విషాదం

ABN , First Publish Date - 2022-02-03T06:51:10+05:30 IST

రాజవొమ్మంగిలో కల్లు కాలకూటమైంది. అయిదుగురు గిరిజన రైతుకూలీల బతుకులను బలితీసుకుంది. ఎప్పుడూ తాగే జీలుగు కల్లే కదా అని వారంతా ఏ అనుమానం లేకుండా కల్లు సేవించారు.

విషాదం
జీలుగు

  రాజవొమ్మంగి మండలం లోదొడ్డిలో ఘోరం
  విషం కలిపిన జీలుగుకల్లు తాగి అయిదుగురు గిరిజనులు మృతి
  కక్షతో ఎవరో అగంతకులు కల్లుకుండలో విషప్రయోగం
  జడ్డంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.. అక్కడ విధుల్లో లేని వైద్యుడు
  ఏలేశ్వరం ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలొదిలిన సుగ్రీవ్‌, లోవరాజు
  కొన ఊపిరితో జీజీహెచ్‌లో సన్యాసిరావు, పుత్తూరు గంగరాజు మృతి
  అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలతో పోరాడి ఏసుబాబు కన్నుమూత
  విషం వల్లే చనిపోయినట్టు వైద్యులు, పోలీసుల ప్రాథమిక నిర్ధారణ


