హతవిధి!

ABN , First Publish Date - 2022-12-15T00:05:16+05:30 IST

విధుల్లో ఉండగానే వీఆర్‌వో మృతి.. ఎస్‌ఐ మృతి... సచివాలయ ఉద్యోగి ఆత్మహత్మ.. ఇలా ఏడాదిలో పదుల సంఖ్యలో సంఘటనలు జరుగుతున్నాయి.

హతవిధి!

ఉద్యోగుల అటెన్‌షన్‌

స్థాయిని బట్టి ఒత్తిడి

నవరత్నాలతో నలిగిపోతున్నారు..

నిధుల్లేకుండానే టార్గెట్లు

ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉద్యోగులు

తట్టుకోలేక పలువురికి గుండెపోట్లు

అనారోగ్యాలతో ఆసుపత్రులకు..

జిల్లాలో 70 శాతం ఉద్యోగుల బాధ

విధుల్లో ఉండగానే వీఆర్‌వో మృతి.. ఎస్‌ఐ మృతి... సచివాలయ ఉద్యోగి ఆత్మహత్మ.. ఇలా ఏడాదిలో పదుల సంఖ్యలో సంఘటనలు జరుగుతున్నాయి. అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇటీవల హార్ట్‌ స్ర్టోక్‌లు పెరిగాయి.. బీపీ అదుపులో ఉండడం లేదు.. సుగర్‌ కంట్రోల్‌ కావడం లేదు.. ఎందుకిలా జరుగుతోంది.. ఒక్కటే టెన్షన్‌ టెన్షన్‌.. పైకి ఏమీ పనిలేనట్టే కనిపిస్తారు.. కానీ కంప్యూటర్‌ తెరిస్తే మాత్రం అంతా పనే.. ప్రస్తుతం ప్రభుత్వం అలా చేసేసింది.. నిత్యం పని ఒత్తిడితో ప్రభుత్వ ఉద్యోగులు సతమతమైపోతున్నారు.. అనారోగ్యాల భారిన పడుతున్నారు.. లేదంటే ప్రాణాలే పొగొట్టుకుంటున్నారు.. మొన్న రాజానగరంలో వీఆర్‌వో.. నిన్న కోరుకొండ మండలం గాడాలలో అంగన్‌వాడీ కార్యకర్త.. నిడదవోలు రెవెన్యూ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌.. ఇలా తెలిసినవి కొన్నే.. తెలియనివి ఎన్నో.. పైకి కనిపించని పని ఒత్తిడితో ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. సర్కారు నిబంధనలు ఉద్యోగుల మెడపై కత్తిలా మారాయి. హత‘విధి’ అనేలా ఉన్నాయి..

రాజమహేంద్రవరంరూరల్‌/కడియం, డిసెంబరు 14 : ఉద్యోగుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే కడుపులో చల్ల కది లేది కాదనే వారు..ప్రస్తుతం అలా కాదు.. గుండెలను పిండే స్తుంది..ప్రాణాల మీదకు తెస్తోంది.ప్రస్తుతం ఆసుపత్రికి వెళ్లని ఉద్యోగి లేడంటే అతిశయోక్తి కాదు..కింది స్థాయి నుంచి పైస్థాయి వరకూ అదే పరిస్థితి. గతం లో ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగమంటే పెట్టి పుట్టారు అనుకునే వారు. ప్రస్తు తం వారి పరిస్థితి అయోమయంగా ఉంది. ఎంతలా అంటే ప్రభుత్వ యాప్‌ల కారణంగా ఆయా సెలవు పెడితే బాత్‌ రూమ్‌ లు కడుక్కోవాల్సి దుస్థితికి తెచ్చేసింది.. ఇక రెవెన్యూ.. హౌసింగ్‌ అధికారులకు అయితే మెడపై కత్తి పెడుతున్నారు. నవ రత్నాలు వీళ్ల నవనాడులను పీల్చేస్తున్నాయి. టార్గెట్ల పేరుతో వేధి స్తున్నారు..గృహ నిర్మాణాలు.. ప్రభుత్వ భవన నిర్మాణాలు.. బల్క్‌మిల్క్‌ యూనిట్లు ఇలా ఒకటేమిటి నిధు లు రావు కానీ..నిర్మాణాలు మాత్రం పూర్తయిపోవా లంటే ఎలా..ఎక్కడికక్కడ అసంపూర్తిగానే ఉంటున్నాయి.ఈ నేప థ్యంలోఒకసారి అబద్దం చెబుతారు..రెండు సార్లు అబద్దం చెబుతారు..మూడో సారి ఒత్తిడికి గురై ప్రాణాల మీద కు తెచ్చుకుంటున్నారు.దీంతో ఉన్నత స్థాయి అధికారులు చెప్పే దానికి క్షేత్రస్థాయిలో జరిగేదానికి పొంతన ఉండడం లేదు..

