ఇప్పటికీ.... తడబడి...!

ABN , First Publish Date - 2022-07-05T07:13:36+05:30 IST

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి) జిల్లాలో పాఠశాలలు మంగళవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. కొవిడ్‌ సమస్యలు, గతేడాది అరకొర పాఠశాలల దినాలు.. ఎక్కువ సిలబస్‌తో విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా ఒత్తిడికి గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఏడాది విద్యా సంవత్సరం జూలై నుంచి మొదలవుతోంది. పాఠ

ఇప్పటికీ.... తడబడి...!
బిక్కవోలు ఉన్నత పాఠశాల ఆవరణలో ఇదీ పరిస్థితి. ఈ వర్షాకాలంలో ఇలా మోకాల్లోతు నీటిలోనే నడిచివెళ్లాలి.

నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం

 అరకొరత వసతులు.. తక్కువ కిట్లు

 కాగితాలలోనే విలీన పాఠశాలలు

 జిల్లాలో కదలని రెండో దశ నాడు-నేడు

అటు ఉపాధ్యాయుల్లోనూ గందరగోళం

పాఠాలు చెప్పాలా.. పనులు చేయించాలా?

రూ.161 కోట్ల 442 స్కూళ్లకు అంచనా

811 అదనపు గదుల నిర్మాణం.. పిల్లర్స్‌ దశలోనే(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో పాఠశాలలు మంగళవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. కొవిడ్‌ సమస్యలు, గతేడాది అరకొర పాఠశాలల దినాలు.. ఎక్కువ సిలబస్‌తో విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా ఒత్తిడికి గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఏడాది విద్యా సంవత్సరం జూలై నుంచి మొదలవుతోంది. పాఠశాలలు ప్రారంభించేసరికి నాడు-నేడు పనులతోపాటు, జగనన్న విద్యాకానుక కింద ఇచ్చే కిట్లు, పాఠ్యపుస్తకాలు కూడా పాఠశాలలు తెరిచేసరికి ఆయా పాఠశాల్లో సిద్ధంగా ఉంటాయని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. మంగళవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నా రెండో దశ నాడు-నేడు పనులు పూర్తికాలేదు. వాస్తవానికే ఇప్పుడే కొద్దిచోట్ల మొదలయ్యాయి. పుస్తకాలు కూడా పూర్తికాలేదు. జగనన్న విద్యాకానుక కిట్లు కూడా పూర్తి స్థాయిలో పాఠశాలలకు చేరలేదు. రాజమహేంద్రవరం సిటీకి సంబంధించిన ఎస్‌కేవీటీ కాలేజీ వద్ద నుంచి కొన్ని కిట్లను, బ్యాగులను వివిధ పాఠశాలలకు పంపిణీ చేస్తున్నారు. అవీ అరకొర మాత్ర మే. దీనిపై అధికారులు కథనం వేరేగా ఉంది. నెలరోజుల వరకూ విద్యార్థులు వస్తూనే ఉంటారని, అప్పటికీ అందరికీ చేరతాయని చెబుతున్నారు. ఇక్కడ మరో గందరగోళం కూడా ఉంది. ప్రాఽథ మిక పాఠశాలలను అప్పర్‌ప్రైమరీ, హైస్కూళ్లలో విలీనం చేసినట్టు చెబుతున్నారు. కానీ వాస్తవానికి రేషనలైజేషన్‌, పాఠశాల విలీనం కాగితాలకే పరిమితమైంది. రెండేళ్ల కిందట మూడు కిలోమీటర్లలోపు ఉన్న పాఠశాలలను హైస్కూళ్లలో విలీనం చేస్తామన్నారు. తర్వాత మాట మార్చుకుని కేవలం కిలోమీటరు దూరంలోనే ఉన్నవే విలీనం చేస్తామన్నారు. ఇవాళ కేవలం ఒకే ప్రాం గణం లోపల ఉన్న పాఠశాలలను మాత్రమే విలీనం చేస్తామంటున్నారు. మరో విచిత్రమేమిటంటే గత ఏడాది విలీనం చేసిన పాఠశాలలను మళ్లీ విడివిడిగా చేయడం గమనార్హం. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పరిధిలోని ఆనందనగర్‌, ఊట్లంక పాఠశాలలో గతంలో విలీనం చేశారు. ఇవాళ మళ్లీ వాటిని విడిగా చేశారు. నెహ్రూనగర్‌ హైస్కూల్‌, ప్రాఽథమిక పాఠశాల పరిస్థితీ అంతే. మండలాల్లో పరిస్థితి కూడా ఇలానే ఉంది. బిక్కవోలు మండలం సింగపల్లి హైస్కూల్‌, ప్రాథమిక పాఠశాలలు విలీనం చేసినట్టు కాగితాల్లో ఉంది. కానీ ఇప్పటికే వేర్వేరుగానే ఉండడం గమనార్హం. ఇలా చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులలో కూడా గందరగోళం ఏర్పడింది.


