మోతాదుకు మించి ఎరువులు వాడొద్దు

ABN , First Publish Date - 2022-09-17T05:57:44+05:30 IST

ఎరువులు, హానికారక రసాయనాలు మోతాదుకు మించి వినియోగిస్తుండడంతో భూసారం దెబ్బతింటోంది. పంటలను పట్టిపీడించే పురుగులు, చీడపీడల కోసం వాడుతున్న రసాయనాలు మరిన్ని కొత్తచీడపీడలకు కారణమవుతున్నాయి.

మోతాదుకు మించి ఎరువులు వాడొద్దు

 అధిక ఎరువులు, రసాయనాలతో భూసారానికి నష్టం 

తక్కువ మోతాదులో వాడాలంటున్న వ్యవసాయ నిపుణులు

సామర్లకోట, సెప్టెంబరు 16: ఎరువులు, హానికారక రసాయనాలు మోతాదుకు మించి వినియోగిస్తుండడంతో భూసారం దెబ్బతింటోంది. పంటలను పట్టిపీడించే పురుగులు, చీడపీడల కోసం వాడుతున్న రసాయనాలు మరిన్ని కొత్తచీడపీడలకు కారణమవుతున్నాయి. మరోవైపు రైతులకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అధిక ఎరువులు, రసాయనాల వినియోగం అనర్దమని తక్కువ మోతాదులో వినియోగించుకోవాలని వ్యవసాయ నిపుణులు, జిల్లా రీసోర్సు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్లో జిల్లాలో సుమారు 2.50లక్షల ఎకరాలలో వరినాట్లు వేశారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది రైతులు మోతాదుకు మించి ఎరువులు, రసాయనాలను వాడుతున్నారు. సాధారణంగా వరిలో దోమ పోటు, పచ్చపురుగు, అగ్గితెగులు కనిపిస్తే గ్రామంలోని రైతు లందరూ కూడా అగ్గితెగులుకు మందును పిచికారీ చేస్తున్నారు. ప్రస్తుతం వరి పంట తెగుళ్ల నివారణ కోసం రూ.2వేల ఖర్చు చేస్తే సరిపోతుంది. కానీ రూ.5వేల నుంచి రూ.10వేల వరకూ క్రిమి సంహారిక మందుల కోసం వినియోగిస్తున్నారు. జిల్లాలో చాలా ప్రాంతాలలో భూసార పరీక్షలు చేయ కుండా ఎరువులు వాడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో భూసార పరీక్షల్లో పంటలకు కావాల్సిన పోషకాలన్నీ నేలల్లో ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇంకా చాలా ప్రాంతాల్లో భూసారకార్డులు ఆధారంగా ఎరువుల విని యోగం జరగడం లేదు. పాత పద్ధతిలోనే యూరియా ఎక్కువ వినియో గిస్తే అధిక దిగుబడి వస్తోందని రైతులు భావిస్తున్నారు. ఎరువులు రసాయనాలు మోతాదుకి మించి వాడితే అనర్ధాలు తప్పవని వ్యవసా యశాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త పద్ధతులపై వ్యవసాయశాఖ అధికారులు రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉంది. ప్రస్తుతం వర్షాలు కురిసి వరి నాట్లు, మూనలు నీటమునిగిన నేపథ్యంలో రైతులకు  జాగ్రత్తలు సూచించాల్సి ఉంది.

నష్టమే ఎక్కువ

అధిక మోతాదులో వినియోగిస్తున్న ఎరువులు, పురుగు మందులతో రైతులకు లాభం కంటే నష్టం ఎక్కువ. భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వాడకం చాలా ఉత్తమం. సేంద్రియ ఎరు వులు వినియోగిస్తేనే వ్యవసాయం లాభసాటిగా మారేందుకు అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే పెద్దఎత్తున రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. తాము నిరంతరం రైతులకు క్షేత్రస్థాయిలో సమగ్ర పోషకాల యాజమాన్య పద్ధతులపై నిరంతరం రైతులను చైతన్యం చేస్తూనే ఉన్నాం.

-వై.జ్యోతిర్మయి,  జిల్లా శిక్షణా కేంద్ర కో-ఆర్డినేటర్‌, కాకినాడ.Read more