మంది పెరిగినా.. తగ్గని పనిభారం..

మంది పెరిగితే మజ్జిగ పలచబడుతుందనేది పాత సామెత..ప్రస్తుత ప్రభుత్వంలో మంది పెరిగినా పని భారం పెరిగింది. వేళా పాళా లేకుండా యాప్‌లలో సమాచారం అప్‌లోడ్‌,ఉన్నతాధికారుల వివరణ, వంటి వాటితో ఉద్యోగులు సతమవుతున్నారు. కొంతమంది అధికారులు ఉన్నతాధికారుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. లక్ష్యం చాంతాడంత, సమయం గోరంత... అన్న సంధాన ప్రభుత్వతీరు ఉంది. గృహనిర్మాణ శాఖ , రెవెన్యూ, పంచాయతీరాజ్‌శాఖ... ఇలా ఆ శాఖ ఈ శాఖ అనే బేధం లేకుండా ప్రతి ఉద్యోగి ప్రస్తుతం పనిబారంతో ఒత్తిడికి గురవుతూనే ఉన్నారు.ప్రస్తుతం సచివాలయ సిబ్బంది రీతిలో జిల్లా వ్యా ప్తంగా చాలా మంది ఉద్యోగులు పెరిగిని పనిభారం మాత్రం తగ్గలేదు.ఉన్నతాధికారులు తమ కిందిస్థాయి సిబ్బందిని ప్రశ్నిస్తే.. వాళ్లు సచివాలయ సిబ్బందిపై పడుతున్నారు. ఇలా ఒకరి నుంచి మరొకరు పనితోసుకుంటూ మొత్తం వదిలేస్తు న్నారు. ప్రభుత్వ యాప్‌ల కారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఫొటోల అప్‌లోడ్‌తోనే సరిపోతోంది.

జిల్లాలో 17 వేల మంది ఉద్యోగులు

రెవెన్యూ పరంగం చూస్తే జగనన్న భూహక్కు-భూరక్ష పథకంలో భాగంగా రీసర్వే చేస్తున్నారు. వీటితో పాటు ఓటర్ల నమోదు విధులు, ఆర్‌బీకేలు, వంటి పనులతో సతమతమవుతున్నారు. పంచాయతీ రాజ్‌ పరంగా చూస్తే సచివాలయ భవనాలు, ఆర్‌బీ కేలు, వెల్‌నెస్‌ సెంటర్లు వంటి నిర్మాణాలకు సంబంధించి ఇంజనీరింగ్‌ అధికారులకు లక్ష్యాలు నిర్దేశించడంతో ఓ వైపు బిల్లులు రాక, కాంట్రాక్టు పనులు చేయక వారు నానా హైరానా పడుతున్నారు. తరచూ వీడియో కాన్ఫరెన్స్‌ (వీసీ)లు పెడుతూ అధికారులు లక్ష్యాలు ఎంత వరకూ అయింది.?చెప్పిన పనులు చేయకపోతే ఎలా ? మీరు చేస్తారా ? చేయలేకుంటే ఆ స్థానంలో వేరే వారిని తీసుకువస్తాం... అంటూ వీసీల ద్వారా అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారని పలు శాఖల అధికారులు బహిరంగంగానే వాపోతున్నారు.తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 17 వేల మంది ఉద్యోగులు ఉంటే దాదాపు 70 శాతం మందిది ఇదే పరిస్థితి. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రాక పనులు మధ్యలో నిలిచిపోతున్నాయి. జగనన్న కాలనీల్లో ఇళ్ళ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలంటూ వారం వారం టార్గెట్లతో అవిపూర్తికాక తాము ఇబ్బందులు ఎదు ర్కొంటున్నామని అటు పంచాయతీరాజ్‌, ఇటు గృహనిర్మాణశాఖ ఽఅధికారులు వాపోతున్నారు.లబ్ధిదారులు మాత్రం మా దగ్గర డబ్బుల్లేవ్‌ ఇల్లు కట్టివ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. మీరే కట్టుకోవాలంటే మా వల్ల కాదంటున్నారు. ప్రభుత్వం నుంచి మాత్రం ఏదో ఒక విధంగా పూర్తి చేయాలని ఆదే శాలు ఇలా పనిఒత్తిడితో సతమతమవుతున్నారు.

