ప్రభుత్వ ఆసుపత్రి పేరు మారింది

ABN , First Publish Date - 2022-12-17T00:22:44+05:30 IST

మెడికల్‌ కాలేజీ, బోధనా ఆసుపత్రి ఏర్పాటవుతున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి పేరుమారింది.

ప్రభుత్వ ఆసుపత్రి పేరు మారింది
మారిన ప్రభుత్వాసుపత్రి నేమ్‌బోర్డు

రాజమహేంద్రవరం అర్బన్‌, డిసెంబరు 16 : మెడికల్‌ కాలేజీ, బోధనా ఆసుపత్రి ఏర్పాటవుతున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి పేరుమారింది. ఇక నుంచి దీన్ని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (గవర్నమెంట్‌ జనరల్‌ ఆసుపత్రి)గా పిలుస్తారు. ఇప్పటి వరకూ ఏపీ వైద్యవిధాన పరిషత్‌ పర్యవేక్షణలో ఉన్న జిల్లా ఆసుపత్రి మెడికల్‌ కాలేజీ రాకతో డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోకి వెళ్లిపోయింది. ఈ మేరకు ఆసుపత్రి ప్రధాన భవనం ఎదుట రెండు కొత్త నేమ్‌ బోర్డులు ఏర్పాటు చేశారు. ఓపీ విభాగంపైన పెయింట్‌తో కొత్తబోర్డు రాయగా, రాత్రిపూట కూడా మెయిన్‌గేటు రోడ్డుపై నుంచి చూస్తే కనిపించే విధంగా మరో ఎల్‌ఈడీ డిస్‌ప్లే సైన్‌బోర్డును ఏర్పాటు చేశారు. ఒకటి, రెండు రోజుల్లో మెయిన్‌గేటు వద్ద కూడా ప్రభుత్వ సమగ్ర వైద్యశాల పేరుతో కొత్త బోర్డు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆసుపత్రి ప్రధాన భవనం ఎలివేషన్‌కు రంగులు వేయడం పూర్తి చేశారు. భవనం లోపల ఓపీ కారిడార్‌, వార్డులు, ఇతర విభాగాల్లో సీలింగ్‌, ఇతర ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) నుంచి అధికారుల బృందం విజిట్‌కు రానుందనే సమాచారం నేపథ్యంలో ఆసుపత్రి భవనం అంతా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.దీనిలో భాగంగానే జిల్లా ఆసుపత్రి పేరు మార్పు చోటు చేసుకుంది.

Updated Date - 2022-12-17T00:22:46+05:30 IST