జిల్లాలో 754 పాఠశాలు

జిల్లాలో 754 పాఠశాలలు ఉన్నాయి. డీఈవో అబ్రహం చెప్పిన వివరాల ప్రకారం హైస్కూళ్లు 420, అప్పర్‌ ప్రైమరీ స్కూళ్లు 334. అంటే ఆయన లెక్క ప్రకారం ప్రాఽథమిక పాఠశాలు లేనట్టే. కానీ ఇంకా ప్రాథమిక పాఠశాలు చాలా ఉన్నాయి. మొత్తం జిల్లాలో 2, 62,976 మంది విద్యార్థులున్నారు. అందులో బాలురు 1,36,844, బాలికలు 1,27,132 మంది. పాఠశాలల్లో ఎంతమంది విద్యార్థులైనా చేర్చుకుంటామని, సెక్షన్‌ 40 మంది ఉంటారని చెబుతున్నారు.


హైస్కూళ్లలో ఇంటర్‌ 

జిల్లాలోని 19 మండలాల్లో మండలానికి ఒకటి వంతున హైస్కూళ్లలో ఇంటర్‌ తరగతులు కూడా ఏర్పాటుచేస్తున్నారు. అక్కడ టెన్త్‌ పాసైన వారినందరికీ అక్కడే ఇంటర్‌లో చేరమని చెబుతున్నారు. కానీ ఇంకా ఏ కోర్సులు అనేది స్పష్టత లేదు. ఏ కోర్సు కావాలంటే అదే ఇస్తామంటున్నారు. ఎంపీసీ, బైపీసీ, ఆర్ట్స్‌, కామర్స్‌ ఏదైనా సరే అంటున్నారు. కానీ ఇంతవరకూ స్పష్టత లేదు. పైగా ఈ ఏడాది మొటి ఇంటర్‌ తరగతులు మాత్రమే నిర్వహిస్తారు. కానీ ఇంతవరకూ లెక్చరర్ల నియామకం జరగలేదు. ఈనెల 15వ తేదీ నుంచి జూనియర్‌ కాలేజీలు ప్రాంభం కావలసి ఉంది. కానీ ఇంకా అంతా అక్కడ శూన్యమే కనిపిస్తోంది.


నేడా- నాడా..