వీసీలతో సతమతం

ఉదయం రాజధాని నుంచి ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్థాయి అధికారుల నుంచి జిల్లా, డివిజన్‌స్థాయి అధికారులకు టార్గెట్లు ఇస్తు న్నారు.దీంతో వారు కిందిస్థాయి అధికారులకు సదరు టార్గెట్లను నిర్దేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతస్థాయి అధికారి నుంచి, గ్రామస్థాయిలో కార్యదర్శి, వీఆర్‌వో వరకు పనిఒత్తిడితో నలిగిపోతున్నారు.రీ-సర్వేల్లో వీఆర్‌వోలు ఖర్చు చేసిన సొమ్ములు ఇవ్వడం లేదు.. తరచూ సమావేశాలు పెడుతూ 100 రోజుల్లోనే సర్వే పనులు పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఎన్ని పనులు చేస్తున్నా ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 5 గంటలకు బయోమెట్రిక్‌ వేయాలని.. స్పందన సమయంలో కూడా తప్పనిసరిగా ఉండాలని చెబుతున్నారు. అదే సమయంలో మండలస్థాయి అధికారుల మీటింగులు, వీసీలు పెట్టడంతో ఏం చేయాలో తోచక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలా పనిభారంతో నలుగురు వీఆర్‌వోలు మృతి చెందగా, ఓ తహసీల్దారు ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయారు. ఇలా తాము ఒత్తిడికి గురవుతున్నామని వాపోతున్నారు.

వస్తూ యాప్‌.. వెళుతూ యాప్‌..

ఉపాధ్యాయులు ప్రతి రోజూ ఐదు యాప్‌లతో కుస్తీలు పడుతున్నారు.మేం స్కూలు వచ్చాం అని 9 గంటలకే అటెం డెన్స్‌ యాప్‌లో నమోదు చేయాలి..9.30 గంటలకు స్టూడెంట్స్‌ హాజరు యాప్‌లో నమోదు చేయాలి..ఆ తరువాత మధ్యా హ్న భోజనం ఎంత మంది వచ్చారు..ఎంత మందికి పెట్టార నేది జగనన్న గోరుమద్దు పథకంలో అప్‌ లోడ్‌ చేయాలి.. సాయంత్రం వెళ్లే సమయంలో బాత్‌రూమ్‌లు చూసుకోవాలి.. క్లీన్‌గా ఉండాలి..అన్నీ ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాలి.. ఏ రోజైనా పాఠశాలకు ఆయా రాకపోతే ఉపాధ్యా యులే బాత్‌ రూమ్‌లు క్లీన్‌ చేసి ఫొటోలు అప్‌ లోడ్‌ చేయాలి.ఇలా ఉపాధ్యాయులు ఉదయం వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకూ యాప్‌లతో కుస్తీ పట్టాల్సిందే. ఆ రోజు ఏ యాప్‌ పనిచేయక పోయినా వీరి పరిస్థితి అంతే.ఇక ఉదయం 9 గంటలు దాటిందంటే మెమోలు జారీ చేస్తామనడంతో ఉపాధ్యా యులు ఒత్తిడికి గురవుతున్నారు. ఇలా అందరు ఉద్యోగులు ఒత్తిడిలో పనిచేస్తూ హతవిధీ అనుకుంటున్నారు.

ఆఫీస్‌ నుంచి ఇంటికి వెళుతూ..

