హోం మంత్రికి అలాగే!

ABN , First Publish Date - 2022-08-04T05:59:00+05:30 IST

కొవ్వూరు నియోజకవర్గం రూటే సేపరేటు. పార్టీలు మారినా సీన్‌ ఒక్కటే..

హోం మంత్రికి అలాగే!
కొవ్వూరు మండలం నందమూరులో బుధవారం జరిగిన గడపగడపకూ కార్యక్రమంలో కానరాని పెద్ద నాయకులు

కొనసాగుతున్న ఒక వర్గం సహాయ నిరాకరణ

మంత్రి కార్యక్రమాలకు నాయకులు దూరం

గతంలో జవహర్‌కు ఎదురైన అనుభవం

 పార్టీలు మారినా.. అదే సీన్‌ రిపీట్‌


కొవ్వూరు, ఆగష్టు 3 : కొవ్వూరు నియోజకవర్గం రూటే సేపరేటు. పార్టీలు మారినా సీన్‌ ఒక్కటే.. గతంలోనూ ఇంతే.. ఇప్పుడూ ఇంతే..  రాష్ట్ర హోంమంత్రి ఇలాకాలో సోషల్‌ మీడియా వేదికగా కులచిచ్చు కొనసాగుతూనే ఉంది. ఇటీవల రహస్య సమావేశమై మంత్రి వనితకు సహాయ నిరాకరణ చేయాలని ఒక సామాజిక వర్గం నాయకులు తీర్మానించుకున్నారు.ఈ నేపథ్యంలో మంత్రి కార్యక్రమాలకు ఆ సామాజిక వర్గానికి చెందిన మెజార్టీ నాయకులు గైర్హాజరవుతున్నారు. ఒక చిన్న వివాదం చినికి చినికి గాలి వానగా మారి పెద్ద రాజకీయం అగాధం సృష్టిస్తోంది.ఇప్పటి వరకూ ఎంతో సైలెంట్‌గా ఉన్న నియోజకవర్గం కాస్తా కులచిచ్చుతో వార్తలకెక్కింది. జూలై 23వ తేదీన అర్బన్‌ బ్యాంకులో ఎన్నికలు ప్రక్రియ కొనసాగుతుందని, నామినేషన్లు స్వీకరిస్తున్నారని సాక్షాత్తు వైసీపీ కౌన్సిలర్‌ కంఠమణి రమేష్‌బాబు మంత్రి క్యాంపు కార్యాలయానికి సమాచారం అందజేశారు. అయినప్పటికి అగ్రనాయకులు స్పందించక పోవడంతో టీడీపీ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో కౌన్సిలర్‌ రమేష్‌బాబు మీడియా వేదికగా హోంమంత్రి వనితపై విమర్శలు చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రతి విమర్శలు చేశారు. ఇదే వివాదానికి ఆజ్యం పోసింది. జూలై 31వ తేదీన నియోజకవర్గంలోని చాగల్లు మండలం మల్లవరంలో ఒక సామాజికవర్గానికి చెందిన ముఖ్య నాయకులంతా సమావేశమై ఇకపై మంత్రి వనిత కార్యక్రమాలకు సహాయ నిరాకరణ చేయాలని తీర్మానించుకున్నారు. అనుకున్నదే తడవుగా మంత్రి కార్యక్రమాలకు సామాజిక వర్గానికి చెందిన నాయకులు దూరం అవుతున్నారు. ఆ సామాజిక వర్గంలో కొంతమంది నాయకులు మాత్రమే మంత్రి వెంట నడుస్తున్నారు.  నిన్నటివరకు మంత్రి వనితకు అత్యంత సన్నిహితంగా తిరిగిన నాయకులు దూరంగాను, దూరంగా ఉన్న నాయకులు దగ్గరగా చేరుతున్నారు. దీంతో కొవ్వూరు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అగమ్మగోచరంగా తయారైంది. ఇదిలా ఉండగా మళ్లీ ఆ సామాజిక వర్గ నేతలంతా సమావేశం అవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న కె.ఎస్‌. జవహర్‌ చివరిగా ఇదే తప్పుచేశారు.తన పార్టీకి చెందిన బలమైన సామాజిక వర్గానికి చెందిన యువతపై కేసులు పెట్టడంతో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఇప్పటికి వర్గపోరు ఆగలేదు. దీంతో జవహర్‌ కొవ్వూరు నియోజకవర్గం నుంచి తిరువూరు నియోజకవర్గానికి వెళ్లవలసి వచ్చింది. ఇప్పటికి వర్గపోరు కొనసాగుతూనే ఉంది. అటువంటి వివాదమే నేడు వైసీపీలో నెలకొంది. చాగల్లు మండలం బ్రా హ్మణగూడెంలో జరిగిన మూడు రోజులు గడప గడపకు కార్యక్రమం లో అదే గ్రామానికి చెందిన జడ్పీటీసీ సభ్యురాలు హాజరుకాకపోవడం, కొవ్వూరు మండలం తోగుమ్మిలో గత రెండు రోజులుగా జరిగిన గడప గడపకు కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యురాలు హాజరుకాకపోవ డం చర్చనీయాంశమైంది.ఇకనైనా మంత్రి వనిత నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించి, కుల రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని, అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని సర్దుబాటు దోరణిలోకి వెళితే మంచిదనే అభిప్రాయాన్ని నాయకులు వెలిబుచ్చుతున్నారు. 

Updated Date - 2022-08-04T05:59:00+05:30 IST