉదయభాస్కర్‌ లొంగిపోయాడా? ఏం చెబుతారనేది ఉత్కంఠగా మారింది. కాగా జిల్లాలో శుక్రవారం పలు వివాహ కార్య క్రమాలకు హాజరైన ఉదయభాస్కర్‌ తనచుట్టూ ఉచ్చు బిగిసుకు పో యిందని, హత్య కేసులో అరెస్ట్‌ తప్పదని తేలడంతో శనివారం సాయం త్రం నుంచి పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. వేరే కొత్త నెంబర్లతో కావాల్సిన వారికి అందుబాటులో ఉంటున్నాడు. అరెస్ట్‌ తప్పదని తేల డంతో ఆదివారం తన లాయర్‌ ద్వారా ముందస్తు బెయిల్‌కు ప్రయ త్నించినట్లు తెలిసింది. అంతకంటే ముందు పార్టీ పెద్దలతోను సమా లోచనలు జరిపినట్లు తెలుస్తోంది. అరెస్ట్‌ ఎప్పుడు చేస్తారనేది తేలాల్సి ఉంది. సోమవారం మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిస్తే రిమాండ్‌ విధిం చాక రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలిస్తారని పోలీసు వర్గాలు వివరించాయి. కాగా నిందుతుడికోసం ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. ఇవి ఆదివారం కాకినాడ భానుగుడి సమీపంలోని ఉదయభాస్కర్‌ ఇంటికి వెళ్లి సోదాలు నిర్వ హించాయి. ఇంట్లో కుటుంబసభ్యులను కూడా ప్రశ్నించాయి. రెండురోజులుగా తన కుమారుడి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తోందని అనంత ఉదయభాస్కర్‌ తల్లి పోలీసులకు తెలిపినట్లు సమాచారం.

చంపేసి అక్కడకు తెచ్చారా..

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని, కాకినాడ అమృత ఆస్పత్రికి తరలించి కారులోనే ఉంచి వైద్యుడితో పరీక్ష చేయిస్తే చనిపోయాడని ఉదయభాస్కర్‌ కుటుంబసభ్యులకు చెప్పిన నేపథ్యంలో పోలీసులు అక్కడ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అందులో గురు వారం అర్ధరాత్రి 1.30 గంటలకు మృతదేహంతో ఎమ్మెల్సీ ఉదయభాస్క ర్‌ కారులో ఆస్పత్రికి వచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. కారు రాగానే ఓ వైద్యుడు, నర్సు వెనుక సీటులో అపస్మారక స్థితిలో పడి ఉన్న సుబ్ర హ్మణ్యాన్ని ఏడు నిమిషాలపాటు పరీక్షించారు. హడావుడిగా లోపలకు బయటకు నర్సు పరుగులు తీసుకుంటూ వెళ్లిన వీడియోలు పోలీసులు గుర్తించారు. అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించి విషయం ఉదయ భాస్కర్‌కు వివరించారు. దీంతో అతడు తన కారులో డ్రైవర్‌ మృత దేహాన్ని తీసుకుని సరిగ్గా 1.40 గంటలకు అక్కడినుంచి వెళ్లిపోయినట్లు సీసీటీవీలో రికార్డు అయింది. దీన్నిబట్టి ముందుగానే చంపేసి కారులో ఆస్పత్రికి తెచ్చి రోడ్డు ప్రమాదం డ్రామా ఆడినట్లు తెలుస్తోంది. అదీ కా దంటే తీవ్రంగా కొట్టిన దెబ్బలకు స్పృహ తప్పిపడిపోవడంతో వైద్యుల కు చూపించడానికి తీసుకువచ్చాడా? అనేది తేలాల్సి ఉంది. అమృత ఆస్పత్రికి ఉదయభాస్కర్‌ వచ్చిన సీసీటీవీ ఫుటేజీలో మాత్రం మృతుడి తల్లిదండ్రులు కనిపించడం లేదు. కేవలం ఉదయభాస్కర్‌, ఓ వైద్యుడు, ఓ నర్సు మాత్రమే కనిపిస్తున్నారు. దీన్నిబట్టి హత్యను రోడ్డు ప్రమా దంగా చిత్రీకరించి కుటుంబీకులను నమ్మించే ప్రయత్నం చేసినట్లు అర్థ మవుతోంది. నాగమల్లితోట జంక్షన్‌వద్ద సీసీ ఫుటేజీని పరిశీలించి ఆ రోజు రోడ్డు ప్రమాదమేదీ జరగలేదని సర్పవరం సీఐ తన దర్యాప్తులో తేల్చారు. ముందే హత్యచేసి రోడ్డు ప్రమాదం కట్టుకథను నిజం చేయ డానికే కావాలనే మృతదేహాన్ని ఆస్పత్రివద్దకు తెచ్చినట్లు తెలుస్తోంది.