పేరు కడియపు శ్రీను.. వయసు 48 సంవత్సరాలు.. రాజానగరం మండలం పాతతుంగపాడు వీఆర్‌ వోగా పనిచేసేవారు.. కుటుంబ సభ్యులు సమాచా రం మేరకు ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు లేవు. అక్టోబరు 6న ఉదయం ఏదో పని ఉందని ఇంటి నుంచి వచ్చిన ఆయన సాయంత్రం ఆఫీస్‌ నుంచి వెళుతూ దారి మధ్యలోనే గుండెపోటుతో చనిపోయారు. ఉదయం బాగా ఉన్న మనిషి సాయంత్రానికి లేరు.. పని ఒత్తిడి కారణంగానే చనిపోయినట్టు వీఆర్‌వోల సంఘ నాయకులు ఆరోపణలు చేశారు.

టార్గెట్‌ పూర్తికాలేదని ఒత్తిడి.. ఆత్మహత్య

పేరు సుభాష్‌ చంద్రవర్మ.. ఊరు రంగంపేట మండలం జి.దొంతమూరు. సచివాలయంలో ఉద్యాన సహాయకుడిగా పనిచేసేవారు. అయితే ఈ క్రాప్‌ నమోదులో వెనుకబడ డంతో ఉన్నతాధికారి నుంచి ఒత్తిడి వచ్చింది.. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. మూడు రోజుల పాటు కనిపించలేదు. ఆత్మహత్య చేసుకోవడంతో అక్టోబరు 15వ తేదీన విగతజీవిగా కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.. సచివాలయ ఉద్యోగులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. అధికారుల ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని ధర్నా చేశారు.

ఇంటికి వెళ్లారు.. చనిపోయారు..

పేరు మిద్దెం సత్తిబాబు.. రాజమహేంద్రవ రంలో ఎస్‌బీ ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. నవంబరు 15వ తేదీన ఉదయం డ్యూటీకి వచ్చారు.. సాయంత్రం వరకూ పనిచేశారు.. పనిముగించుకుని ఇంటికి వెళ్లారు.. ఇంటికి వెళ్లి కూర్చున్నారో లేదో.. స్ర్టోక్‌ వచ్చింది.. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించారు.. కేవలం అరగంటలోనే ఆయన చనిపోయారు. పని ఒత్తిడి కారణంగానే చనిపోయినట్టు తోటి ఉద్యోగులు చెబుతున్నారు.

అధికారి తనిఖీలకు వస్తారని తెలిసి..

పేరు సుబ్బలక్ష్మి.. వయసు 45.. ఊరు కోరుకొండ మండలం గాడాల.. అంగన్‌వాడీ కార్యకర్త..ఈ నెల 8వ తేదీన జిల్లాలో ఉన్నతాధికారి పర్యటించారు. ఆయన గాడాల తనిఖీకి వస్తారని తెలిసింది.. అధికా రుల నుంచి జాగ్రత్తగా ఉండండి అనే మెసేజ్‌లు.. వెం టనే తీవ్ర ఒత్తిడికి గురయ్యారు.. అధికారి వస్తారు.. చూస్తారు.. వెళతారు.. అనే కనీస అవగాహన లేక పోవడంతో.. ఒత్తిడితో మధ్యాహ్నం గుండె పోటుకు గురై మృతిచెందింది.

పనిచేసి వెళ్లి.. గుండెపోటుకు గురయ్యారు..

పేరు ద్విభాష్యం శంకర్‌.. వయసు 49.. ఊరు ఉండ్రాజవరం మండలం పాలంగి.. గతంలో తణుకు మండల పరిషత్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసేవారు. ఇటీవల బదిలీపై నిడదవోలు మండలం సమిశ్రగూడెం మండల పరిషత్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా జాయి నయ్యారు.. ఈ నెల 3వ తేదీ శనివారం ఆఫీస్‌లో పనిచేసి ఇంటికి వెళ్లారు.. అయితే అర్ధరాత్రి గుండెపోటుకు గురై మృతిచెందారు. ఆయన మృతితో కుటుంబం దిక్కులేనిదైంది. అప్పటి వరకూ తమతో పనిచేసిన తోటి ఉద్యోగులు అవాక్కయ్యారు.

Updated Date - 2022-12-15T00:05:21+05:30 IST