 జిల్లాలో నాడు-నేడూ పరిస్థితి నేడా.. నాడా.. అన్నట్టు ఉంది. నాటి పరిస్థితే ఇంకా కొనసాగుతోంది. జిల్లాలో 564 పాఠశాల్లో పనులు చేయవలసి ఉంది. ఇంతవరకూ 442 పాఠశాలల్లో పనులకు  ఎస్టిమేషన్లు వేశారు.  వీటికి రూ.161 కోట్లు అవసరం. కానీ ఇంతవరకూ ప్రభుత్వం ఆయా విడుదల చేసి సొమ్ము కేవలం  రూ.24 కోట్లు. ఇందులో ఖర్చుచేసింది కూడా తక్కువే. ఈ సొమ్ము లు రావడం ఆలస్యం కావడంతో ఈ పనులు కూడా ఆలస్యమయ్యాయి. ఈ సొమ్ముతో  జిల్లాలోని 156 స్కూళ్లలో 811  అదనపు గదులు నిర్మించవలసి ఉంది. వీటికి రూ.97.32 కోట్లు మంజూరు చేశారు. ఈ పనుల్లో కొన్ని ఫిల్లర్ల దశలోనే ఉన్నాయి. ఫిల్లర్స్‌ అంటే భూమిలో గోతులు తవ్వి నిర్మించవలసినవి కావు. స్థలాన్ని కూడా వృథా చేయవద్దని, ఉన్న భవనాల మీదే అదనపు గదులు నిర్మించాలనే నిబంధన కొత్తగా రావడంతో మేడ మీదే ఫిల్లర్లు లేపుతున్నారు. పాఠశాలల్లో పది కాంపొనెంట్స్‌ పనులు చేయవలసి ఉంది. వీటికి రూ.54 కోట్లు కేటాయించారు. వీటిలో ఎలక్ర్టికల్‌ వర్కు, మైనర్‌-మేజర్‌ రిపేర్లు, డ్రింకింగ్‌ వాటర్‌, ఫర్నిచర్‌, టాయిలెట్స్‌ ఇంగ్లీష్‌ ల్యాబ్‌, గ్రీన్‌చాక్‌బోర్డు, కాంపౌండ్‌వాల్‌, కిచెన్‌ షెడ్‌ వంటివి నిర్మించాలి. ఇపుడిప్పుడే మొదలుపెడుతున్నారు.


కడియంలో చెరువులా...

కడియం, జూలై 4: కొద్దిపాటి వర్షానికే మండల కేంద్రం అయిన కడియం ఉన్నత పాఠశాల ఆవరణ చెరువును తలపిస్తోంది. దీంతో వర్షాకాలం విద్యార్థులు పాఠశాల తరగతి లోపలికి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా నానా ఇబ్బందులు పడాల్సిందే. అలానే క్రీడా స్థలం లేకపోవడం మరో సమస్య. కడియం మండలం విద్యావనరుల కేంద్రం కూడా ఫ్లోరింగ్‌ కిందకు కుంగిపోయి, తలుపులు ఊడిపోతూ శిఽథిలావస్థలో ఉంది. మండలంలో పాఠశాలలకు సంబంధించి ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించడంతోపాటు రికార్డులు, పాఠశాలలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు భద్రపరిచే కేంద్రం ఇది. ఇటీవల కొంతనిధులు విడుదల కావడంతో పనులు మొదలుపెట్టినా మధ్యలోనే నిలిచాయి.


గోపాలపురం ప్రారంభ దశలోనే..

గోపాలపురం, జూలై4: ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ    పాఠశాలలను తీర్చిదిద్ది నాణ్యమైన విద్యను అందించాలన్న ప్రభుత్వ ధ్యేయం ఆదిలోనే హంసపాదు చందంగా మారింది. మండలంలో నాడు-నేడు పనులకు మొదటి విడతలో 22 పాఠశాలలకు రూ.4.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. రెండో విడతలో 16 పాఠశాలలకు రూ.8.23 కోట్లను మంజూరు చేయగా చాలాచోట్ల పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. కొవ్వూరుపాడు, గోపాలపురంలలో అదనపు తరగతి గదులు పునాదుల వరకే పరిమితం కాగా, రాజంపాలెం హైస్కూల్‌లో నిర్మాణ పనులు ప్రారంభంకాలేదు. గోపాలపురం హైస్కూల్‌లో అదనపు గదుల నిర్మాణ పనులు ప్రారంభించినా నిధులు మంజూరు కాక ఇప్పటికీ అసంపూర్తిగానే మిగిలిపోయాయి. 

Updated Date - 2022-07-05T07:13:36+05:30 IST