వెలుగుబంద కాలనీకి వెలుగేది!

ABN , First Publish Date - 2022-12-07T01:38:39+05:30 IST

ఇల్లు లేని పేదలు అనేకమంది ఉన్నారు. ఇల్లు ఇస్తామంటే ఎంత దూరమైనా వచ్చేవారున్నారు.

వెలుగుబంద కాలనీకి వెలుగేది!

జగనన్న కాలనీలో కదలని ఇళ్లు

వెలుగుబందలో 13,069 మందికి పట్టాలు

ఇక్కడ మంజూరైన ఇళ్లు 6,156

ఇప్పటివరకూ పూర్తయినవి 117

1400 బేసిమెంట్‌ వరకూ పనులు

మరో 3,544 ఇళ్ల పరిస్థితి ఏంటో

రెండు నెలల నుంచి బిల్లులు లేవు

సుమారు రూ.7 కోట్ల బకాయిలు

నిర్మాణానికి నీళ్లూ లేవు.. పైపులూ పనిచేయవు

కట్టేసుకోమంటారు.. కానీ డబ్బులిచ్చేవారేరీ

అప్పుల పాలవుతున్న లబ్ధిదారులు

పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని... జగనన్న కాలనీల పేరిట ఊళ్లకు ఊళ్లే నిర్మిస్తామని ప్రగల్బాలు పలికిన వైసీపీ ప్రభుత్వం చతికిలపడింది. ఊరికి దూరంగా లేఅవుట్లు వేయగా, అక్కడ మౌలిక సదుపాయాలు లేక సమస్యలతో సతమతమవుతూ, ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలు సరిపోక అనేక మంది ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదు. అప్పు చేసిన కట్టుకోవాలని వచ్చినా ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో గిజగిజలాడిపోతున్నారు. అనేకమంది అప్పుల పాలైపోతున్నారు. జిల్లాలోని మొత్తం జగనన్న కాలనీల్లో ఎక్కువచోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లోని పేదల కోసం రాజాగనరం మండలం వెలుగుబంద ప్రాంతంలో 13,069 మందికి పట్టాలు ఇళ్లడానికి నిర్ణయించి భూమి సేకరించారు. కొంత భూమి వివాదంలో ఉండగా, తొలి దశ కింద 6,156 మందికి పట్టాలిచ్చి ఇళ్లు మంజూరు చేశారు. రెండేళ్ల కిందటే అట్టహాసంగా భూమి పూజ చేసినప్పటికీ ఇంతవరకూ ఇళ్ల నిర్మాణంలో పెద్దగా కదలిక లేదు. వేలాది ఇళ్లు మంజూరు చేసిన ఇక్కడ 117 ఇళ్లు మాత్రమే పూర్తికావడమే వాస్తవ పరిస్థితికి నిదర్శనం.

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ఇల్లు లేని పేదలు అనేకమంది ఉన్నారు. ఇల్లు ఇస్తామంటే ఎంత దూరమైనా వచ్చేవారున్నారు. పేదల ఆశలను నెరవేర్చి, వారి జీవి తాల్లో వెలుగులు నింపాలనుకున్నప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసు కున్నా ఆ వర్గాల ప్రజలకు భారం కాకుండా చూడాలి. అలా జరగక పోతే ‘జగనన్న కాలనీ’ ఇళ్ల మాదిరి పరిస్థితే ఎదురవుతుంది. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ పరిధిలోని పేదలకు ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించినప్పుడు నగర శివార్లలో ఖాళీ స్థలాలు, లేదా భూమి సేకరించి ఇస్తే లబ్ధిదార్లకు ఎంతో మేలు జరిగేది. మౌలిక సదుపాయాలకు కూడా ఇబ్బంది ఉండదు. సిటీలోని రోడ్లను పొగిడించుకోవచ్చు. డ్రైనేజీలను కలుపుకోవచ్చు. లైటింగ్‌ కూడా సులభంగా ఇవ్వవచ్చు. మంచినీటి సౌకర్యంగా తక్కువ ఖర్చుతోనే కల్పించవచ్చు. కానీ ఊరికి పది కిలోమీటర్లకంటే ఎక్కువ దూరంలో దరిదాపుల్లో కూడా ఏ సౌకర్యాలు లేనిచోట భూములు సేకరించి, ఇళ్ల పట్టాలు ఇవ్వడం వల్ల అసలు ప్రయోజనం దెబ్బతింటుంది. వెలుగుబంద జగనన్న కాలనీలలో ఇదే పరిస్థితి నెలకొంది. రాజమహేంద్రవరం సిటీకి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. పొలాల మధ్యన ఈ కాలనీ నిర్మించనున్నారు. ఎత్తుపల్లాలు ఉన్నాయి. కొందరి స్థలాలు మెరకమీద, కొందరి స్థలాలు పల్లం ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌ సౌకర్యం, మంచినీటి సౌకర్యం ప్రత్యేకించి ఏర్పాటు చేయవలసి ఉంది. ఇక్కడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే లేఅవుట్‌ వేసినట్టు చెప్పారు. కానీ ప్రధాన వీధుల్లో రోడ్లు లేవు. ఇంటర్నల్‌ రోడ్లు అసలే లేవు. బయట నుంచి కాలనీకి వెళ్లడానికి మాత్రం ఇటీవల ఒక రోడ్డు ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితుల్లో అధికారుల ఒత్తిడి వల్ల కొంతమంది మాత్రం సాహసం చేసి ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చారు. కానీ ఇప్పటికి 117 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. 1400 ఇళ్లు పునాదులు, వాటి పైకి కొంతవరకూ వచ్చాయి. 3,544 ఇళ్లలో కొన్ని అసలు మొదలు పెట్టలేదు. కొందరు కేవలం చిన్నచిన్న పనులు మాత్రమే చేసి వదిలేశారు.

