దడ..బడి!

ABN , First Publish Date - 2022-08-04T05:55:13+05:30 IST

విద్యార్థులు తల్లిదండ్రులు అయోమయంలో పడిపోయారు.. ఈ ఏడాది చదువెలా అనే ఆందోళనలో ఉన్నారు..

దడ..బడి!
కొవ్వూరు మండలం చిడిపి పాఠశాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన (ఫైల్‌)

విలీనంతో సర్కారీ చదువుకు ఇక్కట్లు 

బడికి దూరమవుతున్న విద్యార్థులు

టీసీలకు 20 శాతం మంది దరఖాస్తు

ప్రైవేటు పాఠశాలల వైపు చూపు

విలీనం ఆపాలని పలు చోట్ల డిమాండ్‌

కి.మీ దూరంలో బడికి పంపలేని భయం

అయినా పట్టువీడని  ప్రభుత్వం

ఖాళీగా ప్రాథమిక పాఠశాలలు.. ఫుల్‌గా హైస్కూళ్లు

 ఒత్తిడికి గురవుతున్న ఉపాధ్యాయులు


విద్యార్థులు తల్లిదండ్రులు అయోమయంలో పడిపోయారు.. ఈ ఏడాది చదువెలా అనే ఆందోళనలో ఉన్నారు.. ప్రభుత్వం విలీనం పేరుతో ప్రాథమిక పాఠశాలలో 3,4,5 తరగతులను కిలో మీటరు దూరంలో ఉన్న హైస్కూళ్లలో  కలిపేసింది. అంత దూరం చిన్నారులను ఎలా పంపాలి..ఎలా తీసుకురా వాలి.. అని భయపడుతున్నారు. ఇటీవల కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలం పాశర్లపూడి బాడవ మండల ప్రజాపరిషత్‌ ఎలిమెంటరీ పాఠశాలలో ఘటనే దీనికి ఉదాహరణ.. హైస్కూల్‌కు వచ్చిన పిల్లలను ఈ స్కూల్‌ వద్దు.. పాత స్కూలే కావాలం టూ తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లిపోయారు. ఇటువంటివి ఈ జిల్లాలోనూ ఉన్నాయి. రాజ మహేంద్రవరం అన్నపూర్ణమ్మపేటలోని స్కూల్‌ను తీసుకెళ్లి దానవాయిపేట హైస్కూల్‌లో విలీనం చేశారు.. ఇదీ ఇబ్బందే.. మరో పక్క ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరు అక్కడ.. మరొకరిని ఇక్కడా చదివించడం ఎందుకని ప్రైవేట్‌ స్కూళ్ల బాట పడుతున్నారు. 


  ( రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

విలీన విషాదం అంతా ఇంతా కాదు.. చదు వునే దూరం చేసేశారు. ఒక పక్క సర్కారీ స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నా మని చెబుతూనే.. వాటి పతనానికి కారకులవు తున్నారు.. చిన్నా రులను తల్లిదండ్రులు కిలోమీటరు దూరం లో ఉన్న పాఠశాలకు పంపాలంటే ఆలోచిస్తున్నారు.. ఎక్కడికక్కడ ప్రాథమిక పాఠశాల విద్యా ర్థులు ప్రైవేటు స్కూళ్ల బాటపడుతున్నారు. టీసీలు తీసుకునే పనిలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నారు. దీంతో ప్రాథమిక పాఠశాలలు ఖాళీ అయి పోతుండగా..హైస్కూళ్లు మాత్రం కిక్కిరిసి పో తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు విలీనం వల్ల విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోవడం గమనార్హం. హైస్కూళ్ల వరకూ పర్వాలేదు. కానీ ఎలి మెంటరీ స్కూళ్లలో విద్యార్థుల కొరత ఏర్పడింది. విలీనం వద్దని ఎంత మంది గోడుపెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతేడాది 3 కిలోమీటర్ల లోపు ఉన్న పాఠశాలలను విలీనం చేశారు. ఈ ఏడాది దూరంలో మార్పు చేశారు. ఒక కిలోమీటరు దూరంలో ఉన్న పాఠశాలలను విలీనం చేశారు. కార్పొరేషన్‌, మునిసిపాలిటీలో అదే ప్రాంగణంలో ఉన్న పాఠశాలలను విలీనం చేశారు. కొన్ని ఎయిడెడ్‌ పాఠశాలలు మూతపడ్డాయి. ఎలిమెంటరీ స్కూ ళ్లలోని మూడు నుంచి 5వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులను సమీపంలోని హైస్కూళ్లలో విలీనం చేశారు. గ్రామాల్లో ఇది దూరం అవ్వడంతో కొందరు విద్యార్ధులు వెళ్లడం మానేశారు. జిల్లాలో 1600 పాఠశాలలు ఉన్నా యి.గతేడాది 2 లక్షల 50 వేల మంది వరకూ విద్యార్థులు ఉన్నారు. ఇప్పటి వరకూ ఒకటవ తరగతిలో  21,378 మంది  కొత్తగా చేరారు. అందులో బాలురు 11, 030, బాలికలు 10,348 మంది ఉన్నారు.గతేడాది చదివిన వారిలో సుమారు 20 శాతం మంది టీసీలు తీసుకుని వెళ్లిపోవడం గమనార్హం.   


