కోనసీమ బంద్‌ ప్రశాంతం

ABN , First Publish Date - 2022-04-10T06:00:03+05:30 IST

కొత్తగా ఏర్పాటైన కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టనందుకు నిరసనగా అంబేడ్కర్‌ జిల్లా సాధన సమితి పిలుపుమేరకు దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బంద్‌ ప్రశాంతంగా ముగిసింది.

కోనసీమ బంద్‌ ప్రశాంతం
అంబాజీపేట సెంటర్లో ధర్నా చేస్తున్న దళిత నాయకులు

  • కొత్త జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టాల్సిందేనని డిమాండ్‌
  • పలుచోట్ల వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో బంద్‌
  • ముఖ్యమంత్రి జగనకి వ్యతిరేకంగా నినాదాలు
  • అరెస్టులతో భగ్నం చేసిన పోలీసులు 

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

కొత్తగా ఏర్పాటైన కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టనందుకు నిరసనగా అంబేడ్కర్‌ జిల్లా సాధన సమితి పిలుపుమేరకు దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. పలుచోట్ల ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అమలాపురం పట్టణంలో పాక్షికంగా జరిగినప్పటికీ కోనసీమలోని పలు మండలాల్లో బంద్‌ సంపూర్ణంగా సాగింది. అమలాపురం ఆర్టీసీ డిపో వద్ద తెల్లవారుజామున దళిత జేఏసీ నాయకులు డీబీ లోక్‌, ఇసుకపట్ల రఘుబాబు, కోట రామ్మోహనరావు, ఉండ్రు బాబ్జీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో పదిహేడు మందిని పోలీసులు అరెస్టు చేసి ఉప్పలగుప్తం, పి.గన్నవరం పోలీస్‌స్టేషన్లకు తరలించారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహణకు సమాయత్తమైన టీడీపీ సహా వివిధ పక్షాలకు చెందిన నాయకులను అరెస్టు చేసి రాజోలు పోలీస్‌స్టేషనలో ఉంచారు. కోనసీమవ్యాప్తంగా జరిగిన బంద్‌కు అధికార వైసీపీ నాయకులు, మార్కెట్‌ కమిటీల చైర్మన్లు, ఇతర ముఖ్యులు నాయకత్వం వహించారు. అమలాపురంలో దళిత నాయకులు మెండు రమేష్‌బాబు, నక్కా సంపత, సరెళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు యువకులు ముఖ్యమంత్రి జగనకి వ్యతిరేకంగా నినాదాలిస్తూ పట్టణంలోని పలు వ్యాపార సంస్థలను మూయించి వేశారు. రావులపాలెం, తాటిపాక, కొత్తపేట, కాట్రేనికోన, ముమ్మిడివరం, అల్లవరం సహా పలు మండలాల్లో బంద్‌ విజయవంతమైంది. ముమ్మిడివరంలో ఏడుగురిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. మార్కెట్‌ కమిటీ చైర్మన భర్త, వైసీసీ కార్యదర్శి పెయ్యల చిట్టిబాబు, దేవరపల్లి ఏడుకొండలు, కాశి జగపతిరావు, కొత్తపేట నియోజకవర్గంలో జరిగిన బంద్‌లో వైసీపీకి చెందిన మార్కెట్‌ కమిటీ చైర్మన గొల్లపల్లి డేవిడ్‌రాజు, ఆ పార్టీ నాయకులు నెల్లి లక్ష్మీపతి, పంతగడ శామ్యూల్‌, మాగాపు చక్రవర్తి, అల్లవరంలో జరిగిన బంద్‌లో సాధనాల వెంకట్రావు, నాతి శ్రీనివాసరావు, చింతా రామకృష్ణ, పి.గన్నవరం జంక్షనలో జరిగిన ఆందోళనలో వైసీపీ మండల శాఖ అధ్యక్షుడు నక్కా చినవెంకటేశ్వరరావు, నగరం మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన సాధనాల రమేష్‌, సర్పంచ కొండయ్య, కొంబత్తుల ఏసు పాల్గొన్నారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుతో పాటు కోనసీమవ్యాప్తంగా పోలీసుల అదుపులో ఉన్న దళిత జేఏసీ నాయకులను విడుదల చేయాలని కోరుతూ వైనతేయ నదిపై ఉన్న బోడసకుర్రు వంతెనపై వందలాది కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారి వదిలిపెట్టకపోతే గోదావరిలో దూకేస్తామని పోలీసులను హెచ్చరించడంతో అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి, పట్టణ సీఐ ఆర్‌ఎస్‌కే బాజీలాల్‌ బుజ్జగించి పోలీసుల అదుపులో ఉన్న వారిని విడుదల చేస్తామని ప్రకటించడంతో ఆందోళన విరమించారు. రావులపాలెంలో వైసీపీ నాయకులు ఆందోళన చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసి ఆత్రేయపురం తరలించారు. బంద్‌లో టీడీపీ, జనసేన సహా వివిధ పక్షాలకు చెందిన దళిత నాయకులు, ఇతర నేతలు పాల్గొన్నారు. రాజోలు, రావులపాలెం, అమలాపురం డిపోల నుంచి బస్సులు యథావిధిగా నడిచాయి. రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో బంద్‌ ప్రభావం కనిపించలేదు. బంద్‌ను విజయవంతం చేసిన నాయకులకు జేఏసీ కోనసీమ నాయకులు ఇసుకపట్ల రఘుబాబు, డీబీ లోక్‌ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో జగన ప్రభుత్వానికి దళితుల సత్తా ఏమిటో తెలియజేస్తామని హెచ్చరించారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టని పక్షంలో రాష్ట్రస్థాయిలో ఉద్యమానికి దిగడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. భవిష్యత్తు కార్యాచరణ సాధన కోసం కీలక నిర్ణయాలను తీసుకుంటామని నాయకులు ప్రకటించారు. 


Updated Date - 2022-04-10T06:00:03+05:30 IST