బాల నేరస్తుల అరెస్టు
ABN , First Publish Date - 2022-12-15T23:46:49+05:30 IST
చెడు వ్యసనాలు, దురాలవాట్లకు బానిసలుగా మారిన నలుగురు మైనర్ బాలురు సులువుగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో బైక్‌ల చోరీల బాట పట్టారు. ఎట్టకేలకు చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు.
సర్పవరం జంక్షన్, డిసెంబరు 15: చెడు వ్యసనాలు, దురాలవాట్లకు బానిసలుగా మారిన నలుగురు మైనర్ బాలురు సులువుగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో బైక్‌ల చోరీల బాట పట్టారు. ఎట్టకేలకు చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. బాల నేరస్తుల నుంచి రూ. 7.10 లక్షల విలువైన 8 మోటార్ బైక్‌లను సర్పవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోటార్ బైక్‌ల చోరీల నివారణ కోసం ఎస్పీ ఆదేశాల మేరకు పాత నేరస్తులు, చెడు నడవడిక గల వారిపై పోలీసు నిఘా ను పెంచారు. ఈ క్రమంలో బుధవారం కాకినాడ రూరల్ మండలం వాకలపూడి జంక్షన్ వద్ద సర్పవరం ఎస్‌హెచ్‌వో ఆకుల మురళీకృష్ణ ఆదేశాల మేరకు ఎస్‌ఐ సతీష్‌బాబు, ఏఎస్‌ఐ ఎం.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న నలుగురు బాల నేరస్తుల గ్యాంగ్ సభ్యులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా బైక్‌ల చోరీల విషయం బయటపడినట్లు ఎస్‌డీపీవో పి.మురళీకృష్ణారెడ్డి తెలిపారు. బాల నేరస్తులు నలుగురు కాకినాడ సిటీ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో జరిగిన 8 మోటార్ సైకిళ్ల చోరీల కేసులకు చెందిన బైక్‌లుగా గుర్తించామన్నారు. టూటౌన్ పీఎస్‌లో నమోదైన రెండు కేసులకు చెందిన ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాల నేరస్తులను సంబంధిత కోర్టులో రిమాండ్ నిమిత్తం తరలించామన్నారు. చోరీ సొత్తు స్వాధీనం, బాల నేరస్తుల గ్యాంగ్‌ను పట్టుకున్న ఎస్‌హెచ్‌వో, ఎస్‌ఐ, ఏఎస్‌ఐతో పాటు హెచ్‌సీలు గణేష్‌బాబు, సత్యనారాయణ, పీసీలు వాసంశెట్టి రాజేష్, హోంగార్డు కె.వెంకటరత్నంను ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.