జలజల... గలగలా...
ABN , First Publish Date - 2022-02-24T07:11:41+05:30 IST
జిల్లాలో రంపచోడవరం ఏజెన్సీ అంటేనే ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. వయ్యారాలు పోతూ పారే వాగులు.. రారమ్మని పిలిచే జలపాతాలు.. కట్టిపడేసే సహజసిద్ధ అడవులు.. గిరిజన గూడేలు... వర్ణించడానికి మాటలు చాలవు. ఇక్కడి అందాలు చూసేందుకు అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు పొటెత్తుతారు. వీటిని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రయత్నం చేయలేదు. దీంతో అసౌకర్యాల మధ్యే పర్యాటకులు తనవితీరా ప్రకృతిని ఆస్వాదిస్తుంటారు. అయితే ఇప్పుడు ఇక్కడున్న వాగులు, జలపాతాలను అభివృద్ధి చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది. రూర్బన్ పథకం కింద రూ.1.03 కోట్లు మంజూరు చేసింది. రంపచోడవరం మండలంలోని రంప వాటర్‌ఫాల్, ఐ.పోలవరం వాగు పరిసరాల్లో పార్కులు, విశ్రాంతి గదులు, టాయిలెట్స్, దుస్తులు మార్చుకునే వెసులుబాటు, పగోడాలు, లాన్‌లు తీర్చిదిద్దడానికి నిర్ణయించింది.
రంపచోడవరంలో పర్యాటక ప్రాంతాలకు మంచిరోజులు
జలపాతాలు, వాగుల అభివృద్ధికి రూర్బన్ పథకం కింద కేంద్రం కోటి నిధులు
రూ.65.36 లక్షలతో ఐ.పోలవరం వాగు అభివృద్ధికి పర్యాటక అభివృద్ధి సంస్థ రెడీ
ఏడెకరాల్లో పార్కు, పాత్‌వేలు, దుస్తులు మార్చుకునే గదులు, వాగు వద్దకు మెట్లు
అటు రూ.36.32 లక్షలతో రంప వాటర్‌ఫాల్‌లోనూ పర్యాటక వసతులు
ఆరు నెలల్లో పనులు పూర్తయ్యేలా టెండర్లు పిలిచిన ఏపీటీడీసీ
జిల్లాలో రంపచోడవరం ఏజెన్సీ అంటేనే ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. వయ్యారాలు పోతూ పారే వాగులు.. రారమ్మని పిలిచే జలపాతాలు.. కట్టిపడేసే సహజసిద్ధ అడవులు.. గిరిజన గూడేలు... వర్ణించడానికి మాటలు చాలవు. ఇక్కడి అందాలు చూసేందుకు అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు పొటెత్తుతారు. వీటిని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రయత్నం చేయలేదు. దీంతో అసౌకర్యాల మధ్యే పర్యాటకులు తనవితీరా ప్రకృతిని ఆస్వాదిస్తుంటారు. అయితే ఇప్పుడు ఇక్కడున్న వాగులు, జలపాతాలను అభివృద్ధి చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది. రూర్బన్ పథకం కింద రూ.1.03 కోట్లు మంజూరు చేసింది. రంపచోడవరం మండలంలోని రంప వాటర్‌ఫాల్, ఐ.పోలవరం వాగు పరిసరాల్లో పార్కులు, విశ్రాంతి గదులు, టాయిలెట్స్, దుస్తులు మార్చుకునే వెసులుబాటు, పగోడాలు, లాన్‌లు తీర్చిదిద్దడానికి నిర్ణయించింది.
