అ..లక్ష్యం!

ABN , First Publish Date - 2022-09-03T06:27:38+05:30 IST

అన్నీ ఉన్నాయ్‌.. ప్రభుత్వ ఆదరణ లేదు.. లక్ష్యం చూస్తే ఎంతో ఘనం.. ఆచరణ చూస్తే దూరం..

అ..లక్ష్యం!
కలవచర్లలోని కృషి విజ్ఞాన కేంద్రం

నిరుపయోగంగా మారిన వైనం

దశాబ్ధకాలంగా చిన్నచూపు

గతంలో 10 మంది శాస్త్రవేత్తలు

ప్రస్తుతం మిగిలింది ఇద్దరే 

కన్నెత్తిచూడని పాలకులు

ఖాళీగా 28 ఎకరాలు

పోస్టుల భర్తీపై నివేదిక

త్వరలోనే నియామకాలు


అన్నీ ఉన్నాయ్‌.. ప్రభుత్వ ఆదరణ లేదు.. లక్ష్యం చూస్తే  ఎంతో ఘనం.. ఆచరణ చూస్తే దూరం.. దూరం.. సుమారు 40 ఏళ్ల కిందట ముందు చూపుతో ఏర్పాటు చేసిన కేవీకే నేడు నిరుపయోగంగా మారింది.    28 ఎకరాల విస్తీర్ణంలో భూమి ఉన్నా ప్రయోగాలు చేసే వారే కరువయ్యారు. రైతులకు సలహాలిచ్చేవారు లేరు. అయినా నేటి వరకూ అటు వైపు చూసిన వారే  కానరారు. ఉన్న ఇద్దరు అధికారులు కేవీకే నిర్వహణ చూసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇక ప్రభుత్వం స్పందించి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నారు. 


రాజానగరం, సెప్టెంబరు 2 : ఉన్న వనరులు సద్వి నియోగం చేసుకోవడంలేదు..లేని వాటికి పరుగులు పెడుతున్నారు.. ఒక పక్కన ప్రభుత్వం ఆర్‌బీకేలు అంటూ హడావుడి చేస్తుంటే.. మరో పక్కన ఎంతో చరిత్ర కలిగిన కేవీకేలను నిర్లక్ష్యం చేస్తోంది. కలవచర్లలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) దానికి ఉదాహ రణ..ప్రస్తుతం కేవీకే కళావిహీనంగా మారి.. నేడు తన ఉనికినే కోల్పోయే దుస్థితికి చేరింది. ప్రయోగశాలల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు సాధించిన ఫలితాలను రైతులకు అందించి,వ్యవసాయాభివృద్ధికి తోడ్పాటునందించేందుకు 1984వ సంవత్సరంలో రాజానగరం మం డలం కలవచర్లలో సుమారు 28 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సంస్థ దశాబ్దకాలంగా లక్ష్యానికి ఆమడ దూ రంలో అలంకారప్రాయంగా దర్శనమిస్తోంది.


గతమెంతో ఘనం...


