తగ్గేదేలే

ABN , First Publish Date - 2022-08-13T06:42:34+05:30 IST

తగ్గేదేలే.. ఇటీవల పుష్ప సినిమాలో ఈ డైలాగ్‌ చాలా పాపులర్‌.. ఆ సినిమా మొత్తం ఎర్రచందనం స్మగ్లింగ్‌ చుట్టూనే తిరుగుతుంది..

తగ్గేదేలే
ఇటీవల కోరుకొండలో ఫ్లేవుడ్‌ చెక్కల మాటున పట్టుకున్న గంజాయి

యథేచ్ఛగా గంజాయి అక్రమ రవాణా

పోలీసుల కళ్లు గప్పి తరలింపు

ఇతర రాష్ర్టాలకు సరఫరా

భారీగా సాగుతున్న వ్యాపారం

ఏజెన్సీ నుంచి ఎగుమతి

ఇతర వస్తువులు మాటున గుట్టుగా

ఇటీవల జిల్లాలో పలు కేసులు నమోదు

జైళ్లలో సుమారు 40 మంది ఖైదీలు

అయినా మారని తీరు

చోద్యం చూస్తున్న పోలీస్‌ శాఖ


తగ్గేదేలే.. ఇటీవల పుష్ప సినిమాలో ఈ డైలాగ్‌ చాలా పాపులర్‌.. ఆ సినిమా మొత్తం ఎర్రచందనం స్మగ్లింగ్‌ చుట్టూనే తిరుగుతుంది.. అక్కడ ఎర్రచందనం అయితే ఇక్కడ మాత్రం గంజాయి.. ఎవడికి వాడు తగ్గేదేలే..                  ఆ సినిమా సీన్లను తలపించే రీతిలో నిత్యం గంజాయి రవాణా సాగుతూనే ఉంటుంది. రోడ్డు మార్గాల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా లారీలకు లారీలు తరలిపోతూనే ఉంటుంది. పోలీసులు తెల్లముఖం వేసుకుని చూస్తూనే ఉంటారు. ఎందుకంటే పైన ఉండే సరుకు ఒకటి.. లోపల ఉండే సరుకు మరొకటి..  గంజాయి స్మగ్లర్లలో ఎవరో ఒకరు సమాచారమిస్తే తప్ప చిక్కరు.. దొరకరు.. కొంత మంది పోలీసులు మామూళ్ల మత్తులో జోగుతారు.. స్మగ్లర్లు ఎంత కావాలంటే అంత ఇచ్చి జోకొడతారు.. ఏజెన్సీలో చెక్‌పోస్టులు యథేచ్ఛగా దాటించి రవాణా చేసుకుంటారు.. ఇలా గంజాయి రవాణా జిల్లా మీదుగా నిత్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతూనే ఉంది. రాజమహేంద్రవరం సిటీ/మధురపూడి, ఆగస్టు 12 : విశాఖ జిల్లా ఏజన్సీ ప్రాంతం నుంచి పెద్దఎత్తున గంజాయి అక్రమ రవాణా జరుగుతుంది. సుమారు రెండున్నర దశాబ్దాలుగా గంజాయి అక్రమ రవాణా సాగుతున్నా పోలీసులు మాత్రం అడపాద డపా పట్టుకుని మమ అనిపిస్తున్నారు.ఏళ్ళ తరబడి గంజాయి కేసుల్లో స్మగర్లు జైళ్ళలో మగ్గుతున్నా రవాణాకు మాత్రం చెక్‌ పడటం లేదు. పైగా కొత్త మార్గాలను స్మగ్లరు ఎంచుకుని చాకచక్యంగా రవాణా చేస్తున్నారు. పది వాహనాలు బయలు దేరుతుంటే అందులో కేవలం ఒకటి రెండు మాత్రమే పోలీసులకు పట్టుబడుతున్నాయి. కోట్లాది రూపాయల గంజాయి దేశవ్యాప్తంగా రవాణా అవుతుంది. 


పోలీసులకు చిక్కకుండా.. గుట్టుగా..


