పేరు కోసం పట్టు

ABN , First Publish Date - 2022-02-19T06:38:53+05:30 IST

పేరు కోసం పట్టు

పేరు కోసం పట్టు
అమలాపురంలో విజ్ఞాపన దీక్షలో మాట్లాడుతున్న మంత్రి విశ్వరూప్‌

  • కోనసీమ జిల్లాకు పేరు మార్చాలని పోరు
  • అంబేడ్కర్‌ పేరు పెట్టాలని కొందరు
  • కోనసీమ జిల్లాగానే ఉంచాలని కొందరు
  • ఊపందుకుంటున్న ఉద్యమాలు

జిల్లా పేరు కోసం ఉద్యమాలు ఊపందుకుంటు న్నాయి. అమలాపురం కేంద్రంగా ఏర్పడనున్న కోనసీమ జిల్లాకు పేర్లు  విషయంపై వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు విభిన్న రీతిలో ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరును  కోనసీమ జిల్లాకు పెట్టాలనే డిమాండుతో కోనసీమ వ్యాప్తంగా దళిత సంఘాలతోపాటు వివిధ సామాజిక వర్గాల ఆధ్వర్యంలో విజ్ఞాపన దీక్షల పేరిట ఆందోళనలు ఊపందుకున్నాయి. మరోవైపు కోనసీమ జిల్లాగానే పేరు ఉంచాలనే డిమాండుతో కోనసీమ జిల్లా సాధన సమితి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతోంది. దాంతో జిల్లా పేరు విషయంలో ప్రజల నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

(అమలాపురం-ఆంధ్రజ్యోతి): అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభు త్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై వివిధ రాజకీయ పార్టీలతోపాటు వివిధ సామాజికవర్గాల ప్రజలు ఎవరికి తోచిన రీతిలోవారు కొత్తకొత్త డిమాండ్లతో ఉద్యమాలకు శ్రీకారం చుడుతు న్నారు. కొందరు అంబేడ్కర్‌ పేరు అంటే మరికొందరు బాలయోగి పేరు, ఇంకొందరు కాటన్‌ పేరు, డొక్కా సీతమ్మ పేరు.. ఇలా రకరకాల పేర్లు పెట్టాలంటూ ఉద్యమాలతోపాటు సామాజిక మాధ్యమాల ద్వారా పోస్టిం గ్‌లు పెడుతున్నారు. ముఖ్యంగా కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ పేరును పెట్టాలనే డిమాండుతో కోనసీమ వ్యాప్తంగా ఉన్న  దళిత సంఘాలతోపాటు వివిధ సామాజిక వర్గాల మద్దతుతో విజ్ఞాపన దీక్షల పేరిట తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేపట్టారు. అధికార వైసీపీకి చెందిన నేతలు సైతం మద్దతు పలుకుతూ ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. మంత్రి పినిపే విశ్వరూప్‌, ఎంపీ చింతా అనురాధ సహా కోనసీమ ఎమ్మె ల్యేలు అంబేడ్కర్‌ పేరు కోసం చేపడుతున్న ఉద్యమాల్లో పాల్గొంటూ సంఘీభావం తెలుపుతున్నారు. ఇలా పలుచోట్ల అంబేడ్కర్‌ జిల్లా విజ్ఞా పన దీక్షల పేరిట ఆందోళనలు ఉధృతమయ్యాయి. తాజాగా కోనసీమ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం అమ లాపురంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వైసీపీ, టీడీపీ సహా వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు పాల్గొని ప్రసంగాలు కొన సాగించారు. కోనసీమ జిల్లాగానే పేరును కొనసాగిం చాలని మెజారిటీ నాయకులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒకరి పేరిట జిల్లాను ఏర్పాటుచేస్తే మరికొం దరి మనోభావాలు దెబ్బతింటాయని, చారిత్రాత్మక కోనసీమ పేరును చరిత్ర పటంలో ఉంచాల్సిన బాధ్యత కోనసీమ ప్రజలపై ఉందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. అంబేడ్కర్‌ అంటే ఎవరికీ వ్యతిరేకత లేదని, అయితే అన్ని వర్గాల ప్రజలు కోనసీమ జిల్లా పేరును ఆదరిస్తున్నందున కోనసీమ జిల్లాను ప్రభుత్వం ఏర్పాటుచేయాలని అఖిలపక్ష సమావేశంలో నాయకులు పట్టుబట్టారు. కొందరు బాలయోగి పేరును, మరికొందరు కాటన్‌ పేరును పెట్టాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు జిల్లా  పేరు విషయమై పట్టుబడుతూ ఆందోళనలు హోరెత్తిస్తున్నారు. ప్రభుత్వం ఏ నిర్ణ యం తీసుకుంటుందోనన్న చర్చ ప్రజల్లో నెలకొంది.

Read more