జల.. జల.. జలపాతం..!
ABN , First Publish Date - 2022-12-19T00:18:47+05:30 IST
ఎతైన కొండలు, చుట్టూ అడవి.. చల్లటి వాతావరణం.. కొండ కోనల్లోంచి జాలువారే జలపాతాల పరవళ్లు. ఈ ప్రదేశాలు ఎక్కడో ఊటీ, కొడైకెనాల్, లంబసింగి, అరకులోయల్లో ఉన్నాయనుకుంటున్నారా.. ఈ ప్రదేశాలు కాకినాడ జిల్లాలో ఉన్నాయంటే నమ్ముతారా. నమ్మితీరాలి. ప్రత్యక్షంగా చూసి ఆ అందాలను ప్రకృతి ప్రేమికులను మైమరిపించే ప్రదేశాలు ఎక్కడో కాదు. ప్రత్తిపాడు మండలంలో దర్శనమిస్తాయి. మూడుచోట్ల ఉన్న ఈ జలపాతాల అందాలను వీక్షించేందుకు వాటిలో జలక్రీడలు ఆడేందుకు ఎక్కడెక్క డ నుంచో సందర్శకులు తరలివస్తున్నారు. ఇటీవల కార్తీకమాసం లో పర్యాటకులు, సందర్శకులతో పోటెత్తారు. వాటి వివరాలివి.
కొండల్లోంచి జలపాతాల పరవళ్లు
ప్రకృతి అందాలతో అలరిస్తున్న ధారపల్లి, ఎరకంపాలెం, తోటపల్లి
కాకినాడ జిల్లాలోనే కనుల విందుగా పర్యాటక అందాలు
పోటెత్తుతున్న పర్యాటకులు
ప్రత్తిపాడు, డిసెంబరు 18:
ఎతైన కొండలు, చుట్టూ అడవి.. చల్లటి వాతావరణం.. కొండ కోనల్లోంచి జాలువారే జలపాతాల పరవళ్లు. ఈ ప్రదేశాలు ఎక్కడో ఊటీ, కొడైకెనాల్, లంబసింగి, అరకులోయల్లో ఉన్నాయనుకుంటున్నారా.. ఈ ప్రదేశాలు కాకినాడ జిల్లాలో ఉన్నాయంటే నమ్ముతారా. నమ్మితీరాలి. ప్రత్యక్షంగా చూసి ఆ అందాలను ప్రకృతి ప్రేమికులను మైమరిపించే ప్రదేశాలు ఎక్కడో కాదు. ప్రత్తిపాడు మండలంలో దర్శనమిస్తాయి. మూడుచోట్ల ఉన్న ఈ జలపాతాల అందాలను వీక్షించేందుకు వాటిలో జలక్రీడలు ఆడేందుకు ఎక్కడెక్క డ నుంచో సందర్శకులు తరలివస్తున్నారు. ఇటీవల కార్తీకమాసం లో పర్యాటకులు, సందర్శకులతో పోటెత్తారు. వాటి వివరాలివి.
మైమరిపించే ధారపల్లి..
ప్రత్తిపాడు మండలంలో పెద్దిపాలెం గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ధారపల్లి జలపాతం ఉంది. ప్రత్తిపా డు మండల కేంద్రానికి ఈ జలపాతం 25 కిలోమీటర్లు ఉం టుంది. బురదకోట కొండల్లోంచి ఈ జలపాతం ప్రవహిస్తూ ధారపల్లివద్ద ఎత్తయిన కొండలనుంచి జాలువారుతుంది. ఈ జాలువారే ప్రదేశంవద్ద జలక్రీడలు ఆడేందుకు సందర్శకులు, పర్యాటకులు ఎంతో ఉత్సాహం కనబరుస్తారు. మండు వేసవిలోను కూడా ఈ జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది. ఇటీ వల కార్తీకమాసంలో ఈ జలపాతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలలనుంచి సందర్శకులు తరలివచ్చారు. ఇక్కడి కొండల మాటున సందర్శకులకోసం చిన్నపాటి కుటీరాలు మాదిరిగా దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశంలో స్నానాలు ఆచరించి ఇష్టదేవతలను పూజిస్తూ పర్యాటకులు ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నారు.
ఎరకంపాలెం చూడాలంటే కొండలెక్కాల్సిందే
మండలంలోని గోకవరం గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూ రంలో ఎరకం పాలెం కొండపై ఈ జలపాతం ప్రవహిస్తోంది. ఈ జలపాతం చేరుకోవాలంటే భూమట్టం నుంచి 500 మీట ర్లు పైబడి కొండమార్గంలో నడిచి చేరుకోవాలి. దట్టమైన రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ఎరకంపాలెం కొండ వద్ద విపరీతమైన చలి వాతావరణం ఉంటుంది. మండు వేసవిలో కూడా ఈ జలపాతంవద్ద చల్లటి వాతావరణం ఉండడంతో ఏడాది పొడవునా ఈ జలపాతాన్ని సందర్శించేందుకు తెలుగు రా ష్ట్రాల నలుమూలలనుంచి పర్యాటకు లు తరలివస్తున్నారు. ఈ జలపాతం శి వలింగం అభిషేకిస్తూ కిందకు రావడం తో శివరాధనలను ఆకర్షిస్తోంది. కొండ దిగువన కింద బేసిక ఆశ్రమం, ధారా మల్లికార్జున దేవాలయాలు, పూలవనాలు ఉండడంతో ఈ ప్రదేశం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది.
ధారల్లా జలపాతాలతో తోటపల్లి విశిష్టత
ప్రత్తిపాడు మండలంలోని వెంకటనగరం గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో తోటపల్లి గ్రామం శివారున కొండల మాటున తోటపల్లి జలపాతం ఉంది. ఈ జలపాత ప్రదేశం ధారా మల్లికార్జునస్వామిగా శివలింగం జలపాతాలను అభిషేకిస్తూ ప్రసిద్ధి పొందింది. కార్తీకమాసం మహాశివరాత్రి పర్వదినాలతోపాటు వేసవిలో కూడా ఈ ప్రదేశం జనసందోహంగా కళకళలాడుతూ ఉంటుంది. వన సమారాధనల పేరుతో నిత్యం ఇక్కడ అన్నసంతర్పణలు పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ మూడు ప్రదేశాలు ఇప్పుడిప్పుడే పర్యాటకులు, సందర్శకులతో కోలాహలంగా మారుతున్నాయి. వీటిపై ప్రభుత్వం దృష్టిసారించి పర్యాటకులను మరింత ఆకర్షించేలా సౌకర్యాలు కల్పిస్తే ఈ ప్రదేశాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని పలువురు సూచిస్తున్నారు.