బరుల ధ్వంసం

ABN , First Publish Date - 2022-01-13T06:06:55+05:30 IST

సంక్రాంతి పండుగను సాంప్రదాయ బద్ధంగా నిర్వహించుకోవాలని, కోడిపందేలు, గుండాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాధ్‌బాబు తగిన చర్యలు చేపట్టారు.

బరుల ధ్వంసం
పందేల నిర్వహణ కోసం సిద్ధం చేసిన బరిని ధ్వంసం చేయిస్తున్న పోలీసులు

కాకినాడ క్రైం, జనవరి 12: సంక్రాంతి పండుగను సాంప్రదాయ బద్ధంగా నిర్వహించుకోవాలని, కోడిపందేలు, గుండాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాధ్‌బాబు తగిన చర్యలు చేపట్టారు. పటిష్ట వ్యూహంతో కోడిపందేల కోసం సిద్ధం చేస్తున్నారన్న సమాచారంతో  స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులతోసమాచారం తెప్పించుకుని బరులను ధ్వంసం చేయిస్తున్నారు. ఇందు కోసం క్షేత్రస్థాయిలో రెవెన్యూ, స్పెషల్‌ బ్రాంచ్‌, స్థానిక పోలీసుల సమన్వయంతో బరులను గుర్తించి నివారణకు కృషి చేస్తున్నారు. రాబోయే సంక్రాంతి పండుగలో కోడిపందేల నిర్వహణకు ఎటువంటి అధికారిక, అనధికారిక అనుమతులు ఉండవని, అటువంటి ప్రచారాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత స్థానిక పోలీసులపై ఉందని ఎస్పీ స్పష్టం చేయడంతో ఎక్కడికక్కడే బరులను గుర్తించడం, యాజమానులకు నోటీసులు ఇవ్వడం, నిర్హాకులకు హెచ్చరికలు జారీ చేయడం చేస్తున్నారు. కోడిపందేలు, జూదం, గుండాట వంటి వాటికెళ్లవద్దని, సాంప్రదాయ క్రీడోత్సవాలు ఇటీవల జిల్లా వ్యాప్తంగా నిర్వహించి సంక్రాంతి పండుగ, సాంప్రదాయ క్రీడలపై అవగాహన కల్పించారు. అమలాపురం, రామచంద్రపురం, పెద్దాపురం సబ్‌ డివిజన్లు, ఏజెన్సీ ప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లో కోడిపందేల నిర్వహణ, బరులపై అకస్మిక దాడులను గత రెండు రోజులుగా పోలీసులు నిర్వహించి ధ్వంసం చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని, ఎవరైనా కోడిపందేలు, గుండాట,జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రవీంద్రనాధ్‌బాబు హెచ్చరించారు. సంక్రాంతిని సంప్రదాయబద్ధంగా ఆహ్లాదకరమైన వాతావరణంఓ కుటుంబ సభ్యులతో ఆట,పాటలతో జరుపుకోవాలనికోరారు.

Updated Date - 2022-01-13T06:06:55+05:30 IST