రాజమహేంద్రవరంలోని కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ (సీటీఆర్‌ఐ) ఆధ్వర్యంలో నడుస్తున్న కృషి విజ్ఞాన కేంద్రం రైతులతో పాటు రైతు మహిళలకు వ్యవసాయ రంగంలో విజ్ఞానాన్ని అందిస్తూనే, మహిళలకు చేతి వృత్తుల్లో శిక్షణ ఇచ్చేది. వ్యవసాయ, ఉద్యాన, పశు విజ్ఞాన విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల నుంచి వెలువడిన శాస్త్రీయ సాంకేతిక ఫలితాలను రైతు క్షేత్రాల్లో పరీక్షించి, ఆయా ప్రాంతాలకు అనువుగా ఉండేలా మార్పులను తెచ్చేది.క్షేత్రస్థాయి, ప్రఽథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలు నిర్వహించి రైతు అనుభవాలను, ఫలితాలను సమీక్షిస్తూ భావి కార్యాచరణ ప్రణాళికను రూపొందించేది. నిరంతరం రైతు సేవలో తరించిన కృషి విజ్ఞాన కేంద్రం ప్రస్తుతం దీనస్థితికి చేరుకుంది. గతంలో మాదిరిగా వివిధ సంస్ధలతో కలిసి సంయుక్తంగా కార్యకలాపాలు చేయడానికి వీల్లేకపోవడంతో పాటు నిధుల కొరత సిబ్బందిని బంధీలను చేసింది. దీంతో పరిమితంగానే సేవలందిస్తూ కాలం వెళ్లదీస్తోంది. కొంత మంది సిబ్బంది పదవీ విరమణ చేయడం..వారి స్థానంలో నూతన నియామకాలు చేపట్టకపోవడం కేవీకే ఉనికిని మరింతగా దెబ్బతీస్తోంది. సంస్థ ఆవిర్భావంలో నియమితులైన ఉద్యోగులంతా ఉద్యోగ విరమణ చేయడంతో ప్రస్తుతం కేవీకేహెడ్‌ వీఎస్‌జీ ఆర్‌ నాయుడు ఒక్కరే మిగిలారు.దేశ వ్యాప్తంగా 562 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉంటే రాష్ట్రంలోని పూర్వపు 13 జిల్లాల్లో 15 కేంద్రాలు ఉండేవి. మూడు దశాబ్దాల పాటు పూర్వపు జిల్లాలో రైతులకు విజ్ఞానాన్ని అందిం చిన కేవీకే దశాబ్దకాలంగా నిరుపయోగంగా మారింది.


ప్ర..గతి తప్పిందా!


అరటి,తాటి నార తయారీలో యంత్రాలను          రూ పొందించి,భారతదేశ స్థాయిలో కేవీకే         పలు అవార్డుల ను  కైవశం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1150 శాటిలైట్‌ పశుగ్రాస క్షేత్రాలను ఏర్పాటు చేసి 165 టన్నుల కో 3 పశుగ్రాసాన్ని విత్తన రూపంలో రైతులకు సరఫరా చేశారు.శిక్షణ ద్వారా సుమారు 500 చిన్న తరహా,గృహ పరిశ్రమలను స్థాపించారు.125 స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి వారి ద్వారా స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేసేలా తోడ్పాటునందించారు.వరిలో నేరుగా విత్తనాలు వేసే డ్రమ్‌ సీడర్‌ యంత్రాన్ని రూపొందించారు. గ్రామీణ మహిళలకు సంపూర్ణ ఆరోగ్యానికి అనువైన న్యూట్రిషన్‌ కిచెన్‌ గార్డెన్లను అభివృద్ధి చేసేలా అవగాహన కలిగించారు. ఇంతటి ఘన చరిత్రను సొంతం చేసుకున్న కలవచర్ల కృషి విజ్ఞాన కేంద్రం నేడు కళతప్పి కార్యకలాపాలు లేకుండా నిరుపయోగంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైన దృష్టి సారించి పూర్వ వైభవం తేవాలని పలువురు రైతులు వేడుకుంటున్నారు.


మార్చి నాటికి నియామకాలు


కేంద్ర ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న కలవచర్ల కృషి విజ్ఞాన కేంద్రానికి 1984లో నియమితులైన వివిధ శాఖల అధికారులు ఉద్యోగ విరమణ పొం దారు. గత రెండేళ్ల కిందటే ఉద్యోగులను నియమించాల్సి ఉంది. ఖాళీ అయిన పోస్టులు వివరాలను ఢిల్లీ నుంచి అడిగారు. జాబితా సిద్ధం చేసి పంపించాం. కరోనా కారణంగా రెండేళ్లు ఆగిపోయింది. ఆలిండియా ఎగ్జామ్‌ ద్వారా నియామకాలు చేసే యోచనలో ఉన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి నియామకాలు ఉంటాయనే ఆశిస్తున్నాం. పది మంది ఉండాల్సిన సంస్థలో ప్రస్తుతం తనతో పాటుగా మరో అధికారి విధులు నిర్వహిస్తున్నాం. - వీఎస్‌జీఆర్‌ నాయుడు, కేవీకే హెడ్‌


Updated Date - 2022-09-03T06:27:38+05:30 IST