లారీని ఢీకొన్న కారు

ABN , First Publish Date - 2022-07-05T06:40:39+05:30 IST

కాకినాడ జిల్లా వాకలపూడి బీచ్‌రోడ్డు లో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.

లారీని ఢీకొన్న కారు

ఇద్దరు యువకుల మృతి
సర్పవరం జంక్షన్‌, జూలె ౖ4: కాకినాడ జిల్లా వాకలపూడి బీచ్‌రోడ్డు లో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ప్రమాదం రాత్రి జరగడంతో బీచ్‌రోడ్డులో ట్రాఫిక్‌ రెండు గంటలసేపు స్తంభించిపోయింది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మట్టపర్తి సంజీవ్‌ (28) వ్యాపారం నిమిత్తం కాకినాడ విద్యుత్తునగర్‌లో నివాసం ఉంటున్నాడు. కాకినాడ రూరల్‌ రమణయ్యపేట ఈశ్వర్‌నగర్‌కు చెందిన బీర తరుణ్‌(25)తో కలిసి వస్త్ర వ్యాపారం చేస్తుంటారు. వారు స్నేహితులు కూర్మపు సతీష్‌, కజ్జవరపు సాయి సందీప్‌లతో కలసి సరదాగా కారులో సోమవారం సాయంత్రం బీచ్‌కెళ్లారు. రాత్రి 7 గంటల సమయంలో స్థానిక కుంభాభిషేకం నుంచి బీచ్‌రోడ్డు మీదుగా వాకలపూడి లైట్‌హౌస్‌ వైపు కారులో వెళ్తున్న సమయంలో కారు కోరమండల్‌ ఎరువుల కర్మాగారం దాటిన రెండు కిలోమీటర్ల తర్వాత ఉప్పుటేరు వంతెన సమీపంలోకి వచ్చేసరికి ఇదే రూటులో ముందు వెళ్తున్న లోడ్‌లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో కారు లారీ వెనుకభాగంలోకి చొచ్చుకెళ్లిపోయింది. ఈ ఘటనతో కారు ముందు భాగాన ఉన్న మట్టపర్తి సంజీవ్‌, బీర తరుణ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న క్షతగాత్రులు, మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయాణికులు శ్రమించారు. కారు వెనుక సీట్లో కూర్చున్న సతీష్‌, సాయిసందీప్‌ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను సిటీలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సర్పవరం సీఐ ఆకుల మురళీకృష్ణ హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి పోస్ట్‌మార్టం కోసం జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. లారీ ముందు వెళ్తున్న ఆటోడ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో లారీ డ్రైవర్‌ బ్రేక్‌ వేయగా వెనకాలే వస్తున్న కారును అదుపు చేయలేక లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. 

Read more