శాంతి లేదు.. భద్రత లేదు!

ABN , First Publish Date - 2022-12-31T01:04:28+05:30 IST

తూర్పున 2022 ఏం మిగిల్చిందంటే.. అశాంతి.. అభద్రత.. ప్రజలకు శాంతి లేదు.. రోడ్డుపై వెళ్లే వారికి భద్రత లేదు.. మహిళలకు రక్షణ లేదు.. మూడు హత్యలు.. ఆరు ప్రమాదాలు..

శాంతి లేదు.. భద్రత లేదు!

రోడ్డు ప్రమాదాల్లో 295 మంది మృతి

అధికశాతం అధ్వాన రోడ్లే కారణం

గ్రామాల్లో ఏరులై పారిన సారా, మద్యం

మహిళలపై అఘాయిత్యాలు.. దారి దోపీడీలు

యథేచ్ఛగా గంజాయి రవాణా

సంచలనంగా మారిన రుణయాప్‌లు

పేకాట కేసుల సంఖ్య లెక్కలేదు

తూర్పున 2022 ఏం మిగిల్చిందంటే.. అశాంతి.. అభద్రత.. ప్రజలకు శాంతి లేదు.. రోడ్డుపై వెళ్లే వారికి భద్రత లేదు.. మహిళలకు రక్షణ లేదు.. మూడు హత్యలు.. ఆరు ప్రమాదాలు.. పోలీస్‌ స్టేషన్లలో నమోదు చేసిన కేసులే 10 వేలు దాటేశాయి.. సారా ఏరులై పారింది.. ఏకంగా 2801 కేసులు నమోదయ్యాయి.. సందట్లో సడేమియా అన్నట్టు అక్రమ మద్యమూ హల్‌చల్‌ చేసింది.. మత్తులో జనం ఊగారు.. తూగారు.. దారుణాలకు తెగబడ్డారు. గంజాయి రవాణా యథేచ్ఛగా సాగిపోయింది. 84 కేసులు నమోదు చేసి 244 మందిని అరెస్టు చేశారు. 8,163 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.. ఇక అధ్వాన రహదారుల కారణంగా ప్రజలు అధికంగా ప్రమాదాల బారిన పడ్డారు. గతేడాది 768 రోడ్డు ప్రమాదాలు జరగ్గా ఈ ఏడాది నవంబరు నాటికే 821 ప్రమాదాలు జరిగాయి... ఇక హత్యలు 25 జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలా 2022లో శాంతి లేదు.. భద్రత అంతకంటే లేదు..మరికొన్ని గంటల్లో 2023లో అడుగుపెట్టబోతున్నాం.. దీనిలో భాగంగా గతేడాది మిగిల్చిన విషాదం.. మీ కోసం..

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి/రాజమహేంద్రవరం సిటీ)

రహదారులు రక్తసిక్తమయ్యాయి.. రోడ్డు అధ్వానంగా ఉండడంతో ప్రమాదాలు ఎక్కువ జరిగాయి. గతేడాది 293 మంది మృతిచెందగా ఈ ఏడాది 295 మంది మృతిచెందారు. ప్రమాదాల్లో గాయపడినవారు,వికలాంగులైన వారు ఉన్నారు.జిల్లాలో నేరాలు ఎక్కువ జరిగాయి. హత్యలు, దోపీడీలు గతేడాది కంటే కాస్త తగ్గినట్టు ఉన్నా.. రౌడీయిజం,బ్లేడ్‌ బ్యాచ్‌లు,దారిదోపిడీలు పెరిగాయి. సెల్‌ఫోన్‌ దొం గలు పెరిగారు. గంజాయి రవాణా కూడా ఎక్కువైంది. పోలీసు, ఎస్‌ ఈబీ అధికారులు ఇచ్చిన రికార్డు పరంగా చూసినా గతం కంటే ఎక్కువ కేసు లు నమోదయ్యాయి. పిల్లలు, మహిళల మీద దాడులు పెరిగాయి.పోలీసులు నమోదు చేసిన కేసులు అధికంగానే ఉన్నా యి. పలు కేసుల్లో కోర్టులు అధికంగానే శిక్షలు విధించారు.