విశాఖ అటవీ ప్రాంతంలో ఉన్న అడవుల్లో వందలాది ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారు. అక్కడ నుంచి కొండల మీదుగా గిరిజనులు మోసుకొచ్చి స్మగర్లకు విక్రయిస్తారు. గిరిజనులకు..స్మగ్లర్లకు మధ్య దళారీ ఒక డు ఉంటాడు.. గంజా యిని ఎలా తీసుకురావాలి.. ఎక్కడ అప్పగించాలి అనేది వాడి కనుసన్నల్లోనే సాగుతుంది.సరుకు అప్పగించే వరకూ ఆ దళారీ బాధ్యత తరువాత అంతా స్మగర్లదే.. వివిధ మార్గాల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని బహిరంగ మార్కె ట్లోకి తీసుకొచ్చే స్తున్నారు. పోలీసులకు సమాచారం అందితేనే పట్టుకోగ లిగేటంత పకడ్బందీగా రవాణా చేస్తున్నారు. గంజాయి వ్యాపారుల మధ్య వచ్చిన తగవుల కారణంగా పట్టుబడతాయి తప్ప.. పోలీసులు తనిఖీలో పట్టుకున్న కేసులు చాలా స్వల్పం. ఎందుకంటే ఒక వేళ పోలీసులు తనిఖీ చేసినా పట్టుకోలేనంతగా రవాణా సాగుతోంది. ఇటీవల వేరుశనగ పొట్టుమాటున గంజాయి రవాణా సాగుతుం దని సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అంతకుముందుకు ఫ్లేవుడ్‌ చెక్కల మాటున రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకున్నారు. అంతే కాకుండా ఇటీవల రాజానగ రం వద్ద లిక్విడ్‌ గంజాయిని రవాణా చేస్తూ ఇద్దరు యువ కులు పట్టుబడ్డారు. ఇలా ఒకటా రెండా పట్టుకున్న కేసులన్నీ ఇటువంటివే.. ఎన్ని కేసులైనా నేటికీ గుట్టుచప్పుడు కాకుండా గంజాయి రవాణా చేస్తూనే ఉన్నారు. 


పాత వాహనాలు కొనుగోలు చేసి..


ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన లగ్జరీ కార్లను గంజాయి రవాణాకు వినియోగిస్తున్నారు. అందుకు ఓఎల్‌ఎక్స్‌, కార్‌ యాప్‌లను వినియోగిస్తున్నట్టు సమాచారం. వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారి పేర్లపై పాత కార్లును  తీసుకుని వాటిని గంజాయి రవాణాకు వినియోగిస్తున్నారు. లగ్జరీ కార్లు, వీఐపీ ఫ్యాన్సీ నెంబర్లతో ఉన్న కార్లను వినియోగించి ఎవరికి అనుమానం రాకుండా ఈజీగా గంజాయిని రవాణా చేస్తున్నారు.అలాగే రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతున్న కొన్ని రకాల నిత్యావసరాలు,వస్తువుల మాటు న గంజాయి రవాణా అవుతుందని ఇటీవల పట్టుబడిన కొన్ని వాహనాల సంఘటనలు రుజువు చేస్తున్నాయి. 


వేలల్లో కొని.. కోట్లలో అమ్మకాలు..


గంజాయి మత్తుకు అలవాటు పడిన వారు ఎంత ఖర్చుచేసైనా గంజాయిని వెతుక్కుంటూ వెళతారు. వారి అవసరాలను అసరాగా చేసుకునే వ్యాపారులు పెద్ద ఎత్తున గంజాయిని స్మగ్లింగ్‌ చేయిస్తున్నారు.గంజాయి వ్యాపారం దేశ  స్థాయిలో జరుగుతున్న పెద్ద మాఫియా. ఏజెన్సీలో కేవలం కేజీ గంజాయి వేలలో కొనుగోలు చేసి దానిని లక్షల్లో అమ్మకాలు చేస్తున్నారు. ఐదు గ్రాములు, పది గ్రామలు , 50 గ్రామలు ,100 గ్రాములు ఇలా చిన్నచిన్ని ప్యాకెట్లుగా చేసి వాటిని ఎక్కడికక్కడ లోకల్‌ సేల్స్‌ చేసే పాయింటలకు చేరి విక్రయాలు చేస్తున్నట్టు సమాచారం.ఏటా కోట్లాది రూపాయల గంజాయి వ్యాపారం జరుగుతుందనేది బహిరంగ రహస్యమే .


యువతీయువకులే టార్గెట్‌..


పలు పట్టణాల్లో గంజాయిని ఎక్కువ మంది యువ తీయువకులు వినియోగిస్తున్నారు. జిల్లాలోని రాజమహేం ద్రవరంలోనే దీని వినియోగం చాలా ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఇంజనీరింగ్‌ యువత ఎక్కువగా బానిసలవు తున్నట్టు తెలిసింది.రాజమహేంద్రవరంలోని ప్రముఖ కళా శాలల్లో వినియోగం ఎక్కువగా ఉన్నట్టు విద్యార్థులే చెబుతు న్నారు. ఇది కాకుండా పశ్చిమగో దావరి జిల్లా తాడేపల్లిగూడెం, నరసాపురం, కాకినాడ,  హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, కర్నాటక , బెంగుళూరు, గోవా వంటి నగరాలు, పట్టణాల్లో గంజాయి వినియోగం అత్యఽధికంగా ఉంది.డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో ఏజెన్సీ నుంచి గంజాయి సరఫరా సాగిపోతూనే ఉంది.  


అమాయకులకు వల..


