అందరి ఆరోగ్యానికి ‘ఫ్యామిలీ ఫిజీషియన్‌’

ABN , First Publish Date - 2022-11-22T01:21:52+05:30 IST

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో నిత్యం వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టిందని కలెక్టర్‌ కె.మాధవీలత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌ ద్వారా ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్న పీహెచ్‌సీ వైద్యాధికారులను కలెక్టర్‌ మాధవీలత, జాయింట్‌ కలెక్టర్‌ సీహెచ్‌ శ్రీధర్‌తో కలసి మెమెంటోలు అందజేసి సత్కరించారు.

అందరి ఆరోగ్యానికి ‘ఫ్యామిలీ ఫిజీషియన్‌’

రాజమహేంద్రవరం అర్బన్‌, నవంబరు 21: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో నిత్యం వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టిందని కలెక్టర్‌ కె.మాధవీలత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌ ద్వారా ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్న పీహెచ్‌సీ వైద్యాధికారులను కలెక్టర్‌ మాధవీలత, జాయింట్‌ కలెక్టర్‌ సీహెచ్‌ శ్రీధర్‌తో కలసి మెమెంటోలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లను అందుబాటులోకి తీసుకొచ్చామని, ఫ్యామిలీ కాన్సెప్టు విధానం ద్వారా వైద్యాధికారులు, సిబ్బంది తమ పరిధిలోని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి వైద్యసేవలు అందిస్తారని అన్నారు. శస్త్ర చికిత్సలు చేయించుకున్న రోగులు, గర్భిణుల ఆరోగ్యం, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో మెరుగైన వైద్యసేవలు అందించిన రాజానగరం, కోరుకొండ, రంగంపేట, కుతుకూలూరు, తాళ్లపూడి పీహెచ్‌సీల డాక్టర్లు రవికుమార్‌, భాగ్యశ్రీ, లావణ్య, దుర్గాప్రసాద్‌, సమీర్‌కుమార్‌లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు, జిల్లా ఎయిడ్స్‌ అండ్‌ లెప్రసీ, టీబీ కంట్రోల్‌ అధికారి డాక్టర్‌ ఎన్‌.వసుంధర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-22T01:21:54+05:30 IST