మోదేశారు!
ABN , First Publish Date - 2022-03-23T06:43:21+05:30 IST
వంటగ్యాస్ ధరలు దారుణంగా పెరిగాయి.

వంటగ్యాస్ సిలెండర్‌పై రూ.50 బాదుడు
14.2 కిలోల గ్యాస్ బండ ధర రూ.980
డెలివరీ బాయ్ మామూళ్లతో రూ.వెయ్యిపైనే
19 కిలోల కమర్షియల్ బండకు రూ.8 పెంపు
జిల్లాలో 16 లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు
జనం మీద కోట్ల రూపాయల మేర భారం
పెట్రోలు ధరలపైనా అదనపు భారంతో విలవిల
లీటరు పెట్రోలుకు 90 పైసల పెంపు 8 ధర రూ.110.48
డీజిల్ ధర రూ.96.56 8 వినియోగదారుల గగ్గోలు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
వంటగ్యాస్ ధరలు దారుణంగా పెరిగాయి. ఉత్తరాది రాష్ర్టాల ఎన్నికల తర్వాత గ్యాస్, పెట్రోలు ధరలు భారీగా పెరుగుతాయనే ప్రచారం కొంతకాలంగా జరుగుతున్నదే. కానీ ఎన్నికల తర్వాత కొద్దిరోజులు మౌనంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం అమాంతం ధరలు పెం చేసింది. ఏకంగా 14.2 కిలోల బండకు రూ.50 పెంచేసింది. సబ్సిడీని మాత్రం బాగా తగ్గించింది. ప్రస్తుతం గ్యాస్ బండ ధర రూ.930 నుంచి 980కి పెరిగింది. దీనికి తోడు గ్యాస్ డెలివరీ బాయ్‌ల దోపిడీ ఒకటి. వాస్తవానికి గ్యాస్‌బండ బుక్ చేస్తే, అసలు ధరకే ఇంటికి తెచ్చి ఇవ్వాలి. కానీ డెలీవరీ బాయ్‌లు బండకు రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. లెక్కన రాజమహేంద్రవరంలో వంటగ్యాస్ బండ ధర రూ.1010 నుంచి రూ.1030 వరకూ అవుతుంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు గ్యాస్ ధరలు పెరగడం, ఇటు సబ్సిడీకి కోత పడుతుండడం జరుగుతూ వస్తోంది. గతంలో సగంపైగా సబ్సిడీ రూపంలో వినియోగదారుల ఖాతాలో పడుతుండేది. అదే ఇప్పుడు రూ.25 మాత్రమే సబ్సిడీగా జమ అవుతోంది. క్రమేపీ సబ్సిడీ కోసేసి, ధర మాత్రం అధికంగా పెంచడంతో వినియో గదారులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్ ధరలు మాత్రమే బాగా పెరిగాయి. 19 కిలోల కమర్షియల్ బండకు రూ.8 అదనంగా పెరిగింది. ఇప్పటివరకూ కమర్షియల్ బండ ధర రూ 2080.50 ఉండగా, ఇవాళ అది రూ.2088.50కి పెరిగింది. జిల్లాలో వంట గ్యాస్ కనెక్షన్లు రూ.16 లక్షలకు పైగా ఉండగా, నెలకు ఒక బండ వాడితే మొత్తం వినియోగదారుల మీద రూ.8 కోట్ల భారం పడుతుంది. కానీ వాస్తవానికి చాలామంది రెండు బండలు వాడతారు. కమర్షియల్ బండలు కూడా ఎక్కువగానే వాడతారు.
పెట్రోల్ ధరలు భగ్గు..
ఊహించినవిధంగానే పెట్రోలు ధరలు భగ్గుమన్నాయి. రాజమహేంద్ర వరంలో లీటరు పెట్రోలుకు 90 పైసలు పెరిగింది. జిల్లాలో రవాణా బట్టి ఆయా ప్రాంతాల్లో ధరలు కొంచెం అటుఇటుగా మారతాయి. గోకవరం మండలం నుంచి పెట్రోలు, డీజిల్ సరఫరా అవుతాయి. ఇక్కడ నుంచి పెట్రోలు బంకు వరకూ రవాణా చార్జీలు కూడా కలుపుకుని వసూలు చేస్తారు. రాజమహేంద్రవరంలో లీటరు పెట్రోలు రూ.110.48 పైసలుకాగా, డీజిల్ ధర రూ.96.56 అయింది.
గ్యాస్ ధరలు ఇలా..
వంట గ్యాస్ 14.2 కిలోల బండపై ఒకేసారి రూ.50 పెరిగింది. అంటే 980 అయింది. 5 కిలోల బండపై రూ.18 పెరిగింది. ఇప్పటి వరకూ రూ.344.50 ఉండేది. ఇక రూ.362.50 ఉంటుంది. 10 కిలోల కాంపొజిట్ సిలెండర్ ధర రూ.655 ఉండేది. అది 690 అయింది. అంటే రూ.35 పెరిగింది. కమర్షియల్ సిలెండర్ల ధరలు కూడా కొద్దిగా పెరిగాయి.