గంజాయి అక్రమ రవాణాకు డబ్బులు అత్యవసరంగా ఉన్న అమాయకులను స్మగ్లర్లు ఎంచుకుంటున్నారు. అసలు స్మగ్లరు ఎవరో కూడా తరలించే వ్యక్తికి తెలియదు. మధ్యవర్తులు అమాయకులను గంజాయి రవాణాకు పెట్టుకుంటున్నారు. కార్లు, వ్యాన్లు, బస్సులు ,రైళ్ళు ఇలా వివిధ మార్గాల్లో తరలిస్తే వాటి లక్షల్లో కిరాయి చెల్లిస్తారు. గంజాయి జిల్లా దాటిస్తే రూ.50 వేలు, రాష్ట్రం దాటిస్తే రూ.లక్ష ఇస్తారు. ముందుగా కొంత నగదు అడ్వాన్సుగా ఇవ్వడంతో డబ్బుల కోసం అమాయకులు రిస్క్‌ చేస్తున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులోనే సుమారు 40 ఖైదీలు గంజాయి కేసుల్లో పట్టుబడిన వారే ఉన్నారు. వీరి సంఖ్య నెలనెలకు పెరుగుతూ వస్తుంది తప్ప తరగడం లేదు. 


జిల్లాలో నెలలో సగటున 8 కేసులు 


విశాఖ ఏజన్సీ నుంచి వివిధ మార్గాల గుండా జరుగుతున్న గంజాయిపై పోలీసులు నిఘా పెడుతున్నారు. అయినా పోలీసులు కన్ను గప్పి తప్పించుకునే వారి సంఖ్యే అధికం. సగటున ఒక్కతూర్పుగోదావరి జిల్లాలో  నెలకు 8 నుంచి 10 కేసులు నమోదవుతున్నాయి. గడచిన మూడు నెలల కాలంలో సుమారు  25 కేసులు నమోదయ్యాయి. పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నా గంజాయి రవాణాకు మాత్రం చెక్‌ పడడం లేదు. దీని లోపాలు ఎక్కడ ఉన్నాయనేది ప్రభుత్వానికే తెలియాలి. ఒక్కపుడ్పు భారత దేశానికి ధాన్యం అందించి అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్ర రాష్ట్రం నేడు గంజాయిని అందించే మత్తు రాష్ట్రంగా పేరేల్లడం రాష్ట్ర ప్రతిష్టను మంటగలుపుతుంది. ఆధునిక పరిజ్ఞానం చేతిలో ఉంది. అయినా గంజాయి స్మగ్లింగ్‌ ఆగడం లేదు. 


సమాచారమిస్తేనే పట్టుకుంటారు..


గంజాయి స్మగ్లింగ్‌ గ్రూపుల మధ్య వర్గపోరులో సమాచారం చేరవేయడం ద్వారా గంజాయి వాహనాలు పట్టుబుడుతున్నాయి తప్పితే నిజంగా ట్రేస్‌ చేసి పట్టుకునే సందర్భాలు తక్కువే. ఎన్‌హెచ్‌ 16 రోడ్డు, మారేడుమిల్లి, నర్సీపట్నం రోడ్డు, చింతూరు -భద్రాచలం రోడ్డు గుండా నిత్యం గంజాయి అక్రమ రవాణా సాగుతుంది. వాటిలో కొన్నివాహనాలు మాత్రమే పట్టుబడుతున్నాయి. డీప్‌ ఫారెస్ట్‌ నుంచి జిల్లాలు గంజాయి దాటుతుండడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో అవినీతి అక్రమాల వల్ల  గంజాయి రవాణా సాఫీగా సాగుతుందనే వాదన వినిపిస్తోంది. మొత్తం మీద గంజాయి రవాణాకు అడ్డుకట్టవెయడంలో పోలీసులు విఫలమవుతూనే ఉన్నారు. 


మామూళ్ల మత్తులో పోలీసులు.. 


పోలీసులు మామూళ్ల మత్తులో జోగుతుండడంతో స్మగ్లర్లు యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. ఏజెన్సీలో చెక్‌ పోస్టు వద్ద ఒక లారీని వదలడానికి ఇంతని రేటు మాట్లాడుకుని యథేచ్ఛగా తరలిస్తున్నట్టు సమాచారం. అందుకే సినిమాలను తలపించే రీతిలో గంజాయి రవా ణా చేస్తున్నారు.ముఖ్యంగా రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఉన్న అన్ని కనెక్టింగ్‌ రోడ్లును, వినియోగంలో లేని కాలిబాట దారులను వినియోగించి ఒక నిర్ధేశిత ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడకు గంజాయిని బైక్‌ల ద్వారా చేర్చి అక్కడ నుంచి కార్లు, ఇతర వాహనాల్లో రాష్ట్రాలు దాటిస్తున్నారు.దీనికి అక్కడక్కడా పోలీసుల సహకరిస్తు న్నట్టు సమాచారం.ఇలా ఏజెన్సీ దాటి వచ్చి కోరు కొండ, దేవరపల్లి ప్రాంతాల్లో పోలీసులకు చిక్కుతున్నారు. 


Updated Date - 2022-08-13T06:42:34+05:30 IST