పేరులో ప్రత్యేకం నిర్వహణలో అలక్ష్యం?

ABN , First Publish Date - 2022-11-24T01:13:48+05:30 IST

ఆసియాలోనే అతిపెద్ద రోడ్డుకమ్‌రైలు రెండో వంతెన. పేరులో చూస్తే ప్రత్యేకం.. నిర్వహణలో చూస్తే ఆలక్ష్యం. ఎంతలా అంటే మూడు నెలల క్రితం బ్రిడ్జి మరమ్మత్తుల నిమిత్తం ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రభుత్వానికి కోటి రూపాయలు ప్రతిపాదనలు పంపితే నేటికి అందని వైనం.

పేరులో ప్రత్యేకం నిర్వహణలో అలక్ష్యం?
రోడ్‌ కం రైలు బ్రిడ్జి

రోడ్డు కం రైలు బ్రిడ్జికి 48 ఏళ్లు

ఆసియాలో పేరున్నా.. మరమ్మతులపై చిన్నచూపే

రూ. కోటితో ప్రతిపాదనలు పంపితే నేటికీ రాని వైనం

కొవ్వూరు, నవంబరు 23 : ఆసియాలోనే అతిపెద్ద రోడ్డుకమ్‌రైలు రెండో వంతెన. పేరులో చూస్తే ప్రత్యేకం.. నిర్వహణలో చూస్తే ఆలక్ష్యం. ఎంతలా అంటే మూడు నెలల క్రితం బ్రిడ్జి మరమ్మత్తుల నిమిత్తం ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రభుత్వానికి కోటి రూపాయలు ప్రతిపాదనలు పంపితే నేటికి అందని వైనం. ఒక పక్క బ్రిడ్జి గోదావరిలోకి ఒరిగిపోతున్నా.. మరో పక్క రైలింగ్‌ ఊడిపడిపోతున్నా పట్టించుకోని ప్రభుత్వం. ఇది మన పాలకుల తీరుకు నిదర్శనం. రోడ్డు కం రైలు వంతెన జిల్లా కేంద్రంలోనే ఉంది. ఇటీవల బ్రిడ్జి మరమ్మత్తుల పేరుతో అక్టోబరు 14వ తేదీ నుంచి అక్టోబరు 27వ తేదీ వరకు 13 రోజుల పాటు బ్రిడిపై రాకపోకలను పూర్తిగా నిలుపుదల చేశారు. వంతెన తెరిచాకా చూస్తే వంతెనపై చేసిందేమి లేదు. చిన్నపాటి రోడ్డు ప్యాచ్‌ వర్కు తప్ప. బ్రిడ్జి పరిస్థితి చూస్తే ప్రమాదకరంగా ఉంది. నేటికి బ్రిడ్జి రైలింగ్‌ సరిచేయలేదు. ఎవరైనా గోదావరి అందాలను తిలకించడానికి ఫుట్‌పాత్‌ ఎక్కితే గోదావరిలో పడిపోయే అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే రోడ్డు కం రైలు బ్రిడ్జి ప్రారంబించి సరిగ్గా నేటికి 48 ఏళ్లు పూర్తయింది. కొవ్వూరు రాజమహేంద్రవరంలను కలుపుతూ సరిగ్గా 48 ఏళ్ల కిందట 1974 నవంబరు 23వ తేదీన అప్పటి రాష్ట్రపతి ఫకృద్దీన్‌ ఆలీ అహ్మద్‌ వంతెనను జాతికి అంకి తం చేస్తూ ప్రారంభించారు. ఇటీవల అధికారులు ఏమన్నారంటే కొంతకాలం తరువాత బ్రిడ్జిపై రాకపోకలు కూడా కష్టమేనన్నారు. పాలకులు వంతెన విషయంలో ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే బ్రిడ్జి పూర్తిగా మూతపడే అవకాశాలున్నాయి. పాలకులారా ఇకనైనా మేల్కొండి.బ్రిడ్జి నిండు నూరేళ్లు ఉండేలా శాశ్వత మరమ్మత్తులు చేపట్టి, భవిష్యత్తరాలకు సేవలందించేలా చర్యలు చేపట్టాలని గోదావరి వాసులు కోరుతున్నారు.

Updated Date - 2022-11-24T01:13:48+05:30 IST

Read more