హై..టెంపరేచర్
ABN , First Publish Date - 2022-12-15T00:08:12+05:30 IST
చిన్నారులు జ్వరంతో విలవిల్లాడిపోతున్నారు.. 103 నుంచి 104 డిగ్రీల మధ్య జ్వరం ఉండడంతో తల్లిదండ్రులు భయపడిపోతున్నారు..
మలేరియా, డెంగీ కేసులు నమోదు
చిన్నారులపై విజృంభణ
వణికిపోతున్న తల్లిదండ్రులు
ఆసుపత్రులకు పరుగులు
ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిట
చిన్నారులు జ్వరంతో విలవిల్లాడిపోతున్నారు.. 103 నుంచి 104 డిగ్రీల మధ్య జ్వరం ఉండడంతో తల్లిదండ్రులు భయపడిపోతున్నారు.. వెంటనే ఆసు పత్రులకు పరుగులు పెడుతున్నారు.. దీంతో ప్రభుత్వ.. ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.. ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలోనే చిన్నారులకు 25 బెడ్స్ ఉంటే 15 బెడ్స్పైగానే చిన్నారులు చికిత్స పొందుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సీజన్ మారడంతో జ్వరపీడితులు పెరిగారు.. ఒక్కో చిన్నారి వారం నుంచి పది రోజుల పాటు జ్వరంతో బాధపడుతున్నాడు.వీరిలో ఎక్కు వగా మలేరియా, డెంగీ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. వైద్యులు మాత్రం జర్వమే కదా అని నిర్లక్ష్యం చేయవద్దని చెబుతున్నారు.
రాజమహేంద్రవరం అర్బన్, డిసెంబరు 14 : చిన్నారులను జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. డెంగీ, మలేరియా, న్యుమోనియా వంటివి వెంటాడుతున్నాయి. చలి కాలం కావడం, వాతావరణంలో వస్తున్న సీజనల్ మార్పులు తదితర కారణాలతో చాలా మంది చిన్నారులు జ్వరాల బారినపడుతున్నారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
కిటకిటలాడుతున్న ప్రభుత్వ ఆసుపత్రి
ప్రతి రోజూ జ్వరాలతో వస్తున్నవారితో రాజమహేంద్రవరంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి కిటకిటలాడుతోంది. ఆసుపత్రిలో చిన్న పిల్లల ఓపీ ఎక్కువగానే ఉంటోంది. సర్వజన ఆసుపత్రిలో చిన్నపిల్లలకు చెందిన 24 ఇన్‌పేషెంట్ బెడ్స్ అందుబాటులో ఉండగా సుమారు 15 మందికి పైగా చిన్నారులు జ్వరాలతో చికిత్స పొందుతున్నారని సమాచారం. ప్రభుత్వాసుపత్రిలోని ఎంసీహెచ్బ్లాకులో చిన్న పిల్లలకు సంబంధించి రెండు ఓపీలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ డీఈఐసీ ఓపీతో పాటు సాధారణ ఓపీ ఇక్కడ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఓపీ విభాగంలో సుమారు 35 నుంచి 40 మంది వరకూ చూపించుకుంటుంటే వీరిలో చాలా మంది జ్వరపీడితులు ఉన్నట్టు చెబుతున్నారు. ఇక అర్బన్ హెల్త్సెంటర్లలోనూ జ్వరాలతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ప్రస్తుతం మలేరియా, డెంగీ కేసులు తగ్గినట్టు కనిపిస్తున్నా న్యుమోనియా కేసులు ఎక్కువగానే వస్తున్నాయని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని చిన్నపిల్లల వైద్యులు తెలిపారు.గత అక్టోబరు, నవంబరు నెలలతో పోల్చితే డిసెంబరులో చిన్నారుల జ్వరాల సంఖ్య కాస్త తగ్గాయని పేర్కొంటున్నారు. ఇక కొవ్వూరు, నిడదవోలు తదితర పట్టణాల్లోనూ జ్వర పీడితుల కేసులు పెరిగినట్టు సమాచారం.
ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ
ప్రభుత్వాసుపత్రి, అర్బన్ హెల్త్ సెంటర్లతో పోల్చితే చిన్నపిల్లల ప్రైవేట్ ఆసుపత్రులు రద్దీగా ఉంటున్నాయి. ఇక్కడ మలేరియా, డెంగీ, న్యుమోనియా బాధిత చిన్నారులు ఎక్కువగా ఉంటున్నారు. రాజమహేంద్రవరంలో దానవాయిపేట, ప్రకాశ్‌నగర్, దేవీచౌక్, నందం గనిరాజు సెంటర్, గోకవరం బస్టాండ్ తదితర ప్రాంతాలల్లో పిల్లల వైద్యనిపుణులు ఎక్కువగా ఉన్నారు. ఒక్కో ఆసుపత్రిలో రోజూ 60 పైగానే కేసులు నమోదవుతున్నట్టు సమాచారం.వైద్యులు రెండు రోజుల పాటు సాధారణ జ్వరం మందులు ఇస్తున్నారు.తగ్గకపోతే పరీక్షలు చేయిస్తున్నారు. పరీక్ష లకు వేలల్లో ఖర్చులు అవుతుండడంతో మధ్య తరగతి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే లాలాచెరువు, క్వారీమార్కెట్ ఏరియా, నారాయణపురం, బర్మాకాలనీ, పీఅండ్‌టీ కాలనీ, రాజేంద్రనగర్, తాడితోట, ఆల్కట్గార్డెన్స్ వంటి ప్రాంతాల్లో ఆర్ఎంపీ వైద్యులకు డిమాండ్ పెరిగింది. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే ఆర్థిక స్తోమత లేకపోవడం, సర్వజన ఆసుపత్రికి వెళ్లడానికి ఆసక్తిచూపించని కార్మిక, పేద ప్రజానీకం ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నారు.
దోమల నివారణ చర్యల్లేవ్..
సీజన్ మారడంతో దోమలు పెరిగాయి. దీంతో చిన్నారులు అనారోగ్యాలకు గురవుతున్నారు. గతంలో సీజన్ మారినవెంటనే దోమల నివారణ చర్యలు చేపట్టేవారు. ముందస్తుగా డ్రెయినేజీల్లో గంబూషియా చేపలను వదిలేవారు. ఫాగింగ్ చేయించేవారు. డ్రెయినేజీల వద్ద బ్లీచింగ్ చల్లేవారు. ఇలా దోమల నివారణకు ఎంతో కొంత ఖర్చుపెట్టేవారు. ఈ ఏడాది మాత్రం అటువంటివి ఏమీ లేవు. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి.చిన్నారులు, పెద్దలు అనారోగ్యం బారినపడేలా చేస్తున్నారు. ఇటీవల దేవరపల్లికి చెం దిన ఒక ఉపాధ్యాయురాలు డెంగీతో మృతిచెందడమే అందుకు నిదర్శనం.