దూరమైపోయిన బంధం


అమ్మా తమ్ముడు జాగ్రత్త.. నాన్నా చెల్లి జాగ్రత్త.. పాఠశాలకు వెళ్లేటప్పుడు అమ్మకు ఈ మాట చెప్పే అవకాశం పోయింది.  ఎలిమెంటరీ స్కూళ్లలో  అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లు, అక్కా చెల్లెళ్లు కలిసి చదువుతుంటారు. అక్క ఓ క్లాస్‌ అయితే, తమ్ముడు మరో క్లాస్‌ అయినా ఇద్దరూ కలిసి వెళ్లేవారు. ప్రస్తుతం మూడు నుంచి 5 తరగతులను వేరు చేయడం వల్ల 1,2 తరగతుల్లో చదువుతున్న చిన్న పిల్లలకు అన్న, అక్కల తోడు లేకుండా పోయింది. వీరంతా మానేస్తున్నారు. రాజమహేంద్రవరం మునిసిపాలిటీలో ఇలా చాలా మంది మానేశారు. ఎలిమెంటరీ స్కూళ్లు ఖాళీ అయిపోతుంటే,  విలీనం వల్ల హైస్కూళ్లలో తరగతులు సరిపోవడం లేదు. ఒకే గదిలో  రెండు క్లాసులు నిర్వహిస్తున్న పాఠశాలలు చాలా ఉన్నాయి. నాడు-నేడుతో పాఠశాలు అభివృద్ధి చేస్తున్నా సకాలంలో అందుబాటులోకి రాలేదు. కొన్ని అభివృద్ధి చేసిన ఎలిమెంటరీ స్కూళ్ల భవనాలు ఖాళీగా ఉండిపోతున్నాయి.  


ప్రభుత్వ విద్యార్థుల ప్రైవేటు బాట..


రాజమహేంద్రవరం రూరల్‌ ఆగస్టు 3 : ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం తగ్గి.. ప్రైవే టు పాఠశాలల్లో  పెరిగింది. రూరల్‌ మండలం పరిధి కాతేరులో 4, కోలమూరులో 1, బొమ్మూరు 1, రాజ వోలులో 1, ధవళేశ్వరంలో 2, హుకుంపేటలో 1 మొత్తం 10 పాఠశాలలను విలీనం చేశారు. అయితే హైస్కూ ళ్లు కూడా వీటికి దగ్గరలోనే ఉండడంతో విద్యార్థులు జాయినయ్యారు. అయితే కొంతమంది తల్లిదండ్రులు మాత్రం వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో జాయిన్‌ చేసేశారు. గతేడాది రూరల్‌ మండలం పరిధిలో 12,125 విద్యార్థులు ఉండగా ప్రస్తుత సంవత్సరం సుమారు 550 మంది విద్యార్థులు తగ్గారని విద్యాశాఖ అఽఽదికారులు చెబుతున్నారు.   

కోరుకొండలో తగ్గిన అడ్మిషన్లు


కోరుకొండ, ఆగస్టు 3 : పాఠశాలల విలీనం వల్ల ఈ విద్యా సంవత్స రంలో ఒకటో తరగతి అడ్మిషన్లు గణనీయంగా తగ్గిపోయాయి. మండ లానికి సంబంధించి కణుపూరు గ్రామంలో రెండు ప్రాథమిక పాఠశా లలను సమీపంలోని హైస్కూల్‌లో కలిపారు.మధుర పూడి,బూరు గుపూడి,బొల్లెద్దుపాలెం, రాఘవాపురం, గాదరాడ గ్రామా ల్లోని ప్రాఽథమిక పాఠశాలలు హైస్కూళ్లలో విలీనం చేశామని ఎంఈవో దొర తెలిపారు. 


