ఎన్టీఆర్‌ పేరు మార్చి దుష్ట సంప్రదాయం

ABN , First Publish Date - 2022-09-25T06:45:03+05:30 IST

ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చి ఓ దుష్టసంప్రదాయానికి వైసీపీ ప్రభుత్వం తెరతీసిందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్‌ పేరు మార్చి దుష్ట సంప్రదాయం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి

మేమూ వస్తాం నీ ఆనవాళ్లు లేకుండా చేస్తాం : గోరంట్ల


రాజమహేంద్రవరం, సెప్టెంబరు24(ఆంధ్రజ్యోతి) : ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చి ఓ దుష్టసంప్రదాయానికి వైసీపీ ప్రభుత్వం తెరతీసిందని  టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి  ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ మహానీయుల పేర్లను మార్చిన దాఖలాలు లేవన్నారు.తన స్వగృహంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పెట్టిన అంబేడ్కర్‌ విదేశీ విద్యా పథకాన్ని వైఎస్‌ఆర్‌ విద్యాపథకంగా మార్చడంతో పాటు వారికి డబ్బులివ్వడంలేదని, దీంతో అక్కడ విద్యార్థులు చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సైకో, శాడిస్ట్‌ కాకపోతే, అసెంబ్లీలో తన మంత్రులు బూతులు మాట్లాడుతూ ఉంటే జగన్‌ వికటాట్టహాసం చేస్తున్నాడని దుయ్యబట్టారు. అసెంబ్లీలో తమను మాట్లాడనీయడం లేదని తెలిపారు. సినిమాలో చిత్రాలు ఎడిట్‌ చేసినట్టు అసెంబ్లీలోని తమ దృశ్యాలను మార్పింగ్‌ చేసి తప్పుగా  సినిమా చూపిస్తున్నాడన్నారు. ఇక ఏడాదిన్నర మాత్రమే.. నీ బతుకు బజారే..నీతప్పులను సరిచేస్తాం. రంగులూ ఉండవు. పేర్లూ ఉండవని హెచ్చరించారు. రాష్ట్రంలో అనేకమందికి ఉద్యోగాలులేవని, ఉపాధి లేదని నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. వైసీపీ దందాల వల్ల పరిశ్రమలు తరలిపోయాయన్నారు. పారిశ్రామిక వేత్తలు ఎవరూ ముందుకు రావడంలేదని   తెలిపారు.సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవీ ప్రసాద్‌,  జిల్లా అధ్యక్షుడు కందుల బాబురాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కురుకురి కిశోర్‌, నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు గంగిన నాని పాల్గొన్నారు.

Read more