(రాజవొమ్మంగి, అడ్డతీగల, కాకినాడ క్రైం) రాజవొమ్మంగిలో కల్లు కాలకూటమైంది. అయిదుగురు గిరిజన రైతుకూలీల బతుకులను బలితీసుకుంది. ఎప్పుడూ తాగే జీలుగు కల్లే కదా అని వారంతా ఏ అనుమానం లేకుండా కల్లు సేవించారు. ఎప్పటిలాగే రోజువారీ పనికి బయలుదేరారు.. ఇంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా కడుపులో వికారం మొదలై వాంతులు రావడంతో ఏదో చిన్న సమస్యే అనుకున్నారు.. కానీ ఆ కల్లు చివరకు అయిదు నిండు ప్రాణాలు తోడేస్తాయనుకోలేదు. ఒక్కసారిగా నోట్లోంచి నురగలు రావడంతో ఉన్నట్టుండి వారంతా కింద పడి పోయారు. చుట్టుపక్క స్థానికులు, కుటుంబ సభ్యులు ఉప్పునీరు తాగించి సపరి చర్యలు చేశారు. అయినా  తేరుకోకపోవడంతో హుటాహుటీన ద్విచక్రవాహనాలపై జడ్డంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీరా అక్కడ విధుల్లో వైద్యుడు లేకపోవడంతో ఇద్దరిని ఏలేశ్వరం, ముగ్గురిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. కానీ అప్పటికే వైద్యం ఆలస్యమవడంతో దారి మఽధ్యలో ఇద్దరు, జీజీహెచ్‌లో ముగ్గురు చనిపోయారు.  ఈ విషాద ఘటన వెనుక అసలేం జరిగింది? కల్లులో విషం ఎలా కలిసింది? ఎవరు కలిపారు అనేది మిస్టరీగా మారింది. ఈ ఘటనలో అయిదుగురితో కలిసి ఆఖర్లో కల్లుతాగిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అనుమానంతో తాగింది ఉమ్మేయడంతో బతికిపోయాడు. కానీ ఈయన కొడుకు గంగరాజు                     మాత్రం  చనిపోయాడు. ఏజెన్సీలోని రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో పెనువిషాదం చోటుచేసుకుంది. విషం కలిసిన జీలుగుకల్లు తాగి అయిదుగురు గిరిజనులు మృతి చెందడంతో ఇక్కడ విషాదఛాయలు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన అయిదుగురు గిరిజనులు ఎప్పటిలాగే బుధవారం ఉదయం జీలుగుకల్లు తాగారు. కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు జడ్డంగి ప్రభుత్వాసుపత్రికి మోటార్‌ సైకిళ్లపై తరలించారు. తీరా జడ్డంగి ఆసుపత్రిలో వైద్యాధికారి లేకపోవడంతో అక్కడున్న సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. డాక్టర్‌ అనుమతి లేకుండానే చదల సుగ్రీవుడు (70)ను పరిస్థితి విషమంగా ఉందని ఏలేశ్వ రం ప్రభుత్వ ఆసుపత్రికి సిబ్బందే రిఫర్‌ చేశారు. ఆ తర్వాత రాజవొమ్మంగి ప్రభుత్వ ఆసుప త్రి డాక్టర్‌ శ్రీదుర్గ జడ్డంగి ఆసుపత్రికి చేరుకుని రోగుల పరిస్థితి చూసి ప్రాఽథమిక వైద్యం అందించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించింది. దీంతో వేమ లోవరాజు(28)ను ఏలేశ్వరం, పోతురు గంగరాజు (35), బుసరి సన్యాసిరావు(65), కుడే ఏసుబాబు (23)లను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్‌చేశారు. దీంతో ఏలేశ్వరం వెళ్లేసరికే మార్గమధ్యంలో చెదల సుగ్రీవ్‌(70) వేము లోవరాజు(30)మృతి చెందారు. కాకినాడ జీజీహెచ్‌కు వెళ్లిన కొన్ని క్షణాల్లోనే బుసరి సన్యాసిరావు (65), గంగరాజు (36) కన్నుమూశారు. కుడే ఏసుబాబు(23) అప స్మాకర స్థితిలోకి వెళ్లిపోవడంతో వైద్యులు చాలాసేపు చికిత్స అందించారు. అయినా పరిస్థితి విషమించడంతో బుధవారం సాయంత్రం కన్నుమూశాడు. దీంతో ఒకేసారి అయిదుగురు గిరిజనులు విషం కలిసిన కల్లు తాగి చనిపోవడం జిల్లాలో సంచలనంగా మారింది. ఏలేశ్వరం ఆసుపత్రిలో చనిపోయిన వారిని బుధవారం మధ్యాహ్నాం అడ్డతీగలకు పోస్టుమార్టం కోసం తరలించారు. అటు కాకినాడ జీజీహెచ్‌లో ఉన్న మృతులకు మొత్తం అయిదుగురికి గురువా రం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. కాగా బుధవారం ఉదయం తొలుత గంగరాజు (35) చెట్టు నుంచి కల్లు గీశారు. అనంతరం అంతా కలిసి కల్లు సేవించారు. చివర్లో గంగరాజు తండ్రి వెంకటేశ్వ ర్లు కల్లుతాగడానికి అక్కడకు వచ్చాడు. అయితే అది గుప్పుమని ఏదో వాసన రావడంతో తాగింది బయటకు ఉమ్మేశారు. దీంతో ఈయన ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈయన కొడుకు గంగరాజు మాత్రం చనిపోయాడు. గంగరాజు రోజువారీ వ్యవసాయ కూలీ. ఆయనకుముగ్గురు ఆడపిల్లలు. అంతా చిన్నోళ్లే కావడంతో గంగరాజు భార్య లోవ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. అయితే ఎప్పటిలాగే తాగిన కల్లులో ఎవరో విషం కలపడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ జీలుగుకల్లుకు లోటుండదు. అసలు ఎవరూ విక్రయాలే జరపరు. ఎవరికివారే చెట్టుకు కల్లుగీసి తాగడం అలవాటు. అలాంటిది కావాలని విషం కలపడంతోనే అయి దుగురు మృతిచెందారని చెబుతున్నారు. అయితే జరిగిన ఘటన నేపథ్యంలో పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం విషం కలవడం వల్లే ఈ ఘటనలో అయిదుగురు చనిపోయారని నిర్ధారించారు. సం ఘటన స్థలంలో తాగగా మిగిలి ఉన్న కల్లును అరలీటరు సీసాలో శాంపిల్‌ కింద సేకరించారు. ఆ పక్కనే ఉన్న జీలుగుచెట్ల నుంచి కొన్ని కుండలు దించి ఆ కల్లు నుంచీ నమూనాలు తీశారు. ఈ రెం డింటిని కాకినాడ, విజయవాడ ల్యాబ్‌లకు తరలించారు. కాగా లోదొడ్డిలో జరిగిన సంఘటనపై ఏఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌ జడ్డంగి పోలీసుస్టేషన్లో మాట్లాడారు. కల్లులో విషం కలిసిందని, అది ఎలా చేరిందనే కోణంలో విచారణ ప్రారంభించామన్నారు. గ్రామంలో పాతకక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోను విచారణ చేస్తున్నట్టు వివరించారు. కాగా గ్రామంలో గిరిజనులు చనిపోవడంపై సర్పంచ్‌ లోతా రామరావు వైద్యశాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్డంగి ప్రభుత్వ ఆసుపత్రిలో మందులే లేవని, ప్రజలు బయట కొనితెచ్చుకోవాల్సి వస్తుందని మండిపడ్డారు. మృతి చెందిన గిరిజనులకి సైతం బుధవారం బయటనుంచే మందులు కొని తెచ్చామన్నారు. చనిపోయిన అయిదుగురు గిరిజనులకు గురువారం పోస్టుమార్టం జరగనుంది. దీని ఆధారంగా కల్లులో ఎలాంటి విషపదార్థం కలిసింది అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా సన్యాసిరావు తనయు డు బుజ్జిబాబు మాట్లాడుతూ తన తండ్రితోపాటు మిగిలిన స్నేహితులు తరచూ జీలుగుకల్లు తాగుతారని, తమ ప్రాంతంలో కల్లు లభ్యత అధికంగా ఉండడంతో కొనే పరిస్థితి లేదన్నారు. చెట్టుకు కట్టిన కుండలో విషం కలపడం వల్లే అంతా చనిపోయారని వివరించారు. ఎప్పటిలాగే తన తండ్రి సుగ్రీవ్‌ జీలుగుకల్లు తాగారని, కాసేపటికే వాంతులు అవ్వడంతో ఉప్పునీరు పట్టించి ఆసుపత్రికి తరలిం చామని తీరా చనిపోయాడని ఆయన కుమార్తె ఏసమ్మ విలపించారు. అయితే దీనిపై కాకినాడ జీజీహెచ్‌ వైద్యులు మాట్లాడుతూ కల్లులో పురుగుల మందు కలిపి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

Updated Date - 2022-02-03T06:51:10+05:30 IST