ఉప్పు.. పప్పు వద్దు.. పోలవరం పరిహారం ఇవ్వండి

ABN , First Publish Date - 2022-07-18T07:18:54+05:30 IST

వరదల్లో సర్వం కోల్పోయాం ప్రతీ ఏడాది ఇటు వంటి బాధలుపడలేం మాకు మీరు ఇచ్చే ఉప్పు, పప్పు నిత్యావసర వస్తువులు వద్దు మాకు వెంటనే పోలవరం పరిహారం ఇప్పించాలంటూ గోదావరి వరద బాధితులు అధికారుల ముందు తమ గోడు విలపించారు.

ఉప్పు.. పప్పు వద్దు.. పోలవరం పరిహారం ఇవ్వండి

నిత్యావసరాలు తిరస్కరించిన వరద బాధితులు

కూనవరం, జూలై 17:  వరదల్లో సర్వం కోల్పోయాం ప్రతీ ఏడాది ఇటు వంటి బాధలుపడలేం మాకు మీరు ఇచ్చే ఉప్పు, పప్పు నిత్యావసర వస్తువులు వద్దు మాకు వెంటనే పోలవరం పరిహారం ఇప్పించాలంటూ గోదావరి వరద బాధితులు అధికారుల ముందు తమ గోడు విలపించారు. కడపజిల్లా బద్వేల్‌ ప్రస్తుత ఆర్డీవోగా పనిచేస్తున్న గతంలో పనిచేసిన చింతూరు ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణను వరదలు ఉధృతమైన తరుణంలో గత అనుభవ దృష్ట్యా ఆయనను ప్రస్తుతం విలీన మండలాలకు ప్రత్యేక అధికారిగా నియమించారు. ఆయన ఆదివారం అల్లూరుసీతారామరాజు జిల్లా కూనవరం మండలంలోని కోతులగుట్ట పునరావాస కేంద్రంలో పర్యటించిన సందర్భంగా ఆయనతో వరద బాధితులు మాట్లాడారు. 41 కాంటూరులో కలిపి తమకు తక్షణమే ఆర్‌అండ్‌ఆర్‌  పరిహారం ప్రకటించాలన్నారు. ఆస్తులు పోగొట్టుకున్నామని, కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలలో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపు కూనవరం అటవీశాఖ కార్యాలయంలోని పునరావాస కేంద్రంలో నాటుపడ వల ద్వారా పంపిన నిత్యావసర వస్తువులను అక్కడి వరద బాదితులు తిరస్కరించారు. ఐదు రోజులుగా చుట్టూ గోదావరి ఉన్నప్పటికీ అధికారులు తమపై కన్నెత్తికూడా చూడలేదని వరద ఉధృతమైతే మా పరిస్థితి ఏమిటని వారు అధికారులను ప్రశ్నించారు. మండలంలోని పలు గ్రామాలలో ఇంకా కనీస వసతులు అందలేదు. కనీసం అధికారులు కూడా తమ గ్రామాలవైపు కన్నెత్తి చూడలేదని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ మార్గాలగుండా అధికారుల వద్దకు వ చ్చి తమను ఆదుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. 

