కార్పొరేషన్ పాఠశాలల ఆస్తులు... ధారాదత్తం!!!
ABN , First Publish Date - 2022-05-29T07:46:18+05:30 IST
వందేళ్లపైగా చరిత్ర కలిగిన ఒక్కప్పటి కొకనాడ మున్సిపాల్టీనుంచి ఆనవాయితీగా వస్తున్న పాఠశాల ఆస్తులు ప్రభుత్వానికి దారాధత్తం కానున్నాయా..? నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న పాఠశాలలు, వాటి ఆస్తులు సర్వస్వం ఇక విద్యాశాఖకు బదిలీ కానున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.

- నగరపాలక సంస్థ పాఠశాలలు విద్యాశాఖలోకి బదలాయింపు!
- రేపు కార్పొరేషన్ అత్యవసర కౌన్సిల్ సమావేశంలో తీర్మానం
- అదే జరిగితే కార్పొరేషన్ పర్యవేక్షణ పోయినట్లే.. ప్రత్యేక శ్రద్ధ లేనట్లే
- అయోమయంగా విద్యార్థుల భవితవ్యం.. ఆందోళనలో తల్లిదండ్రులు
- అకస్మాత్తు నిర్ణయంపై పలువురు కార్పొరేటర్ల అసంతృప్తి
కార్పొరేషన్(కాకినాడ), మే 28: వందేళ్లపైగా చరిత్ర కలిగిన ఒక్కప్పటి కొకనాడ మున్సిపాల్టీనుంచి ఆనవాయితీగా వస్తున్న పాఠశాల ఆస్తులు ప్రభుత్వానికి దారాధత్తం కానున్నాయా..? నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న పాఠశాలలు, వాటి ఆస్తులు సర్వస్వం ఇక విద్యాశాఖకు బదిలీ కానున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ మేరకు పైనుంచి అనధికారికంగా వచ్చిన ఆదేశాలను కాకినాడ నగరపాలక సంస్థ పా లకవర్గం తూ.చ తప్పకుండా పాటించేస్తోం ది. ఇందుకు ఈనెల 30న జరగనున్న కౌన్సిల్ సమావేశమే వేదిక కానుంది. ఈ మేరకు అజెండాను విడుదల చేసింది.
కారణాలు వేరు..
నగరపాలక సంస్థ పాఠశాలల నిర్వహణ చేయలేకపోతోందనే కారణం బూచిగా చూపిస్తూ ఈ దుస్సాహసానికి ఒడిగడుతున్నారు. దీనికి నాడు-నేడు, అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన వంటి పథకాలు ప్రభుత్వమే అమలు చేస్తోందన్న సాకు చూ పుతున్నారు. అందువల్ల ప్రభుత్వమే పాఠశాలలను పర్యవేక్షించగలదని చెప్తున్నారు. కానీ వాస్తవాలు వేరేగా ఉన్నాయి. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో 67 మున్సిపల్ పాఠశాలలు ఉన్నాయి. వీటికి విలువైన భూములు, ఆస్తులు ఉన్నాయి. ఏదైనా సమస్య వచ్చినా.. ఏవైనా పనులు కావాలన్నా ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు స్థానికంగా నగరపాలక సంస్థ పరిధిలోని అధికారులు, కార్పొరేటర్లతో చేయించేవారు. ఇప్పుడు బదలాయింపు జరిగితే ఆ అవకాశం ఉండదు. కార్పొరేషన్ పరధిలో పదో తరగతి పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. ఇప్పుడు అది కూడా ఉండదు.
అన్ని రకాలుగా నష్టమే..
నగరపాలక సంస్థ పాఠశాలల బదలాయింపు చేస్తారన్న విషయం తెలిసిన పాఠశాలల ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఎప్పటినుంచో నలుగుతోందని, మొదట్లో పర్యవేక్షణ మాత్రమే అన్నారని, ఇప్పుడు బదలాయింపు అనడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. అదే జరిగితే పాఠశాలలు నిర్వీర్యమయ్యే అవకాశం ఉందని, గతంలో ఏవైనా పాఠశాలల పనులు ఉంటే స్థానికంగా కార్పొరేషన్‌లో అడిగేవారమని, ఇకపై అలా అవసరాలు తీర్చే అవకాశం ఉండదని తెలిపారు. బదిలీల విషయంలోను అయోమయం ఉంటుందని వాపోయారు. పిల్లల చదువుకు నష్టం కలుగుతుందని, నగరపాలక సంస్థ ఆస్తులకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రతి పాఠశాలలోను పేరెంట్స్ కమిటీలు ఉంటాయని, కనీసం వారికి కూడా చెప్పకుండా ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.
అనధికార ఉత్తర్వులతోనే ముందుకు..
నగరపాలక సంస్థ పరిధిలో సెలక్షన్ గ్రేడ్ నుంచి స్పెషల్ గ్రేడ్, స్పెషల్ గ్రేడ్ నుంచి కార్పొరేషన్ స్థాయికి చేరిన కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని పాఠ శాలల ఆస్తుల విలువ రూ.5వేలకోట్ల వరకూ ఉంటుందని అంచనా. వైసీపీ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత కాకినాడ నగరపాలక సంస్థకు ఒరగబెట్టింది ఏమీలేదుగానీ ఉన్న ఆస్తులను తన పరం చేసుకునేందుకు పైరవీలు సాగిస్తోంది. ఎటువంటి జీవోలు, సర్క్యులర్లు లిఖితపూర్వకంగా జారీ చేయకుండానే ఈ ఆస్తులు ప్రభుత్వప రం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. అందుకు రాజకీయ పైరవీలు సాగించగా ప్రస్తుత కౌన్సిల్ పాలకవర్గంలో మెజార్టీ అధికారపార్టీకి ఉండడంతో హడావిడిగా పాఠశాల ఆస్తులు కట్టబెట్టేందుకు వ్యవధి కూడా ఇవ్వకుండా సమావేశం తేదీని ప్రకటించారు. ఇందుకోసమే ఈనెల 30న కాకినాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరగనుంది. అధికారపక్షానికి చెందిన కొందరు కార్పొరేటర్లు సైతం ఈ ప్రతిపాదనపై అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. బయటపడలేక, లోపల ఇమడలేక సమావేశానికి ముఖం చాటేసేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. మహానాడులో ఉన్న టీడీపీ కార్పొరేటర్లు ఈ విషయం తెలియడంతో కంగుతిన్నారు. 2022-23 నగరపాలక సంస్థ బడ్జెట్‌లో స్కూల్ అభివృద్ధి నిమిత్తం రూ.100కోట్లు కేటాయించారు. ప్రతిఏటా స్కూల్ అభివృద్ధికి కౌన్సిల్‌లో బడ్జెట్ కేటాయింపులు జరు గుతున్నాయి. ఇంత హడావిడిగా పాఠశాల నిర్వహణ చేపట్టలేమని, ప్రభుత్వానికి అప్పగించేస్తామని ప్రతిపాదన తీసుకురావడం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని అ నుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖలో పలు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లే నగరపాలక సంస్థ పాఠశాలల ఆస్తులు తన పరం చేసుకుని తనఖా పెట్టేందుకే వశం చేసుకుంటున్నట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.