సీటీ స్కాన్ కథ కంచికి..
ABN , First Publish Date - 2022-04-28T06:51:50+05:30 IST
రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రికి నిత్యం రోగుల తాకిడి ఉంటుంది. ప్రతిరోజూ అవుట్‌పేషెంట్ సెక్షన్ (ఓపీ) 1,000 నుంచి 1,500ల వరకూ ఉంటుందంటే రోగుల తాకిడి ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాసుపత్రిలో జనరల్ ఫిజీషియన్, సర్జికల్, ఆర్ధోపెడిక్స్, ఈఎన్‌టీ, ఆఫ్తమాలజీ, గైనిక్ వంటి ప్రధాన విభాగాలతోపాటు ఆయుర్వేద విభాగంలోనూ ఉత్తమ వైద్యసేవలు లభిస్తాయని ప్రజల్లో మంచి గురి ఉంది. అయితే ఇక్కడి వైద్యులకు, మెరుగైన వైద్యానికి సాంకేతిక సహకారం అంతంతమాత్రంగానే ఉంది.
- ఆల్ర్టా సౌండ్ స్కానింగ్ దైవాధీనం
- ఎక్స్‌రే పరీక్షలు తూతూ మంత్రం
- ఈసీజీ.. ఇదే దారి
- రాజమహేంద్రవరం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి పరిస్థితి ఇదీ
- (రాజమహేంద్రవరం అర్బన్)
రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రికి నిత్యం రోగుల తాకిడి ఉంటుంది. ప్రతిరోజూ అవుట్‌పేషెంట్ సెక్షన్ (ఓపీ) 1,000 నుంచి 1,500ల వరకూ ఉంటుందంటే రోగుల తాకిడి ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాసుపత్రిలో జనరల్ ఫిజీషియన్, సర్జికల్, ఆర్ధోపెడిక్స్, ఈఎన్‌టీ, ఆఫ్తమాలజీ, గైనిక్ వంటి ప్రధాన విభాగాలతోపాటు ఆయుర్వేద విభాగంలోనూ ఉత్తమ వైద్యసేవలు లభిస్తాయని ప్రజల్లో మంచి గురి ఉంది. అయితే ఇక్కడి వైద్యులకు, మెరుగైన వైద్యానికి సాంకేతిక సహకారం అంతంతమాత్రంగానే ఉంది. కీలకమైన సీటీస్కాన్ అందుబాటులో లేకపోవడం, ఆల్ర్టాసౌండ్ స్కానింగ్ దైవాధీనంగా మారడం, ఎక్స్‌రే, ఈసీజీ పరీక్షలు తూతూ మంత్రంగానే సాగడం ప్రభుత్వాసుపత్రి పేరును దెబ్బతీస్తున్నాయి. వీటిని అందుబాటులోకి తేవడానికి ఆసుపత్రి అధికారులు చేస్తున్న ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమై పోతున్నాయి. ప్రజాప్రతినిధుల్లో సంకల్పం లేని ఫలితంగా పేదల వైద్యం గాలిలో దీపంలా మిణుకుమిణుకుమంటోంది. ప్రభుత్వాసుపత్రిలో అత్యంత కీలకమైన సీటీ స్కాన్ మెషీన్ మూడేళ్లుగా మూలనపడినా అధికారులుకానీ, ప్రజాప్రతినిధులుకానీ పట్టించుకున్న దాఖలాలేదు. కొవిడ్ సమయంలోనూ సీటీ స్కాన్ గురించి ఆలోచనేలేదు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాల్లో సీటీ స్కాన్ అంశం ప్రధానంగా చర్చకు వచ్చినా ఎటూ తేల్చలేదు. సీటీస్కాన్ చివరకు మరమ్మతులకు కూడా పనికిరాదని రెండు రోజుల కిందటే తేల్చేశారు. కొత్తది కొనడమే శరణ్యమని నిర్థారించారు. కొత్తది కొనాలంటే సుమారు రూ.కోటి 20 లక్షల వరకూ ఖర్చవుతుందని అధికారులు లెక్కలు కట్టి చేతులు దులిపేసుకుంటున్నారనే విమర్శలున్నాయి.
ఆలా్ట్రసౌండ్ స్కానింగ్ ఉన్నా..
