ఆదాయ వనరులుగా సంపద తయారీ కేంద్రాలు

ABN , First Publish Date - 2022-07-06T05:59:26+05:30 IST

ఘనవ్యర్ధాల సంపద తయారీ కేంద్రాలను మంచి ఆదాయ వనరులుగా తీర్చిదిద్దాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత ఆదేశించారు.

ఆదాయ వనరులుగా సంపద తయారీ కేంద్రాలు
పంగిడిలో సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

  • కలెక్టర్‌ మాధవీలత.. పంగిడిలో ఎస్‌డబ్ల్యూపీ కేంద్రం పరిశీలన

కొవ్వూరు, జూలై 5: ఘనవ్యర్ధాల సంపద తయారీ కేంద్రాలను మంచి ఆదాయ వనరులుగా తీర్చిదిద్దాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత ఆదేశించారు. మంగళవారం కొవ్వూరు మండలం పంగిడి గ్రామంలోని ఎస్‌డబ్ల్యూపీ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రాంగణంలోని జాతిపిత మహాత్మగాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సాలిడ్‌ వెల్త్‌ సెంటర్‌లో వర్మీకంపోస్టు ఉత్పత్తి, మార్కెటింగ్‌, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్మీ కంపోస్టును  సరైన రీతిలో మార్కెటింగ్‌ చేసి, గ్రామానికి ఆదాయ వనరులుగా అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి సారించాలన్నారు. కొవ్వూరు పురపాలక సంఘం నుంచి చెత్తను తీసుకువచ్చి డంపింగ్‌ చేస్తున్న ప్రాంతంలో ఎస్‌డబ్ల్యుపీ కేంద్రం ఏర్పాటుచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా సాలిడ్‌ వెల్త్‌ ప్రొసెసింగ్‌ సెంటర్లు ఏర్పాటుచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతిఒక్కరూ ఇంటింటికి వచ్చే పారిశుధ్య సిబ్బందికి బాధ్యతగా తడి, పొడి చెత్తను వేరుచేసి అందజేయాలన్నారు. తడిచెత్తతో వర్మీ కంపోస్టు తయారు చేస్తారని చెప్పారు. జిల్లాలోని అన్ని పంచాయతీలకు దశలవారీగా చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎస్‌.మల్లిబాబు, డ్వామా పీడీ పి.జగదాంబ, సర్పంచ్‌ గోశాల నాగార్జున, డీఎల్‌పీవో బి.శివమూర్తి సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-06T05:59:26+05:30 IST