10,377 కేసులు నమోదు

ప్రఽథమ సమాచార నమోదు(ఎఫ్‌ఐఆర్‌)లో 2022లో మొత్తం 9,680 కేసులు నమోదయ్యాయి.డయల్‌ 100 ద్వారా 11106 ఫిర్యాదులు స్వీకరించారు. 285 ఫిర్యాదులపై ఎఫ్‌ఐ ఆర్‌లు నమోదు చేశారు. 74 పెట్టీ కేసులు.మిగిలిన 10,747 ఫిర్యాదులను వివిధ రూపాల్లో పరిష్కరించారు.వాట్సప్‌ హెల్ప్‌లైన్‌ నెంబరు 94907 60794కు జిల్లా వ్యాప్తంగా 119 ఫిర్యాదులు వచ్చాయి. 26 ఫిర్యాదులుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మిగిలిన 93 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారు. దిశ పోలీస్‌ స్టేషన్‌లో 1740 ఫిర్యాదులు స్వీకరించారు. 332 ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 1342 ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. దిశ యాప్‌ ద్వారా 671 ఫిర్యాదులు అందగా 54 ఫిర్యాదులపై ఎప్‌ఐ ఆర్‌లు నమోదయ్యాయి.669 కేసులను పరిష్కరించారు.ప్రజలతో 10,87,440 దిశయాప్‌ రిజిస్ర్టేషన్లు చేయించారు.

గంజాయి జోరు

ఈ ఏడాది గంజాయి జోరు పెరిగింది. గతేడాది 48 కేసులు నమోదు చేసి 149మందిని అరెస్ట్‌ చేసి 5857.562 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 38 వాహనాలు సీజ్‌ చేశారు. వాటి విలువ రూ.2,92,87,810. ఈ ఏడాది 84 కేసులు నమోదు చేసి 244 మందిని అరెస్ట్‌ చేశారు. 8163.502 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని 56 వాహనాలు సీజ్‌చేశారు.

హత్యలు 25

హత్య కేసులు తగ్గుముఖం పట్టాయి. 2021లో 39 హత్యలు జరగ్గా.. ఈ ఏడాది 25 హత్యలు జరిగాయి.2021లో మొత్తం 1142 దొంగతనాల కేసులు నమోదు కాగా ఈ ఏడాది 953 కేసులు నమోదయ్యాయి. వాటిలో 432 కేసులను చేధించారు. 521 కేసులు ఎటూ తేలలేదు. మొత్తం నమోదైన కేసులకు సంబంధించి రూ.6.70 కోట్లు చోరీ కాగా రూ.2.85 కోట్లు రికవరీ చేశారు. మహిళలపై జరిగిన నేరాల కింద 1035 కేసులు నమోదయ్యాయి. ఫోక్సో, మహిళలకు సంబంధించిన కేసుల్లో ఈఏడాది నలుగురికి శిక్ష పడింది. గత పదేళ్లతో పోలిస్తే శిక్షలు పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఫోక్సో చట్టం కింద రెండు రాజమహేంద్రవరం పరిధిలో, ఒకటి ధవళేశ్వరం, మరొకటి కొవ్వూరు టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శిక్షలు పడ్డాయి.హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, ఇతర కేసుల్లో 23 మందికి శిక్ష పడింది. మరో 1852 కేసుల్లోనూ సాధారణ శిక్షలు పడ్డాయి.లోక్‌ అదాలత్‌ పరిధిలో 22,236 కేసులు పరిష్కరించారు. 119 ఎస్సీ ఎస్టీ కేసులు నమోదయ్యాయి. రూ.95.20 లక్షలు పరిహారంగా ఇచ్చారు.

రహదారుణాలు..

రోడ్లు రక్తసిక్తమయ్యాయి. గత రెండేళ్ల కంటే ప్రమాదా లు పెరిగాయి. వైసీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా రోడ్ల నిర్మాణాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. పెద్ద పెద్ద గోతులతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయా ణికుల్లో చైతన్యం,అవగాహన పెరిగినా..రోడ్లు అధ్వా నం గా ఉండడం వల్ల ఎక్కువ ప్రమాదాలు నమోదవుతున్నాయి.సారా,మద్యం విచ్చలవిడిగా లభ్యమవుతుండడం కూడా ప్రమాదాలకు మరింత తావిస్తుందని చెప్పవచ్చు. 2020లోజిల్లాలో 690 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 2021లో 768 ప్రమాదాలు జరిగాయి.ఇక ఈ ఏడాది అంటే 2022 లో నవంబరు నెల వరకూ 821 ప్రమాదా లు నమో దయ్యాయి.మానవ తప్పిదాల వల్ల జరిగిన ప్రమాదాలు తక్కువే.రోడ్లు అధ్వానంగా ఉండడం వల్లే చాలా ప్రమా దాలు జరిగాయి.వాహనాలు దెబ్బతిన్నాయి. డ్రైవర్‌ నిద్ర మత్తు కారణంగా జగ్గంపేటలో జరిగిన ప్రమాదంలో నల్లజర్ల, ఉండ్రాజవరం మండలాలకు చెందిన ముగ్గు రు మృతిచెందారు.2020లో 690 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 685 మంది గాయాలపాయ్యారు.231 మంది మృతి చెందారు.2021లో 768 మందిరోడ్డు ప్రమాదాలు జరగ్గా 802 మందికి గాయాలయ్యాయి. 293 మంది మృతి చెందారు.2022లో 821 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 901 మందికి గాయాలయ్యాయి.295 మంది మృతి చెందారు.