అప్పుల పాలవుతున్నాం..

ఇళ్లు నిర్మించుకోవడానికి అప్పుల పాలవుతున్నామని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం ఇంటికి రూ.1 లక్షా 80 వేల రుణం ఇస్తుంది. అది కూడా నేరుగా ఇవ్వడం లేదు. సిమెంట్‌, ఐరన్‌, ఇసుక, ఇలా సరుకులను సరఫరా చేస్తోంది. వాటి పనుల బట్టి బిల్లులు ఇస్తోంది. కానీ ఇక్కడ ఓ మోస్తరుగా ఇంటిని నిర్మించుకోవాలంటే సుమారు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు అవుతుంది. కాంట్రాక్టర్లు రూ. 6 లక్షల వరకూ ఇస్తే ఇంటిని నిర్మించి ఇస్తున్నారు. కొందరు 8 లక్షలు వరకూ తీసుకుంటున్నారు. కానీ డబ్బులు ఇవ్వలేక మధ్యలోనే నిలిచిపోయినవి చాలా ఉన్నాయి. కొందరు లబ్ధి దారులు అప్పు పుట్టడాన్ని బట్టి పనులు చేస్తున్నారు. ఓ లబ్ధిదారు కథనం ప్రకారం ‘రెండేళ్ల కిందట మేం పునాది వేసుకున్నాం. రూ.1.5 లక్ష లు అయింది. తర్వాత డబ్బు లేక ఆపాం. మళ్లీ అప్పు చేసి గోడలు కొంతవరకూ గట్టాం. నిర్మా ణ కూలీల రేట్లు చాలా అధికం. నిర్మాణానికి చాలా వ్యయం అవుతోంది.

నీటి సౌకర్యమూ లేదు

వెలుగుబంద లేఅవుట్‌లో వాస్తవానికి ఐదు బోర్లు వేశారు. కానీ ట్యాప్‌లు చాలా పనిచేయడంలేదు. దీంతో ఇంటి నిర్మాణానికి సంబంఽధించి పనులు చేసుకోవడానికి నీటి కొరత ఉంది. కనీసం పునాదులు, గోడలు తడుపుకోవడానికి కూడా నీళ్లు లేవు. చాలామంది నీళ్లతో తడప కుండానే వదిలేస్తున్నారు. ఇక్కడ రోడ్లు లేవు. డ్రైనేజీ లేదు. విద్యుత్‌ సౌకర్యం ఎప్పటికి ఇస్తారో. ఈ పరిస్థితుల్లో ఇక్కడ మొదట దశ ఇళ్ల నిర్మాణం కూడా ఇబ్బందికరంగా ఉంది.

రూ.7 కోట్లు బిల్లులు పెండింగ్‌

ఇక్కడ రెండు నెలల నుంచి బిల్లులేమీ ఇవ్వడంలేదు. సుమారు రూ.7 కోట్ల వరకూ బకాయి ఉండవచ్చని అంచనా. దీంతో కాంట్రాక్టుకు పనిచేస్తున్నవారు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈనెల 22న కొన్ని గృహ ప్రవేశాలు ఉంటాయని అధికారులు చెబుతున్నా, అవి జరిగే పరిస్థితి కనిపించడంలేదు.

Updated Date - 2022-12-07T01:38:40+05:30 IST