ఇక ప్రభుత్వాసుపత్రిలోని ఆల్ర్టాసౌండ్ స్కానింగ్ దైవాధీనమనే చెప్పాలి. మాతా, శిశు విభాగం (ఎంసీహెచ్‌బ్లాకు)లో గర్భిణీల కోసం ఒకటి, ఆసుపత్రి పాత బిల్డింగ్‌లోని జనరల్ ఓపీ కారిడార్ 5వ నెంబరు రూములో సాధారణ రోగుల కోసం మరొకటి స్కానింగ్ మెషీన్ ఉన్నాయి. వీటిలో ఎంసీహెచ్ బ్లాకులోని ఆల్ర్టాసౌండ్ స్కానింగ్ ఒక్కటే ఉపయోగంలో ఉంది. 5వ నెంబరు రూములోని స్కానింగ్ మెషీన్ చాలా కాలంగా మూలన పడింది. నిజానికి ఆల్ర్టాసౌండ్ స్కానింగ్ చేయాలంటే రేడియాలజిస్ట్ ఉండాలి. కానీ ఇక్కడ లేరు. గర్భిణీలకు ఆల్ర్టాసౌండ్ స్కానింగ్ చేయాలంటే గైనికాలజిస్ట్ కం ఆల్ర్టా సోనాలిజిస్ట్ ట్రైనింగ్ తీసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం శిక్షణలేని గైనకాలజిస్ట్‌లే స్కానింగ్ పరీక్షలు చేసేస్తున్నారని చెబుతున్నారు. జనరల్ కేసుల్లో ఆల్ర్టాసౌండ్ స్కానింగ్‌లో కిడ్నీలు, యూరినరీ బ్లాడర్ (కేయూబీ), అబ్డామిన్, పాంక్రియాసిస్, లివర్ తదితర స్కానింగ్ పరీక్షలు చేసే అవకాశం ఉంది. రేడియాలజిస్టు లేకపోవడంతో పేదలు ఆల్ర్టాసౌండ్ పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్‌లకు వేలకు వేలు పోస్తున్నారు. రెండు రేడియాలజిస్ట్ శాంక్షన్ పోస్టులున్నా భర్తీ కాకపోవడం గమనార్హం. ఇక్కడ ఈసీజీ పరీక్షలు కూడా అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. ఇటీవల కొత్తగా కాంట్రాక్టు విధానంలో టెక్నీషియన్ వచ్చినా రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందడంలేదు. దూర ప్రాంతాల నుంచి ఈసీజీ కోసం వస్తున్నవారు టెక్నీషియన్ లేకపోవడంతో ఎదురు చూసీ చూసీ వెనుదిరగాల్సి వస్తోంది. గుండె సంబంధిత వ్యాధుల నిర్థారణలో ఈసీజీ రిపోర్టు కీలకంగా ఉంటుంది. అయితే ఈ విభాగానికి నిపుణులైన పూర్తిస్థాయి టెక్నీషియన్ లేకపోవడం శాపంగా మారింది. మరో ప్రఽధానమైన విభాగం ఎక్స్‌రే. ట్రామా కేర్‌తోపాటు ఇతర ప్రమాదాలు జరిగిన సమయంలోనూ ఎక్స్‌రేలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుతం రెండు మొబైల్‌ప్లాంట్లపై మాత్రమే ఎక్స్‌రేలు తీస్తున్నారు. మొబైల్ ప్లాంట్లు ఎమర్జన్సీ సేవల కోసం మాత్రమే ఉపయోగిస్తుంటారు. వీటిని ఐసీయూలో పెట్టి వాడతుంటారు. కానీ ఇవే ఇప్పుడు ఆసుపత్రికి ప్రధానాధారంగా ఉన్నాయి.
ఆర్‌ఎంవో డాక్టర్ ఆనంద్ వివరణ
సీటీ స్కాన్ మరమ్మతులతో మూలనపడింది. సీఎస్‌ఆర్, దాతల సహకారంతో కొనేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆల్ర్టాసౌండ్ స్కానింగ్‌కు రేడియాలజిస్ట్ కొరత ఉందని ప్రభుత్వాసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్ ఆనంద్ తెలిపారు.