రుణయాప్‌ల కేసు ఏమైంది..

రుణయాప్‌ల వేధింపుల కారణంగా జిల్లాలో పలువురు మృతిచెందారు.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. కడియంకు చెందిన యువకుడు..అలాగే రాజమహేంద్రవరానికి చెందిన దంపతులు యాప్‌లలో రుణాలు తీసుకుని కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దంపతుల మృతితో రుణయాప్‌ల తీగ లాగితే డొంక కదిలింది.. అయితే ఎటూ తేల్చకుండానే కేసు వదిలేశారు.

ఏరులై పారిన సారా..

సారా ఏరులై పారింది. పోలీసులు 301 కేసులు నమోదు చేసి 482 మందిని అరెస్ట్‌ చేశారు. 4433 లీటర్ల సారా, 64 వాహనాలు సీజ్‌ చేసి, 19,850 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. ఎస్‌ఈబీ ఆధ్వర్యంలో 2,506 అక్రమ సారాయి కేసులు నమోదు చేసి 2,655 మందిని అరెస్ట్‌ చేసి 52,006 లీటర్ల సారా, 164 వాహనాలు సీజ్‌ చేశారు. 24,051 కేజీల నల్లబెల్లం సీజ్‌చేసి 6,47,400 లీటర్ల బెల్లపు ఊట ధ్వం సం చేశారు. పోలీసులు 61 అక్రమ మద్యం కేసులు నమోదు చేసి 78 మందిని అరెస్ట్‌ చేశారు. 377.59 లీరట్ల మద్యం, 5 వాహనాలు సీజ్‌ చేశారు. ఎస్‌ఈబీ ఆధ్వర్యంలో 30 అక్రమ మద్యం కేసులు నమోదు చేసి, 37 మందిని అరెస్ట్‌ చేసి 197 లీటర్ల మద్యం, 3 వాహనాలు సీజ్‌ చేశారు.

2.6 లక్షల ఈ చలానా కేసులు..

రోడ్డు ప్రమాదాల నివారణకు ఎంవీ యాక్ట్‌ కింద 2,60, 185 ఈ ఛలానా కేసులు నమోదు చేసి రూ. 7,52 కోట్లు అపరాధ రుసుం వసూలు చేశారు.1387 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు, 84,567 ట్రిపిల్‌ రైడింగ్‌ కేసులు 2,250 డేంజరస్‌ డ్రైవింగ్‌ కేసులు, 3,305 మొబైల్‌ ఫోన్‌ డ్రైవింగ్‌ కేసులు, 42, 672 డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని కేసులు,21,321 పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న కేసులు నమోదు చేశారు.

పోలీస్‌ బాస్‌ లేరు..

గత ఆగస్టు నుంచి జిల్లాకు పోలీస్‌ బాస్‌ లేరు. ఎస్పీ ఐశ్వర్య రస్తోగి బదిలీపై వెళ్లిన తరువాత జిల్లాకు ఎవరినీ నియమించలేదు. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా ఎస్పీ ఇన్‌చార్జిగా ఉన్నారు. దీంతో జిల్లాలో శాంతి భద్రతలు కట్టుతప్పాయి. హోం మంత్రి పక్క నియోజకవర్గమైనా నేటికీ పోలీస్‌ బాస్‌ నియామకం జరగకపోవడం విశేషం.

హత్యలు తగ్గాయ్‌..

గతంతో పోల్చుకుంటే ఈ సారి హత్యలు, ఇతర నేరాలు తగ్గాయని ఇన్‌చార్జి ఎస్పీ పి.సుధీర్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. రౌడీలు, బ్లేడ్‌ బ్యాచ్‌ల పట్ల కఠినంగా వ్యవహరించామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని సహించేదది లేదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

- సుధీర్‌కుమార్‌రెడ్డి, ఇన్‌చార్జి ఎస్పీ

Updated Date - 2022-12-31T01:04:28+05:30 IST

Read more