అధికారులను వెనక్కి పంపిన నిర్వాసితులు 

 ఫారెస్ట్‌ కార్యాలయంలో తలదాచుకున్న వరద బాధితులకు నిత్యావసర వస్తువులు ఇచ్చేందుకు ఉదయం కూనవరం ఎస్‌ఐ బి.వెంకటేష్‌ వెళ్లారు. అయితే పోలవరం పరిహారం ఇచ్చాకే తమతో మాట్లాడాలని అప్పటివరకు మాకు ఇటువంటివి వద్దని తేల్చి చెప్పారు. సాయంత్రం 4 గంటల సమయంలో బాధ్యతలు తీసుకున్న ప్రస్తుత విలీన మండలాల వరద ప్రత్యేకాధికారి ఆకుల వెంకటరమణ ఫారెస్ట్‌ కార్యాలయానికి వెళ్లి నిత్యావసర వస్తువులు తీసుకోవాలని సర్ధి చెప్పారు. ఏ అధికారి వచ్చినా తాము నిత్యావసర వస్తువులు తీసుకునే ప్రస్తక్తేలేదని, పరిహారం గురించి మాట్లాడేటట్లు అయితేనే తమ వద్దకు రావాలని బాధితులు తేల్చి చెప్పేశారు. దీంతో గత్యంతరం లేక తీసుకువెళ్లిన నిత్యావసర వస్తువులను స్పెషల్‌ ఆఫీసర్‌ వెనక్కి తీసుకుని వెళ్లిపోయారు. ఇదే స్ఫూర్తితో పరిహారం వచ్చేంతవరకు ఐక్యంగా కొనసాగుతామని వారు పేర్కొన్నారు.

మానవత్వం చాటుకున్న గిరిజన యువకుడు

16 కుటుంబాల వరద బాధితులకు ఆశ్రయం 

కూనవరం, జూలై 17: వరదలు ఉగ్రరూపం దాల్చిన సమయంలో ఎటుపోవాలో తెలియని పరిస్థితి కాస్త పొడినేల ఉంటే చాలు అక్కడ తలదాచుకోవాలనే ఆలోచన వరద బాధితుల్లో ఉంటుంది. ఈసారి వచ్చిన ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ఇటువంటి సమయంలో నెనున్నానంటూ వరద బాధితులకు అండగా నిలిచాడు ఈ గిరిజన యువకుడు. మండలంలోని కోతులగుట్ట గ్రామానికి చెందిన తుస్టి జోగారావు ఎత్తైన ప్రదేశంలో ఇల్లు నిర్మించుకున్నాడు. వచ్చిన వరదలకు వరద బాధితులు ఎటూ వెళ్లలేని పరిస్థితిల్లో సుమారు 16 కుటుంబాలని తమ ఇంట్లో ఉండేందుకు చేరదీసి అండగా నిలిచాడు. గోదావరి తగ్గుముఖం పట్టేంత వరకు తన ఇంట్లో నివాసం ఉండవచ్చని వరద బాధితులకు ధైర్యం చెప్పారు. తాగునీటితోపాటు మరికొన్ని వసతులు వరద బాధితులకు కల్పించారు. అంతేకాకుండా ఇల్లు ఇరుకవుతున్న నేపథ్యంలో జోగారావు వేరే చోట నివాసం ఉంటూ వీరికి సౌకర్యాలు కల్పిస్తుండటంతో బాధితులు అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జోగారావు కూనవరం కోతులగుట్ట ఆసుపత్రిలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం చేస్తున్నాడు. జోగారావు చేస్తున్న సేవపట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సిగ్నల్‌ కోసం పాట్లు

గత వారంరోజులుగా గోదావరి వరద గ్రామాలను ముంచెయ్యడంతో ఫోన్‌ సిగ్నల్‌ వ్యవస్థ నిలిచిపోయింది. దీంతో వరద బాధి తుల బంధువులు ఆందోళన చెం దుతున్నారు. తమ వారు ఎక్కడున్నారు, ఏమైపోయారంటూ వరద బాధితులపట్ల భయాందోళనలో ఉన్నారు. దీంతో తాము బాగానే ఉన్నామంటూ తమ క్షేమం చెప్పుకుంటూ వరద  బాధితులు సిగ్నల్‌ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎతైన ప్రదేశాలు ఎక్కుతూ సిగ్నల్‌ కోసం అన్వేషిస్తున్నారు. కోతులగుట్ట పునరావాస కేంద్రంలో ఓ స్వచ్ఛంద సంస్థలు ఎతైన ఆసుపత్రికి తమ బంధువులకు యోగక్షేమాలు చెబుతున్న దృశ్యం ఆంధ్రజ్యోతి కంటపడింది. 


Updated Date - 2022-07-18T07:18:54+05:30 IST