121 గ్రామాల్లో భూసర్వే పూర్తి

ABN , First Publish Date - 2022-12-07T00:29:01+05:30 IST

జిల్లాలోని 121 గ్రామాల్లో సమగ్ర భూసర్వే పూర్తయిందని, మిగిలిన గ్రామాల్లోనే సర్వే జరుగుతున్నదని జిల్లా కలెక్టర్‌ కృతికాశుక్లా వెల్లడించారు.

121 గ్రామాల్లో భూసర్వే పూర్తి

పిఠాపురం, డిసెంబరు 6: జిల్లాలోని 121 గ్రామాల్లో సమగ్ర భూసర్వే పూర్తయిందని, మిగిలిన గ్రామాల్లోనే సర్వే జరుగుతున్నదని జిల్లా కలెక్టర్‌ కృతికాశుక్లా వెల్లడించారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకానికి సంబంధించి పిఠాపురం పట్టణంలోని రెడ్డి రాజా కల్యాణ మండపంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రైతులకు కలెక్టర్‌, జేసీ ఇలాక్కియా, కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్‌, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు జిల్లాలో తొలిసారిగా భూహక్కు పత్రాలను పంపిణీ చేశారు. బ్రిటిష్‌ కాలంలో జరిగిన సర్వే తర్వాత ఇప్పుడు అత్యాధునిక పరికరాలు రోవర్లు, డ్రోన్ల సహాయంతో సమగ్రంగా భూములను సర్వే చేసినట్లు చెప్పారు. పిఠాపురం నియోజకవర్గంలో 55 గ్రామాలకు 48 గ్రామాల్లో ఇప్పటికే సర్వే పూర్తయిందని తెలిపారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో నేటి నుంచి రైతులకు భూహక్కు పత్రాలు పంపిణీ చేయడం ప్రారంభించామని తెలిపారు. రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే తహసీల్దారు లేదా ఆర్డీవోలకు అప్పీలు చేసుకోవచ్చునని, వాటిని అధికారులు పరిశీలించి పరిష్కరిస్తారని వివరించారు. వచ్చే నెల నుంచి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరగనున్నాయని, రైతులకు ఎక్కడకు తిరగాల్సిన అవసరం లేకుండా గ్రామస్థాయిలోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఇలాక్కియ మాట్లాడుతూ సర్వేను పకడ్బందీగా నిర్వహించామన్నారు. సర్వే పూర్తయిన తర్వాత స్టోన్‌ ప్లాంటింగ్‌ జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లాపరిషత్‌ వైస్‌ చైర్మన్‌ బుర్రా అనుబాబు, కాకినాడ ఆర్డీవో బీవీ రమణ, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ బి.లక్ష్మీనారాయణ, పిఠాపురం, కొత్తపల్లి ఎంపీపీలు కన్నాబత్తుల కామేశ్వరరావు, కారే సుధ, గొల్లప్రోలు, కొత్తపల్లి జడ్పీటీసీలు ఉలవకాయల నాగలోవరాజు, గుబ్బల తులసీకుమార్‌, తహసీల్దారు పి.త్రినాథరావు, మునిసిపల్‌ కమిషనరు ఎం.రామ్మోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:29:04+05:30 IST