ప్రసాద్‌ స్కీం నిధుల మంజూరుకు వడివడిగా అడుగులు

ABN , First Publish Date - 2022-03-05T05:44:25+05:30 IST

అన్నవరం దేవస్థానం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రసాద్‌ స్కీం నిధుల మంజూరుకు సంబంధించి శుక్రవారం ప్రసాద్‌ స్కీం అండర్‌ సెక్రటరీ శ్యాంసుందర్‌ వెర్మా రత్నగిరికి విచ్చేశారు.

ప్రసాద్‌ స్కీం నిధుల మంజూరుకు వడివడిగా అడుగులు
ప్రసాద్‌ స్కీంలో అన్నదాన భవనం నిర్మించే స్థలాన్ని పరిశీలిస్తున్న బృందం

 క్షేత్రస్థాయిలో పరిశీలించిన కేంద్రబృందం
 అన్నవరం, మార్చి 4: అన్నవరం దేవస్థానం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రసాద్‌ స్కీం నిధుల మంజూరుకు సంబంధించి శుక్రవారం ప్రసాద్‌ స్కీం అండర్‌ సెక్రటరీ శ్యాంసుందర్‌ వెర్మా రత్నగిరికి విచ్చేశారు. ముందుగా స్వామిని దర్శించుకున్న ఆయన అనంతరం ఈవో కార్యాలయంలో దేవస్థానం ఈవో, చైర్మన్‌, ఎమ్మెల్యే, ఎంపీ, రాష్ట్ర టూరిజం అధికారులతో కలిసి ప్రతిపాదిత పనులను, వాటి ఆవశ్యకతను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. అయితే ప్రధానంగా టీడీపీ సత్రం ప్రదేశంలో రూ.300 వ్రత మండపం, అన్నదాన భవనం, కొండ దిగువన డార్మెటరీ, ట్రాఫిక్‌ నియంత్రణకు రింగ్‌రోడ్డు నిర్మాణం, క్యూ కాంప్లెక్స్‌కు ప్రాధాన్యం కల్పించాలని ఎంపీ  గీత, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌, ఈవో త్రినాథరావు, చైర్మన్‌ రోహిత్‌, అధికారులను కోరారు. వీటి నిర్మాణాలు పూర్తయితే భక్తులకు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. అనంతరం ఈ ఐదు నిర్మాణాలు చేపట్టే ప్రదేశాలను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్యాంసుందర్‌ వెర్మా మాట్లాడుతూ వీటికి సంబంధించి మూడు విడతల్లో పరిశీలన జరపాలని, శుక్రవారంతో రెండో విడత పూర్తయిందని దీనిపై రిపోర్టు అందజేసి చేపట్టబోయే పనులపై నిధులను ఫైనలైజ్‌ చేయాలన్నారు. ఇదిలా ఉండగా ఈ పథకం ద్వారా సుమారు రూ.50 కోట్లు మంజూరయ్యే అవకాశాలుండడంతో ప్రాధాన్యతా క్రమంలో ఉన్న నిర్మాణాల వైశాల్యం తగ్గించాలని ఒక అవగాహనకు వచ్చారు. మరో 10 రోజుల్లో ఎంతమెత్తం నిధులు మంజూరవుతాయి, వాటితో చేపట్టబోయే నిర్మాణాలు ఏంటనే విషయంలో స్పష్టత రానుంది. సమావేశంలో రాష్ట్ర టూరిజం శాఖ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మల్‌రెడ్డి, చీఫ్‌ ఇంజనీర్‌ మూర్తి, దేవస్థానం ఇంజనీరింగ్‌ అధికారులు నూకరత్నం, రామకృష్ణ, రతన్‌రాజు పాల్గొన్నారు.

Read more