ముగిసిన చాతుర్మాస్య దీక్ష

ABN , First Publish Date - 2022-09-11T06:20:21+05:30 IST

తిమ్మాపురం లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణంలో 60 రోజులపాటు నిర్విరామంగా సాగిన చాతుర్మాస్య దీక్ష శనివారంతో ముగిసింది. హిందూ ధర్మ పరిరక్షణ, లోకకల్యాణం కోసం ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కంచి కామకోటి 70వ పీఠాధిపతి, జగద్గురువు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ జూలై 13న తన 39వ చాతుర్మాస్య దీక్ష మహాక్రతువును కాకినాడ రూరల్‌ తిమ్మాపురంలో ప్రారంభించారు. రమణయ్యపేట శ్రీపీఠంలో దీక్షను పరిసమాప్తి చేశారు.

ముగిసిన చాతుర్మాస్య దీక్ష
విజయేంద్రసరస్వతిస్వామీజీకి పుష్పాభిషేకం

సర్పవరం జంక్షన్‌, సెప్టెంబరు 10: తిమ్మాపురం లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణంలో 60 రోజులపాటు నిర్విరామంగా సాగిన చాతుర్మాస్య దీక్ష శనివారంతో ముగిసింది. హిందూ ధర్మ పరిరక్షణ, లోకకల్యాణం కోసం ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కంచి కామకోటి 70వ పీఠాధిపతి, జగద్గురువు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ జూలై 13న తన 39వ చాతుర్మాస్య దీక్ష మహాక్రతువును కాకినాడ రూరల్‌ తిమ్మాపురంలో ప్రారంభించారు. రమణయ్యపేట శ్రీపీఠంలో దీక్షను పరిసమాప్తి చేశారు. స్వామీజీ శ్రీమహాత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వరునికి నిత్య త్రికాల పూజలు, పలు దేవతామూర్తులకు ఆరాధన, విశేష పూజలు విశేషంగా నిర్వహించారు. కంచి కామకోటి పీఠంలో జరిగే రీతిలో నిత్యం ఆవు నెయ్యి దీపం, నువ్వుల నూనె దీపం వెలుగులో శివుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. 60రోజులపాటు సాగిన చాతురాస్య దీక్ష శనివారానికి ముగియడంతో చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పది టన్నుల పలు రకాల పుష్పాలతో స్వామీజీకి   పుష్పాభిషేకం నిర్వహించారు. చాతుర్మాస్య దీక్షకు చెందిన శిలాఫలకాన్ని స్వామీజీ ఆవిష్కరించారు. అనంతరం మామిడి మొక్కను నాటారు. ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కలెక్టర్‌ కృతికా శుక్లా పాల్గొన్నారు. చాతుర్మాస్య దీక్ష పరిసమాప్తిలో భాగంగా స్వామీజీని గోశాల ప్రాంగణం నుంచి రమణయ్యపేట శ్రీపీఠం వరకు పూలతో విశేషాలంకరణ చేసిన ప్రత్యేక వాహనంలో విశ్వరూప యాత్ర నిర్వహించారు. స్వామీజీ మాట్లాడుతూ చాతుర్మాస్య దీక్ష గ్రామీణ ప్రాంతంలో నిర్వహించాలని భావించి కాకినాడలో చేపట్టామన్నారు. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు దైవభక్తి-దేశభక్తిపై అవగాహన కల్పిస్తూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ చాగంటి కోటేశ్వరరావు కృషి చేయడం అభినందనీయమన్నారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు ధర్మంపై అవగాహన కల్పించాలని, దేవాలయాలకు వచ్చే ఆదాయంతో ధర్మప్రచారం చేపట్టాలని సూచించారు. ఈ యాత్రలో పాల్గొన్న సువాసినీలకు కంచి కామాక్షి అమ్మవారి ప్రతిమతో పాటూ కుంకుమ ప్యాకెట్లు అందించారు. కార్యక్రమంలో శ్రీపీఠం నిర్వాహకులు స్వామీ పరిపూర్ణానంద సరస్వతి పాల్గొన్నారు.

Updated Date - 2022-09-11T06:20:21+05:30 IST