కొప్పవరంలో రైతుల రాస్తారోకో
ABN , First Publish Date - 2022-11-08T01:37:23+05:30 IST
ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనే నాథుడు లేకపోవడంతో రైతులు రోడ్డున పడ్డారు. అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి సత్వరమే ధాన్యం కొనుగోలు చేసి వారం రోజుల్లో సొమ్ములు చెల్లించాలని డిమాండు
సంఘీభావం ప్రకటించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి
అనపర్తి, నవంబరు7: ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనే నాథుడు లేకపోవడంతో రైతులు రోడ్డున పడ్డారు. అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి సత్వరమే ధాన్యం కొనుగోలు చేసి వారం రోజుల్లో సొమ్ములు చెల్లించాలని డిమాండు చేస్తూ అనపర్తి మండలం కొప్పవరం రైతులు సోమవారం అనపర్తి-కొప్పవరం రహదారిలో రాస్తారోకో చేపట్టారు. రోడ్లపై ఎండబెట్టిన ధాన్యం చెంతనే వారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసు కున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ శ్రేణులతో కలిసి అక్కడికి చేరుకుని రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును రామకృష్ణారెడ్డికి వివరించారు. సుమారు 20 రోజులుగా కోతలు కోస్తున్నామని, తమ ధాన్యం కళ్లాల్లోనే ఉందని, ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక పక్క బరకాలు కూడా దొరకడం లేదని, వర్షం వస్తే తమ పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేద న్నారు. అనపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారని, అక్కడ కూడా కొనుగోలు చేసిన పాపాన పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సీజన్ నుంచి కొత్త పద్ధతి అమ లు అంటున్నారని, అది ఏవిధంగా చేస్తారో కూడా తమకు అర్థం కావడం లేదని వారు వాపోయారు. వెంటనే అన్ని గ్రామాల్లోను ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పాత పద్ధతిలోనే కొనుగోలు చేయాలని, వారంలోగా సొమ్ములు చెల్లించాలని వారు డిమాండు చేశారు. ఇప్పటికే పెట్టుబడులు తేలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని ధాన్యం సొమ్ములు ఆలస్యం చేస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వారు రామకృష్ణా రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆం దోళన కార్యక్రమంలో జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు సిరసపల్లి నాగేశ్వరరావు, జిల్లా వాణిజ్య విభాగం అద్యక్షుడు తమలంపూడి సుథాకరరెడ్డి, నాయకులు కర్రి వెంకటరామా రెడ్డి, సత్తి దేవదానరెడ్డి, కొవ్వూరి శ్రీనివాస రెడ్డి, దత్తుడు శ్రీను. మామిడిశెట్టి శ్రీను, స ముదానపాలెపు వీరన్న, గంగిరెడ్డి, కుంత్సం కాశీవిశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తహశీల్దార్ కార్యాలయం వద్ద టీడీపీ ధర్నా
అనపర్తి, నవంబరు 7 : ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విధానం రైతులను ఇబ్బందులకు గురిచేసేలా ఉందని, వెంటనే నిబంధనలను సరళీకృతం చేయాలని డిమాండు చేస్తూ సోమవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ శశిధర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పలువురు పాల్గొన్నారు.