పోలీసుస్టేషన్‌కు చేరిన వైసీపీ పంచాయితీ

ABN , First Publish Date - 2022-03-05T05:45:29+05:30 IST

తుని వైసీపీలో రెండు వర్గాల మధ్య పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఒక వర్గంపై మరో వర్గం కేసులు పెట్టుకోవడంతో శుక్రవారం తుని పట్టణం, రూరల్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు.

పోలీసుస్టేషన్‌కు చేరిన వైసీపీ పంచాయితీ

పలువురిపై కేసుల నమోదు
తుని, మార్చి 4: తుని వైసీపీలో రెండు వర్గాల మధ్య పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది.  ఒక వర్గంపై మరో వర్గం కేసులు పెట్టుకోవడంతో శుక్రవారం తుని పట్టణం, రూరల్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. జడ్పీటీసీ భర్త పోతల రమణ వర్గానికి, లోవ దేవస్థానం మాజీ చైర్మన్‌ దూలం మాణిక్యం వర్గానికి గత కొద్దికాలంగా ఉన్న విభేదాలు గురువారం బయటపడ్డాయి. ఒక వర్గంపై మరో వర్గం దాడి చేసుకునే స్థాయికి చేరుకున్నాయి. ఈ ఘర్షణలో జడ్పీటీసీ పోతల సూర్యమణిపై మణిక్యం వర్గం దాడి చేశారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ వర్గం పట్టణ పోలీసు స్టేషన్‌లో ఆరుగురిపై ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో పోతల వర్గీయులు తమపై దాడి చేశారంటూ మాణిక్యం వర్గీయులు తుని రూరల్‌ పోలీసుస్టేషన్‌లో ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. ఈ పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు రెండుస్టేషన్లలోనూ కేసులు నమోదు చేశారు. మాణిక్యం వర్గీయులు శుక్రవారం సాయంత్రం స్టేషన్‌ బెయిల్‌పై బయటకు వచ్చారు. దీనిపై జడ్పీటీసీ వర్గీయులు లోలోపల రగిలిపోతున్నారు. మహిళా జడ్పీటీసీని కిందపడేసి దాడిచేసిన వారిపై సాధారణ సెక్షన్లు నమోదు చేసి స్టేషన్‌ బెయిల్‌ పొందడంపై ఆగ్రహంతో ఉన్నారు. ఇదే సమయంలో తమ వర్గీయులపై రూరల్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. జరిగిన పరిణామాలపై రమణ వర్గీయులు తమ అనుచరులతో సమాలోచనలు జరుపుతున్నారు. వారు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.

Updated Date - 2022-03-05T05:45:29+05:30 IST