వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ABN , First Publish Date - 2022-08-12T06:15:47+05:30 IST

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంకలో రవినేష్‌కుమార్‌ నేతృత్వంలోని కేంద్ర బృందం గురువారం పర్యటించింది.

వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
దెబ్బతిన్న పంటను పరిశీలిస్తున్న బృందం సభ్యులు

పి.గన్నవరం, ఆగస్టు 11: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంకలో రవినేష్‌కుమార్‌ నేతృత్వంలోని కేంద్ర బృందం గురువారం పర్యటించింది. ఆయనతో పాటు సభ్యులు కె.మనోహర్‌, షర్వన్‌కుమార్‌సింగ్‌, పి.దేవేందర్‌రావు, ఎం.మురగనాథమ్‌, అరవిందకుమార్‌సోనీ తదితరులు గత నెలలో వరదలకు పాడైన గృహలతో పాటు ముంపు బారిన పడిన పంట పొలాలను స్వయంగా చూసి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. టీం లీడర్‌ రవినేష్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నష్టాల అంచనా నివేదికను పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయిలో నష్టాలను స్వయంగా పరిశీలించామని, నివేదిక రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి అందిస్తామన్నారు. తొలుత నాగుల్లంక శివారు పెదకందాలపాలెంలో కలెక్టర్‌ హిమాన్షుశుక్లా, జేసీ హెచ్‌ఎం ధ్యానచంద్రలతో కలిసి కేంద్ర బృంద సభ్యులు మట్టిరోడ్డులో కాలినడకన నడిచి నష్టాలను పరిశీలించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్టర్‌లో గుడ్డాయిలంక చేరుకున్నారు. కోనసీమ చాలా అందమైన ప్రాంతమని, వరదల సమయంలో గ్రామాల్లోకి నీరు వచ్చేస్తుందని కలెక్టర్‌ చెబుతూ నివాసగృహాలు, పంట పొలాలకు జరిగిన నష్టాలను, స్థానికుల ఇబ్బందులను బృందానికి వివరించారు. ఇక్కడ ముంపు బారిన పడిన నారుమడులను పరిశీలించి పెట్టుబడి రాయితీ ఎంతవస్తుందని రైతు తాడి అబ్బులను అడిగారు. ఈ సమయంలో వ్యవసాయ శాఖ జేడీ వై.ఆనందకుమారి జిల్లాలో వరికి జరిగిన నష్టాలను వివరించి వరదల్లో నష్టపోయిన పంటలకు 80శాతం రాయితీపై విత్తనాలు అందించినట్టు బృందానికి వివరించారు. అనంతరం ట్రాక్టర్లో పల్లిపాలెం చేరుకుని ముంపు బారిన పడిన అరటి తోటను పరిశీలించి అరటి, తమలపాకు, కూరగాయల రైతులతో నేరుగా మాట్లాడారు. కాగా ప్రభుత్వం అందిస్తున్న నష్టపరిహారం ఏమాత్రం సరిపోవట్లేదని బృందం ఎదుట రైతులు పెదవి విరిచారు. కొన్ని సంవత్సరాలుగా తమలపాకు తోటలకు రూ.30వేలు, అరటికి రు.10వేలు, కూరగాయల పంటలకు రూ.6వేలుమాత్రమే నష్టపరిహారంగా ఇస్తున్నారని రైతులు నాగులపల్లి శ్రీను, చిట్టినీడి వెంకటేశ్వరరావు, అడ్డాల ఆదినారాయణ వివరించారు. ఎరువులు ధరలు రెట్టింపయ్యాయన్నారు. అరటికి ఎకరాకు రూ.50వేలు పెట్టుబడి అయితే తమలపాకుకు రూ.5 లక్షలు ఖర్చు అవుతోందన్నారు. ప్రభుత్వ పరిహారం తోటలను బాగు చేసుకోవడానికి కూడా సరిపోవని, పరిహారం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. అనంతరం నీట మునుగుతున్న పామాయిల్‌ తోటలను కేంద్ర బృందం పరిశీలించింది. అయితే భాషా ఇబ్బందులతో రైతులు చెప్పిన ప్రతి విషయాన్ని కలెక్టర్‌ బృందానికి వివరించేవారు. పర్యటనలో ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి, ఆర్డీవో ఎం.ముక్కంటి, వ్యవసాయ శాఖ జేడీ వై.ఆనందకుమారి, ఉద్యానవన శాఖ జేడీ ఎన్‌.మల్లికార్జునరావు, గృహ నిర్మాణ సంస్థ పీడీ వై.శ్రీనివాస్‌, తహశీల్దార్లు జీఆర్‌ ఠాగూర్‌, జె.వెంకటేశ్వరి, ఎంపీడీవో కేఆర్‌ విజయ, సర్పంచ్‌ యల్లమిల్లి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-12T06:15:47+05:30 IST