పెళ్లిలో కొట్లాట

ABN , First Publish Date - 2022-05-18T07:16:23+05:30 IST

ఆనందంగా జరుపుకోవాల్సిన పెళ్లివేడుక ఘర్షణకు దారితీసింది. సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామంలో జరిగిన ఈ కొట్లాటలో పలువురు గాయపడ్డారు.

పెళ్లిలో కొట్లాట
బొబ్బిల్లంకలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిన ప్రాంతం

కత్తులతో దాడిచేసుకున్న వైనం.. కొందరికి గాయాలు

సీతానగరం/ దివాన్‌చెరువు, మే 17: ఆనందంగా జరుపుకోవాల్సిన పెళ్లివేడుక ఘర్షణకు దారితీసింది. సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామంలో జరిగిన ఈ కొట్లాటలో పలువురు గాయపడ్డారు. రాజానగరం మండలం శ్రీరాంపురంనకు చెందిన కొత్తపల్లి శైలు, సీతానగరం మండలం బొబ్బిల్లంకకు చెందిన కందుకూరి రాజులకు వివాహం కుదిరింది. సోమవారం శ్రీరాంపురంలో పెండ్లికుమార్తె ఇంటివద్ద భోజనాల సమయంలో బొబ్బిల్లంక, శ్రీరాంపురం యువకులు ఘర్షణ పడ గా, ఇరు పెద్దలు యువకులకు సర్దిచెప్పి గొడవపడకుండా ఆపారు. మంగళవారం బొబ్బిల్లంక జగ్జీవన్‌రామ్‌పేటలో పెండ్లి కుమారుడి ఇంటివద్ద వివాహం జరుగగా, భోజన సమయంలో మళ్లీ ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరుగ్రామాల యువకులు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శుభశేఖర్‌ సిబ్బందితో తరలివచ్చి యువకులను చెదరకొట్టే సమయంలో మళ్లీ దాడులకు దిగారు. ఈ దాడుల్లో బొబ్బిల్లంకు చెందిన ముప్పిడి అనీల్‌కుమార్‌ను కత్తితో నరకగా 30 కుట్లు పడ్డాయి. అలాగే కందుకూరి రమేష్‌ తల పై గాయం అవ్వగా అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వీరితోపాటుగా కందుకూరి రవి, కందుకూరి నల్లయ్య, మల్లారపు ఏబి, కోడెల్లి పోశి య్య కందుకూరి రత్నరాజు, చిర్రా రవికుమార్‌లకు తీవ్ర గాయాలైయ్యాయి. వీరిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నార్త్‌జోన్‌ డీఎస్పీ వెంకటేశ్వరావు, కోరుకొండ సీఐ పవన్‌కుమార్‌ రెడ్డి, రాజమహేంద్రవరం దిశ ఎస్‌ఐ తదితరులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ముందుస్తు చర్యలు తీసుకున్నట్టు ఎస్‌ఐ తెలియజేశారు.



Updated Date - 2022-05-18T07:16:23+05:30 IST