కొబ్బరి రైతు విలవిల

ABN , First Publish Date - 2022-07-01T06:31:24+05:30 IST

కొబ్బరి ఉత్పత్తులకు కొన్ని నెలలుగా తగిన ధర లభించక రైతులు విలవిల్లాడిపోతున్నారు. ప్రభుత్వం నాఫెడ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు ఉత్పత్తి చేసే కొబ్బరి సరుకును కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అధికారులు ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఆచరణ సాధ్యం కావట్లేదు.

కొబ్బరి రైతు విలవిల

  • మందగమనంలో కొబ్బరి మార్కెట్‌
  • రవాణాపై డీజిల్‌ రేట్‌ ఎఫెక్ట్‌
  • ఇతర రాషా్ట్రలకు నిలిచిన ఎగుమతులు
  • స్థిరంగా ధరలు
  • దింపు ఖర్చులు కూడా రావట్లేదంటున్న రైతులు
  • నాఫెడ్‌ కేంద్రాలు ప్రారంభించేదెప్పుడో..!

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

కొబ్బరి ఉత్పత్తులకు కొన్ని నెలలుగా తగిన ధర లభించక రైతులు విలవిల్లాడిపోతున్నారు. ప్రభుత్వం నాఫెడ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు ఉత్పత్తి చేసే కొబ్బరి సరుకును కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అధికారులు ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఆచరణ సాధ్యం కావట్లేదు. వాస్తవానికి జూలై ఒకటి నుంచి కోనసీమ జిల్లాలో నాఫెడ్‌ కేంద్రాలను ఏర్పాటుచేసి ఆర్థిక సంక్షోభంలో ఉన్న కొబ్బరి రైతులను ఆదుకుంటామని అధికారులు చేసిన ప్రకటన అమలు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో నాఫెడ్‌ కేంద్రాల ఏర్పాట్లలో జరుగుతున్న జాప్యం కొబ్బరి రైతులను మరింత కుంగదీసింది. ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో వివాహాది శుభ కార్యక్రమాలు, పండుగలు లేకపోవడంతో కొబ్బరికి డిమాండు తగ్గుతుంది. దీనికితోడు పెరుగుతున్న డీజిల్‌ ధరలు రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 

