విలువలకు కట్టుబడిన నేత తెన్నేటి విశ్వనాథం

ABN , First Publish Date - 2022-12-22T23:47:31+05:30 IST

నైతిక విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవే పరమావధిగా భావించి రాజకీయాలు నెరపిన కొద్దిమంది నాయకుల్లో తెన్నేటి విశ్వనాథం ఒకరని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు.

విలువలకు కట్టుబడిన నేత తెన్నేటి విశ్వనాథం
విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న వెంకయ్యనాయుడు

రాజమహేంద్రవరం అర్బన్‌, డిసెంబరు 22: నైతిక విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవే పరమావధిగా భావించి రాజకీయాలు నెరపిన కొద్దిమంది నాయకుల్లో తెన్నేటి విశ్వనాథం ఒకరని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన దేశభక్తి, నిస్వార్థత, సద్గుణ సంపద ఈ తరం యవతరానికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. గురువారం సాయంత్రం రాజమహేంద్రవరం జేఎన్‌ రోడ్డులోని ఆంధ్రకేసరి సెంటినరీ జూనియర్‌ కళాశాల అర్ధశతాబ్ది వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆంధ్రరాష్ట్ర తొలి రెవెన్యూ మంత్రి తెన్నేటి విశ్వనాథం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాజమహేంద్రవరం అనగానే ఒకవైపు వేదఘోష, మరోవైపు గోదావరి గలగలలు, నగరాన్ని కంటికి రెప్పలా కాపాడే సోమాలమ్మతల్లి ఆలయం, క్షేత్రపాలకుడు వేణుగోపాలకృష్ణ శిల్ప సంపద, ఆలయాలు, నన్నయ రాసిన ఆంధ్రమహాభారతం, కాటన్‌ మహాశయుడు నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజీ వంటివన్నీ ఆనందాన్ని ఆహ్లాదాన్ని కల్గిస్తాయని అన్నారు. ఇలాంటి గొప్ప నేలపై తెన్నేటి విశ్వనాథం విగ్రహం ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. రాజమహేంద్రవరంలో నన్నయ మహాభారతాన్ని ప్రారంభిస్తే నెల్లూరులో తిక్కన దాన్ని పూర్తి చేశారని గుర్తుచేశారు. తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన మహాభారత రచన ద్వారా రాజమహేంద్రి, నెల్లూరు నగరాలు చరిత్రలో నిలిచాయన్నారు. తెన్నేటి విశ్వనాథంతో తనకు వ్యక్తిగత అనుబంధం ఉందని, విద్యార్థి నాయకునిగా ఉన్న సమయంలో ఆయన సలహాలు, సూచనలు, ప్రోత్సాహం మరువలేనివన్నారు. తెన్నేటి విశ్వనాథం వెన్నంటే ఉండడం వల్ల ఆయన ప్రభావం తనపై కొంత పడిందని, ప్రజాప్రతినిధిగా సభలో వాగ్ధాటి స్వయంగా పొందినదే అయినా సమస్యల పట్ల అవగాహన విషయంలో మాత్రం తొలినాళ్లలో తెన్నేటి ప్రసంగాలను అధ్యయనం చేశానని తెలిపారు. జై ఆంధ్ర ఉద్యమంలో తెన్నేటి కేంద్ర కార్యాచరణ కమిటీ నాయకుడిగా ఉంటే తాను విద్యార్థి నాయకుడిగా ఉన్నానని చెబుతూ ఆ రోజుల్లో విశాఖపట్నం నుంచి అనంతపురం వరకూ కలసి ప్రయాణం చేసిన స్మృతులను గుర్తు చేసుకున్నారు. జమిందారీ విధానాలపై చట్టం, భూ సంస్కరణల వ్యవస్థ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన, కృష్ణ బ్యారేజీ నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనుల్లో ఆయన ప్రత్యక్షపాత్ర ఉందని అన్నారు. తెలుగు, సంస్కృత భాషల్లో పండితుడైన తెన్నేటి గొప్ప సాహితీవేత్త కూడా అని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధునిగా తెన్నేటి విశ్వనాథం నిజాయితీ, నిస్వార్థ సేవాతత్పరత ఈనాటి రాజకీయనాయకులు ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ నాయకులు ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో అర్థం కాని పరిస్థితి ఉందని, దీనిపై సుబ్రహ్మణ్య మైదానంలో బోర్డులు పెట్టాలన్నారు. ప్రస్తుతం, తాత్కాలికంగా ఉదయం 8 గంటలకు ఈ నాయకుడు ఈ పార్టీలో ఉన్నాడు. సాయంత్రం సంగతి మాకు తెలీదు అంటూ ఆయన చమత్కరించారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఈ పరిస్థితి నవ్వులాటగా మారిందని, తాను వ్యక్తిగతంగా ఎవ్వరి గురించీ చెప్పడంలేదని ఆయన స్పష్టంచేశారు. ముందుగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికి వెంకయ్యనాయుడు జీవితం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా కళాశాల నిర్వాహకులు వెంకయ్యనాయుడుకు మెమెంటో అందజేసి సత్కరించారు. రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, కంటిపూడి సర్వారాయుడు, తిరుమలరావు, ప్రస్తుత పాలకవర్గ సభ్యులు, పూర్వ పాలకవర్గ సభ్యులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-22T23:47:32+05:30 IST