జీతాలు రాక గురువులు గగ్గోలు

ABN , First Publish Date - 2022-12-07T00:38:14+05:30 IST

జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయలు ఘొల్లుమంటున్నారు. ఈనెల ఆరో తేదీ దాటిపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా జీతాలు చెల్లించకపోవడంతో లబోదిబోమంటున్నారు.

జీతాలు రాక గురువులు గగ్గోలు

(కాకినాడ,ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయలు ఘొల్లుమంటున్నారు. ఈనెల ఆరో తేదీ దాటిపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా జీతాలు చెల్లించకపోవడంతో లబోదిబోమంటున్నారు. అసలు ఈ నెల్లో ఎప్పుడు జీతాలు వస్తాయో కూడా తెలియకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అన్ని శాఖల ఉద్యోగులకు ఈ నెల జీతాలు ఎప్పుడో పడిపోగా, ఉపాధ్యాయులకు మాత్రం చెల్లించకపోవడంతో వారంతా ఒత్తిడికి గురవుతున్నారు. జీతాల చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులు ఆలస్యం చేయడం విద్యాశాఖ చరిత్రలో ఇదే తొలిసారి అని గుర్తుచేసుకుని నిట్టూర్చుతున్నారు. ఒకటో తేదీ రాగానే ఇంటి ఖర్చులు, ఈఎంఐలు చెల్లించాల్సిన గురువులైతే జీతాలు రాక, చేతిలో డబ్బులు లేక విలవిల్లాడుతున్నారు. కాకినాడ జిల్లాలో 6,500 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులుండగా వీరందరికి సరాసరి నెలవారీ జీతాల బడ్జెట్‌ రూ. 58.50 కోట్లు. కానీ రాష్ట్ర ప్ర భుత్వం వద్ద డబ్బుల్లేకపోవడంతో ఇంకా జీతాలు జమ చేయకపోవడం వీరందరిని కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులంటే వారికేంటి..అని ప్రతి ఒక్కరు అనుకునే పరిస్థితి. ఒకటో తేదీకి ఠంఛనుగా వేలల్లో జీతాలు ఖాతాల్లో పడతాయని అనుకుంటారు అందరూ.. కానీ ప్రస్తుత వైసీపీ సర్కారు హయాంలో ప్రభుత్వ టీచర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. సీపీఎస్‌ రద్దు కోసం మొన్నటివరకు పోరాడిన టీచర్లు ఇప్పుడు దాని సంగతి తరువాత ఒకటో తేదీకి జీతాలు వస్తే చాలు అన్నట్లు పరిస్థితి వచ్చింది. జగన్‌ సర్కారు తనదైన మార్కు ట్రీట్‌మెంట్‌ ఇస్తూ వేధింపులకు గురిచేస్తోంది. గడిచిన ఆరునెలలుగా జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఠంఛనుగా పడడం లేదు. ప్రతినెలా చాలా ఆలస్యమవుతోంది. ఇందులో టీచర్లకు మరీ దారుణం. అసలు జీతాలు ఎప్పుడు బ్యాంకు ఖాతాలో పడతాయో తెలియని పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది. ప్రభుత్వంలో నిధుల కొరత, అప్పు పుట్టకపోవడంతో నెలనెలా జీతాల చెల్లింపు చాలా ఆలస్యమవుతోంది. తాజాగా ఈ డిసెంబరు నెలలో అప్పుడే ఆరో తేదీ దాటిపోయింది. అయినా టీచర్లకు జీతాలు పడలేదు. దీంతో జిల్లాలో 6,500 మంది వరకు ఉపాధ్యాయులు, డీఈవో కార్యాలయం, కేజీబీవీల సిబ్బంది అంతా ఆందోళన చెందుతున్నారు. వీరందరికి రూ.58.50 కోట్ల వరకు ఈనెల జీతాల బడ్జెట్‌ చెల్లించాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా జీతాలు చెల్లించకపోవడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. ఇంటి ఖర్చులకు డబ్బులు లేక అల్లాడుతున్నారు. ఈఎంఐలు చెల్లించాల్సిన వారైతే వడ్డీలు, అపరాధ రుసుములు భరించలేక అప్పులు చేసి కట్టుకుంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కొంచెం ఆలస్యం అయినా టీచర్లకు ముందస్తు ప్రాధాన్యం ప్రకారం సర్కారు వేతనాలు చెల్లించేది. కానీ ఈనెల మాత్రం అందరికీ చెల్లించి ఉపాధ్యాయులకు మాత్రం పక్కనపెట్టడంపై టీచర్లంతా కారాలు మిరియాలు నూరుతున్నారు. సీపీఎస్‌ రద్దు, పాత పెన్షన్‌, డీఏ బకాయిల కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా ఉపాధ్యాయులు గడచిన కొన్ని నెలలుగా పోరాడుతున్నారు. దీనిపై ఆగ్రహంతోనే రాష్ట్ర ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ ప్రభుత్వ ఉపాధ్యాయులే పోలింగ్‌ విధులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుండగా, ఈసారి ఉపాఽధ్యాయుల సెగ రానున్న ఎన్నికల్లో తగులుతుందేమోననే భయంతో వారిని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తున్నట్లు జగన్‌ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. బోధనేతర పనులు చేయించకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేశామంటూ ప్రభుత్వ పెద్దలు కలరింగ్‌ ఇచ్చారు. జీతాల ఆలస్యంపై రెండు రోజులుగా టీచర్లు ఆందోళన చెందుతుండడంతో ఉపాధ్యాయుల జీతాల బిల్లులు సిద్ధం చేసే ఉద్యోగులు కొందరు మంగళవారం రాత్రి పలువురు టీచర్లకు మెసేజ్‌లు పంపించారు. రాష్ట్రప్రభుత్వం వద్ద నిధులు లేనందున, డిసెంబర్‌ 15వ తేదీలోగా అప్పుడప్పుడు కొంతమంది ఉపాధ్యాయులకు జీతాలు పడే అవకాశం ఉందని అందులో పేర్కొనడం విశేషం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రూ.17 వేల రెవెన్యూ లోటుతో ప్రస్థానం ప్రారంభించింది. ప్రభుత్వం నడవడానికి 2014 నుంచీ ఎన్ని ఇబ్బందులున్నా అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఏరోజు ఆలస్యం చేయలేదు. ముఖ్యంగా ఉపాధ్యాయులకైతే ఠంఛనుగా ఒకటో తేదీన జీతాలు బ్యాంకు ఖాతాల్లో పడేవి. అలాగే తెలంగాణ రాష్ట్రంతో పోటీగా ఉపాధ్యాయులకు ఫిట్‌మెంట్‌ చంద్రబాబు ప్రభుత్వం చెల్లించింది. డీఏ బకాయిల దగ్గర నుంచి పీఎఫ్‌ డబ్బులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు చెల్లించాల్సిన డబ్బులు అన్ని సకాలంలో చెల్లించేది. కానీ జగన్‌ ప్రభుత్వం గద్దెనెక్కాక ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది. డీఏ బకాయిల దగ్గర నుంచి పెన్షన్‌ బకాయిల వరకు ఏవీ చేతికి రావడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల బకాయిల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం బేఖాతరుగా వ్యవహరిస్తుండడంతో వారంతా రగిలిపోతున్నారు.

Updated Date - 2022-12-07T00:38:16+05:30 IST