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఏజెన్సీ ప్రాంతానికి అద్భుత పర్యాటక ప్రదేశంగా పేరుంది. ముఖ్యంగా రంపచోడవరంలో సహజసిద్ధ జలపాతాలు.. ఏడాది పొడవునా పారే వాగులు వీటి సొంతం. పచ్చటి అడవుల మధ్య పర్యాటక ప్రియుల్ని ఇవి కట్టిపడేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. జిల్లాతోపాటు తెలంగాణ నుంచి అనేకమంది ఇక్కడకు క్యూ కడుతుంటారు. వేసవిలో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా రంపచోడవరం వాటర్ ఫాల్స్, దీనికి సమీపంలోని ఐ.పోలవరం మండలంలోని వాగు వద్దకు పర్యాటకులు పోటెత్తుతారు. ఏడాది పొడవునా ఇక్కడ నీళ్లు పారుతూనే ఉంటాయి. అయితే పర్యాటక రద్దీకి తగ్గట్టుగా ఇక్కడ అసలే మాత్రం కనీస వసతులు లేవు. విశ్రాంతి గదులు, పార్కు, టాయిలెట్లు, దుస్తులు మార్చుకునే సదుపాయాలు లేక మహిళలు ఇబ్బంది పడుతున్నారు. అటు వాగులోకి, జలపాతం దగ్గరకు వెళ్లడానికీ మార్గం సరిగ్గా లేక ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ పర్యాటక ఆకర్షణలను అభివృద్ధి చేయడానికి కేంద్రం రూర్బన్ పథకం కింద తాజాగా రూ.1.03 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ నిధులతో పనులు చేయడానికి నిర్ణయించింది. అందులోభాగంగా రూ.65.36 లక్షలతో రంపచోడవరం మండలం ఐ.పోలవరంలోని వాగు చుట్టూ పలు మౌలిక వసతులు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక్కడ పర్యాటకశాఖకు ఏడెకరాల భూమి ఉంది. ఇప్పుడు ఇక్కడ గిరిజనులు సమావేశాలు నిర్వహించుకోవడానికి మీటింగ్‌హాల్, ల్యాండ్‌స్కేపింగ్ చేయనున్నారు. వాగువద్ద గడపడం కోసం బెంచీలు, విశ్రాంతి గదులు, దుస్తులు మార్చుకునే గదులు నిర్మిస్తున్నారు.
కాకినాడలోని వివేకానంద పార్కు తరహాలో అధునాతన వసతులతో ప్రత్యేక పార్కు, మధ్యలో ఇరువైపులా మొక్క లు వేసి 500, 100 మీటర్ల వెడల్పుతో పాత్‌వేలు నిర్మించనున్నారు. వాగువద్దకు వెళ్లడానికి మెట్లు కూడా నిర్మించేలా ప్రతిపాదించారు. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి ఈ వాగు చాలా వెడల్పుగా ఉంటుంది. చెప్పాలంటే ప్రమాదం కూడా. అందుకే అనేక జాగ్రత్తలతో పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా దీన్ని అభివృద్ధి చేయనున్నారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా విధించుకున్నారు. అటు రంపచోడవరంలోని రంప వాటర్‌ఫాల్స్ ప్రము ఖ పర్యాటక ప్రాంతంగా పేరొందింది. కొండలపై నుంచి జాలువారే జలపాతం హోయలొలుకుతూ దాదాపు ఏడాది అంతా కనువిందు చేస్తుంది. ఇక్కడ కూడా మౌలిక వసతులు లేవు. దీంతో రూ.36.32 లక్షలతో అభివృద్ధి చేయనున్నారు. వాటర్‌ఫాల్స్ చుట్టూ పాత్‌వేలు, పగోడా తరహా గొడుగులు, సీటింగ్ బెంచీలు, దుస్తులు మార్చుకునే గదులు నిర్మించనున్నారు. జలపాతం దగ్గరకు వెళ్లేలా మెట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనిని నాలుగు నెలల్లో పూర్తి చేయనున్నారు. ఈ రెండు పనులకు అయిదు రోజుల కిందట ఏపీటీడీసీ టెండర్లు పిలిచింది. టెండర్లు దాఖలుకు మార్చి 4 ఆఖరు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పిలిచే ఏ టెండర్లకూ కాంట్రాక్టర్ల నుంచి స్పందన ఉండడం లేదు. దీంతో వీటికి స్పందన ఉం టుందా? లేదా? అనే అనుమానంగా ఉంది. ఈ పనులు కేంద్రప్రభుత్వ రూర్బన్ పథకం కిందకు వస్తాయని, నిధుల సమస్య ఉండదనే వాదన వినిపిస్తోంది.