కోడికి.. పుట్టిన రోజు..
ABN , First Publish Date - 2022-07-02T06:29:03+05:30 IST
పుర్రెకో బుద్ధి.. జిహ్వాకో రుచి.. మనిషికో అనందం అన్నారు పెద్దలు.
అనపర్తి, జూలై 1 : పుర్రెకో బుద్ధి.. జిహ్వాకో రుచి.. మనిషికో అనందం అన్నారు పెద్దలు. కొందరు పెంపుడు జంతువులను తమ ఇంటి బిడ్డలా చూసుకుంటూ వాటికి పుట్టిరోజు వేడుకలను చేస్తూ ఆనందిస్తారు. ఇప్పటి వరకు మనం కుక్కలకు... పిల్లులకు పుట్టిన రోజు వేడుకలు చేయడం చూశాం కానీ.. అనపర్తి మండలం పీరా రామచంద్రపురం గ్రామానికి చెందిన ఉదయ భాస్కర్ తన పెంపుడు కోడికి పుట్టిన రోజు వేడుకలు చేశాడు. కోడికి మోటు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచు కుంటున్న కోడి పుట్టిన రోజుకు గౌను కుట్టించి కేక్న ఏర్పాటు చేసి స్నేహితులను పిలిచి వేడుక నిర్వహించాడు. తాను చెన్నైలో ఉండగా ఐదు గుడ్లను పొదిగించగా ఒక్క కోడిపిల్ల మాత్రమే బతికిందని దానికి మోటు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నానని అంటు న్నాడు. గతేడాది చెన్నైలో ఉండడంతో అక్కడే మోటుకు పుట్టిన రోజు వేడుకలు చేశానని ఈ ఏడాది సొంత గ్రామానికి వచ్చేయడంతో రెండో పుట్టిన రోజును ఇక్కడ నిర్వహించానని అన్నాడు. కోడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఉదయ భాస్కర్ స్నేహితులు మోటుతో సల్పీలు దిగుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నాడు.