రత్నగిరిపై శ్రీపుష్పోత్సవం

ABN , First Publish Date - 2022-05-18T06:38:32+05:30 IST

కోరినకోర్కెలు తీర్చే కలియుగ దైవం అన్నవరం సత్యదేవుడి దివ్య కల్యాణోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి స్వామి,అమ్మవార్ల శ్రీ పుష్పయోగ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది.

రత్నగిరిపై శ్రీపుష్పోత్సవం

అన్నవరం, మే 17: కోరినకోర్కెలు తీర్చే కలియుగ దైవం అన్నవరం సత్యదేవుడి దివ్య కల్యాణోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి స్వామి,అమ్మవార్ల శ్రీ పుష్పయోగ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. రాత్రి 7.30కు వివిధ సుగందభరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన నిత్య కల్యాణ మండపానికి ప్రధానాలయం నుంచి నవదంపతులైన సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను, పెండ్లిపెద్దలైన సీతారాములను మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేద మంత్రాల నడుమ తీసుకునివచ్చి అక్కడ ఏర్పాటు చేసిన వెండి సింహాసనంపై కొలువుదీర్చారు. ప్రధానార్చకుడు కోట శ్రీను ఆధ్వర్యంలో పండితులు ముత్య సత్యనారాయణ, నాగాభట్ల కామేశ్వరశర్మ, పాలంకి చినపట్టాభి తదితరులు విఘ్నేశ్వరపూజతో కార్యక్రమం ప్రారంభించారు.   పుష్పాలతో ప్రత్యేకంగా తయారు చేసిన ఊగుటూయలలో శేషపాన్పుపై శయనించిన విష్ణుమూర్తిగా స్వామివారిని, ఆయన పాదాలను సుతిమెత్తగా ఒత్తుతున్న లక్ష్మీదేవిగా అమ్మవారిని ఉంచి అనేక రకాలైన పుష్పాలతో అర్చన చేశారు. దేవస్థానమే స్వయంగా ఈ ఏడాది తయారు చేయించిన నేతి మిఠాయిలతో పాటు పలు రకాలైన తీపి పదార్థాలను స్వామికి నివేదించారు. పుష్పార్చన అనంతరం శయన సేవలో ఉన్న నవదంపతులను భక్తులు దర్పణంలో వీక్షించి పునీతులయ్యారు. వేడుక తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు. కార్యకమ్రంలో ఈవో త్రినాథరావు, చైర్మన్‌ రోహిత్‌, సహాయ కమిషనర్‌ రమేష్‌బాబు, పీఆర్వో కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకతో శుభకృత్‌ నామ సంవత్సర కల్యాణోత్సవాలు ముగిశాయి.

Read more