ఆ కోణంలో దర్యాప్తు మొదలు..

అక్రమ సంబంధం నేపథ్యంలోనే ప్రధానంగా ఈ హత్య జరిగి ఉం టుందని భావిస్తూ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో తమ దర్యాప్తు వేగవంతం చేసినట్లు ఆంధ్రజ్యోతికి వివరించారు. అం దులో భాగంగా వైసీపీ ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ ఫోన్‌ కాల్‌ డేటా... ఆయనతో సన్నిహితంగా ఉన్నవాళ్లు.. కుటుంబసభ్యులు ఇలా అంద రినీ ప్రశ్నించాలని నిర్ణయించారు. ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. మరోపక్క హత్య అసలు ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది? అనేదానిపై పూర్తి ఆధారాలు లేనందున వాటిని సంపాదిం చేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బీచ్‌రోడ్డు పరిసరాలను పరిశీలించనున్నారు. కొట్టి చంపిన ప్రదేశం ఎక్కడుంది అనేది తేలితే కొన్ని ఆధారాలు వస్తాయని భావిస్తున్నారు. కేసు దర్యాప్తు కోసం పోలీ సులు బృందాలుగా ఏర్పడ్డారు. మరోపక్క ఉదయభాస్కర్‌ గురువారం కాకినాడలో పుట్టినరోజు వేడుకలు పూర్తి చేసుకుని బీచ్‌ వైపు వెళ్లినట్లు భావిస్తున్నారు. వెంట ఆయన స్నేహితులు కూడా ఉన్నారు. దీంతో వారిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. హత్యలో ఎవ రెవరు పాల్గొన్నారు? ఎందుకు చంపారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కొండయ్యపాలెం గెస్ట్‌హౌస్‌కు వెళ్లారా? లేదా? అనేదానిపై ఆరా తీస్తున్నారు. అక్కడ సీసీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. ఉదయభాస్కర్‌ జైలుకు వెళ్లకుండా ఎలాగైనా తప్పించుకునేందుకు పార్టీ నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా ఆదివారం పలువురు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పైర వీ చేసేందుకు ఎస్పీ రవీంద్రనాథ్‌బాబును కలిసినట్లు సమాచారం. కానీ సదరు నేతల విన్నపాన్ని ఎస్పీ తిరస్కరించినట్లు తెలిసింది.

ఎమ్మెల్సీ మాజీ డ్రైవర్‌ హత్య కేసులో.. ఇద్దరు గన్‌మెన్‌లు సస్పెన్షన్‌

కాకినాడ క్రైం, మే 22: ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ మాజీ కారు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య ఘటన కు సంబంధించి ఇద్దరు గన్‌మెన్‌లు సస్పెండ్‌ అయ్యా రు. హత్య జరిగిన రోజున ఎమ్మెల్సీ తన ఇద్దరు గన్‌మెన్‌లను వదిలివెళ్లారు. ఈ విషయాన్ని గన్‌మెన్‌లు వారి ఉన్నతాధికారులకు తెలియపర్చకపోవడాన్ని కాకినాడ జిల్లా పోలీస్‌శాఖ తీవ్రంగా పరిగణించింది. దీంతో ఇద్ద రు గన్‌మెన్‌లను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడి అరెస్టు విషయమై ఆదివారం చర్చ జరిగినట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఏలూరు రేంజ్‌ డీఐజీ జి.పాలరాజు రాత్రి కాకినాడ వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

Updated Date - 2022-05-23T07:20:06+05:30 IST