శిథిలావస్థలో బిక్కవోలు పాత వంతెన

ABN , First Publish Date - 2022-03-05T05:36:19+05:30 IST

బిక్కవోలులోని సామర్లకోట కాలువపై బ్రిటీషు వారి హయాంలో నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది.

శిథిలావస్థలో బిక్కవోలు పాత వంతెన
బిక్కవోలులో పాత వంతెనకు రెండో పక్క రైలింగ్‌ వద్ద రోడ్డు పరిస్థితి

  • ప్రమాదాల బారిన పడుతున్న పాదచారులు, వాహనదారులు
  • బ్రిడ్జిని పూర్తిగా తొలగించాలంటున్న గ్రామస్థులు 

 బిక్కవోలు, మార్చి 4: బిక్కవోలులోని సామర్లకోట కాలువపై బ్రిటీషు వారి హయాంలో నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. 27 యేళ్ల క్రితమే ఈవంతెన రాకపోకలకు అనువుగా లేకపోవడంతో ఈవంతెన పక్కన 1995లో కొత్త వంతెన నిర్మించారు. అయితే ఈవంతెనను పూర్తిగా తొలగించక అలాగే వుంచడంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు వాడుతున్నారు. వంతెనకు ఇరువైపులా రైలింగ్‌ వద్ద వున్న రోడ్డు కాలువలోకి జారి పడి పెద్ద, పెద్ద గోతులు పడ్డాయి. వంతెన మధ్య భాగంలో మాత్రమే నడవడానికి రోడ్డు వుంది. దీంతో బయట వారు ఈ వంతెనపై గ్రామంలోకి వస్తుంటే వారు ఈగోతుల నుంచి కాలువలోకి జారి పడి ప్రమాదాల పాలవుతున్నారు. రెండేళ్ల క్రితం షష్ఠి ఉత్సవాలకు వచ్చిన యువకుడు ఇదే విధంగా కాలువలోకి జారి పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో ఓ వృద్ధుడు సైకిలుపై వంతెన పైనుంచి వస్తూ జారి పడి కాలువలో పడ్డాడు. అయితే ఈ కాలువ గట్టు ప్రాంతంలో మత్య్సకారులు నివసిస్తుండడంతో ఓ యువకుడు వచ్చి ఆ వృద్ధున్ని కాపాడాడు. ఆర్‌అండ్‌బీ అధికారులు వెంటనే వంతెనను పూర్తిగా తొలగించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని గ్రామస్థులు  డిమాండ్‌ చేస్తున్నారు.

Read more