నకిలీ వైద్యులు, ఆయా ఆసుపత్రులపై కఠిన చర్యలు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-12-07T01:51:36+05:30 IST

జిల్లాలో నకిలీ వైద్యులు, నకిలీ వైద్య ధ్రువపత్రాలతో ఆసుపత్రులను నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోను న్నామని, దీనికోసం ఓ టాస్క్‌ఫోర్స్‌ కమిటీని నియమించినట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు.

నకిలీ వైద్యులు, ఆయా ఆసుపత్రులపై కఠిన చర్యలు : కలెక్టర్‌
టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ మాధవీలత

ఈనెల 10 నుంచి 20 వరకు జిల్లావ్యాప్తంగా తనిఖీలు

రాజమహేంద్రవరం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నకిలీ వైద్యులు, నకిలీ వైద్య ధ్రువపత్రాలతో ఆసుపత్రులను నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోను న్నామని, దీనికోసం ఓ టాస్క్‌ఫోర్స్‌ కమిటీని నియమించినట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం రాత్రి టాస్క్‌ఫోర్స్‌ కమి టీ సభ్యులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇటీవల నకిలీ వైద్య ధృవపత్రం ద్వారా ఆసుపత్రి నిర్వహించి, వైద్యం చేస్తూ ఒకరి మృతి కారణమైన విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నారు. ఇలా ప్రజల ఆరోగ్యాలతో ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. దీనికోసం జిల్లాలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశామని, ఇందులో వైద్యఆరోగ్యశాఖ, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సభ్యులు, స్వచ్ఛంద సంస్థ తరపున ఒకరు తనిఖీలు నిర్వహిస్తారన్నారు. తనిఖీల్లో చెక్‌లిస్ట్‌ రూపొందిస్తామని, జిల్లాలో గత ఐదారు ఏళ్లలో ఏర్పాటుచేసిన ఆసుపత్రుల్లో తనిఖీలు చేసి, తర్వాత మిగిలిన వాటి రికార్డులు సమగ్రంగా పరిశీలించాలని ఆమె సూచించారు. ప్రతీ ఆసుపత్రి ప్రభుత్వ నిబంధనలకు లోబడి, ప్రతీ ఐదేళ్లకు రెన్యువల్‌ చేసుకోవాలని, ఇప్పటివరకూ పెండింగ్‌లో ఉన్న రెన్యువల్‌ దరఖాస్తులను పరిశీలించి అనుమతివ్వాలన్నారు. జిల్లా స్థాయి కమిటీలో డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ కె.వేంకటేశ్వరరావు, ఐఎంఏ సభ్యుడు డాక్టర్‌ ఎస్‌.గురుప్రసాద్‌, డీఆర్‌డీఏ పీడీ, స్పచ్ఛంద సంస్థల తరపున జక్కంపూడి విజయలక్ష్మి ఉన్నారు. నకిలీ వైద్యులపై చట్టపరమైన చర్యలకు ఆయా సెక్షన్లకు అనుగుణంగా కేసులు నమోదు చేయాలని, నకిలీ డాక్టర్‌గా గుర్తించిన వారికి గతంలో అనుమతులు ఇచ్చిన వారి వివరాలు కూడా సేకరించాలన్నారు. వారిపై కూడా తగిన చర్యలు ఉంటా యని ఆమె హెచ్చరించారు. ఈనెల 10 నుంచి 20 వరకూ ఈ బృందాలు తనిఖీ చేస్తాయని, తనిఖీల సమయంలో ఆయా ఆసుపత్రులు మొత్తం ధ్రువపత్రాలు, అందులో పనిచేసే వైద్యుల వివరాలు, ఐఎంఏ గుర్తింపు ఉందా లేదా క్షుణంగా పరిశీలించి నిర్ధారించాలన్నారు. చెక్‌లిస్ట్‌ రూపొందించే సమయంలో ఒకటికి రెండుసార్లు సమీక్షించాలని సూచించారు.

Updated Date - 2022-12-07T01:51:37+05:30 IST