ముఖ్యంగా గోదావరి జిల్లాల నుంచి ఇతర రాషా్ట్రలకు ఎగుమతి అయ్యే కొబ్బరి ఉత్పత్తుల రవాణాపై డీజిల్‌ రేటు పెరుగుదల తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇతర రాషా్ట్రలకు కొబ్బరి ఎగుమతులు నిలిచిపోతున్నాయి. సగటున ఒక కొబ్బరి బస్తాపై ప్రస్తుత పెరిగిన రేట్ల ప్రకారం రూ.20 నుంచి రూ.30 మేర అదనపు పెరుగుదల కొబ్బరి ఎగుమతిదారులకు తీవ్ర కష్టాల్ని, నష్టాల్ని తెచ్చిపెడుతోంది. ఫలితంగా కోనసీమ జిల్లా సహా ఇతర ప్రాంతాల నుంచి దేశంలోని వివిధ రాషా్ట్రలకు కొబ్బరి బస్తాల ఎగుమతులు మందకొడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కొబ్బరి ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతుల్లో శూన్యత చోటుచేసుకుంది. తత్ఫలితంగా కొబ్బరి ధరల్లో మార్పులు చోటుచేసుకోకపోవడంతో రానున్న రోజుల్లో మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని నాఫెడ్‌ సంస్థ రైతుల నుంచి కొబ్బరి సరుకును కొనుగోలు చేయడానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించి జూలై 1 నుంచి ప్రారంభిస్తామని చేసిన వాగ్ధానం ఇంకా అమలుకు నోచుకోలేదు. దేశంలో కేరళ, తమిళనాడు తర్వాత ఆ స్థాయిలో ఏపీలోనే కొబ్బరి ఉత్పత్తులు గణనీయంగా ఉంటాయి. ఈసారి  ఈ మూడు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, చత్తీస్‌గడ్‌ వంటి రాష్ట్రాల్లో కూడా కొబ్బరికాయల ఉత్పత్తి గణనీయంగా పెరగడం వల్ల ఎగుమతులు ఇప్పటికే మందగమనంగా ఉన్నాయి. కాగా ఉమ్మడి జిల్లాల్లో లక్షా 25 వేల హెక్టార్లలో కొబ్బరి పంట సాగవుతోంది. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి దిగుబడులు గణనీయంగా పెరగడంతో గత కొన్ని నెలలుగా మార్కెట్‌ ధరలు మందకొడిగా ఉన్నాయి. గోదావరి జిల్లాల నుంచి నిత్యం 150కు పైగా లారీలు ఇతర రాషా్ట్రలకు ఎగుమతి అవుతుండేవి. అయితే డీజిల్‌ రేట్ల పెరుగుదల వల్ల కొబ్బరి బస్తాపై సగటున రూ.20 నుంచి రూ.30 కిరాయి పెరగడంతో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ, మధ్యప్రదేశ వంటి రాషా్ట్రలకు ఎగుమతులు స్తంభించాయి. ఈ కారణంగా కొన్ని రోజులుగా ధరల పెరుగుదలలో శూన్యత చోటు చేసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన  మద్దతు ధరకు కొబ్బరిని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. అయితే ఐదు నెలలుగా కొబ్బరి ధరల్లో పెద్దగా మార్పులు లేవు. కాగా ప్రస్తుతం వెయ్యి పచ్చికొబ్బరికాయల ధర రూ.8 వేల నుంచి రూ.8,500 పలుకుతోంది. పాత ముక్కుడుకాయ రూ.8 వేల నుంచి రూ.8,200 ఉంది కొత్త కొబ్బరి క్వింటాలు రూ.9 వేలు, కొత్త కొబ్బరి (రెండో రకం) రూ.8 వేలు, కురిడీ కొబ్బరి (పాత రకం) గండేరా వెయ్యింటికి రూ.13,500, గటగట వెయ్యింటికి రూ.11,500 ధర పలుకుతోంది. కురిడీ కొబ్బరి (కొత్త రకం) గండేరా వెయ్యింటికి రూ.12,500, గటగట వెయ్యింటికి రూ.11 వేలు ఉంది. ప్రస్తుతం ఎగుమతులు స్వల్పంగానే ఉన్నాయి. గోదావరి జిల్లాల్లో కొబ్బరికాయలకు తెగుళ్లు సోకడం, ఆశించిన మేర సరుకు దిగుబడి రాకపోవడం, రవాణా చార్జీలు పెరగడం వంటి కారణాలతో ఇప్పటి వరకు ఎగుమతులు లేక స్థానికంగానే వీటిని విక్రయించుకోవాల్సి వచ్చింది. అయితే కొబ్బరి మార్కెట్‌ మందగమనంగా ఉండడంతో ధరలు పుంజుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం గోదావరి జిల్లాల్లో నాఫెడ్‌ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుని నష్టపోతున్న కొబ్బరి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. కనీసం దింపు ఖర్చులు రాకపోవడంతో నెలసరి దింపులు తీసేందుకు కూడా రైతులు ఉత్సాహం చూపడం లేదు. గత కొన్ని నెలలుగా దీన స్థితిలో ఉన్న కొబ్బరి మార్కెట్‌ను పుంజుకునేలా చేసేందుకు ప్రభుత్వం నాఫెడ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడమే శరణ్యమని రైతులు చెప్తున్నారు. దీనిపై నాఫెడ్‌ సీనియర్‌ మేనేజర్‌ యు.సుధాకరరావును వివరణ కోరగా.... కోనసీమ జిల్లాలో ఐదుచోట్ల జూలై మొదటి వారం నుంచి నాఫెడ్‌ కేంద్రాల ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.  

Updated Date - 2022-07-01T06:31:24+05:30 IST