టీచర్లపై ఒత్తిడి


 ప్రకాష్‌నగర్‌ (రాజమహేంద్రవరం) ఆగస్టు 3 : ప్రాథమిక పాఠశాల విద్యార్థులు  ప్రైవేటు బాట పడుతున్నారు. అన్నపూర్ణమ్మపేట పాఠశాలలో 1,2 తరగతుల విద్యార్థులు 9 మంది ఉండగా సుమారు రూ.18 లక్షల ఖర్చుతో  రెండోదశ నాడు నేడు పనులు చేస్తున్నారు. రాజేంద్రనగర్‌లోని సీతారాంపేట పాతకచేరి మునిసిపల్‌ ప్రాథమిక పాఠశాలలో ఈ ఏడాది 85 మంది విద్యార్థులు ఉండగా ముగ్గురు ఉపాధ్యాయులు ఉండాలి. అయితే ఇద్దరు మాత్రమే ఉన్నారు.  పాఠశాలలో ఉన్న రెండు తరగతి గదుల్లో ఒక గదిలో నిర్మాణపు సామగ్రి నిల్వచేశారు.ఉన్న ఒక్క తరగతి గది ,ఇరుకు వరండాలోనే 85 మంది విద్యార్థులు ఇరుక్కుని కూర్చుంటున్నారు. విలీనంతో  ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.


తగ్గిన హాజరు..


గోకవరం, ఆగస్టు 3: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల హాజరుశాతం  గణనీయంగా తగ్గిపోయింది. మండ లంలో మూడు పాఠశాలలు హైస్కూళ్లలో విలీనం చేశా రు.తంటికొండ మెయిన్‌ స్కూల్లో గతంలో సుమారుగా 150 మంది విద్యార్థులు ఉండేవారు. విలీనం కారణంగా 3,4,5 తరగతులకు చెందిన 125 మంది విద్యార్థులకు 100 మంది హైస్కూ ల్‌లో చేరారు. మిగిలిన 25 మంది ప్రైవేట్‌ పాఠశాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం 1,2 తరగతుల్లో 25 మంది విద్యార్థులే ఉన్నారు.కామరాజు పేట దుళ్లవీధి పాఠశాలలో 1,2 తరగతుల్లో ప్రస్తుతం 17 మంది ఉన్నారు. 3,4,5 తరగతులను సమీపంలోని హైస్కూల్‌లో విలీనం చేయడంతో 12 మంది ఆ పాఠ శాలలో చేరగా 11 మంది ప్రైవేట్‌ స్కూల్‌లో చేరారు.   దుర్గాకాలనీ పాఠశాలలో 1,2 తరగతుల్లో 15 మంది విద్య నభ్యసిస్తుండగా 3,4,5 తరగతులకు చెందిన 43 మంది విద్యార్థులకు 41 మంది సమీపంలోని జడ్పీ ఉన్నత పాఠ శాలలో విద్యనభ్యసిస్తుండగా మిగిలిన ఇద్దరూ ప్రైవేటు పాఠశాలను ఆశ్రయించారు. 


బడిని దూరం చేశారు..

నా పేరు గాదల లక్ష్మీదుర్గ.. అన్నపూర్ణమ్మ పేటలో ఉంటున్నాం.. ఇప్పటి వరకూ మా పిల్లలిద్దరు గాదల హేమంత్‌, శ్యామ్‌ అన్నపూర్ణమ్మపేటలోని ప్రాథమిక పాఠశాలలో చదివేవారు. అయితే ఇటీవల స్కూల్‌ను దానవాయిపేట మునిసిపల్‌ హైస్కూల్‌లో విలీనం చేశారు. దానవా యిపేట మునిసి పల్‌ హైస్కూల్‌కు వెళ్లాలంటే చాలా దూరం.. రోడ్డు చాలా రద్దీగా ఉం టుంది. కూలి పని చేసుకునే వాళ్లం ఆటో పెట్టాలన్నా కష్టమే. జగనన్న అమ్మఒడి వస్తుందిగా  ఆ డబ్బుతో మా పిల్లలిద్దరినీ ప్రైవేటు పాఠశాలలో వేయాలని నిర్ణయించు కుని టీసీలకు అప్లయ్‌ చేశాం. విలీనంతో మాలాంటి పేదలకు చదువును దూరం చేసేశారు.

Updated Date - 2022-08-04T05:55:13+05:30 IST