సంక్షేమ చట్టం పరిరక్షణకు పోరాడదాం

ABN , First Publish Date - 2022-11-28T01:00:05+05:30 IST

భవన నిర్మాణ కార్మిక సంక్షేమచట్టం - 1996 పరిరక్షణ కు భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు పిలుపునిచ్చారు.

సంక్షేమ చట్టం పరిరక్షణకు పోరాడదాం
సమావేశంలో మాట్లాడుతున్న ఓబులేసు

రాజమహేంద్రవరం అర్బన్‌, నవంబరు 27 : భవన నిర్మాణ కార్మిక సంక్షేమచట్టం - 1996 పరిరక్షణ కు భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం రివర్‌బే హోటల్‌లో జరుగుతున్న అఖిలభారత భవన నిర్మాణ కార్మిక సంఘం జాతీయ మహాసభలో భాగంగా రెండో రోజైన ఆదివారం ఆయన మాట్లాడారు. దేశంలో ఏడు కోట్ల మందికి పైగా నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారన్నారు. వారి సంక్షేమం కోసం అప్పటి కేంద్ర ప్రభుత్వం 1996లో పార్లమెంటులో చట్టం చేసిందని, ఈ చట్టానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలలో సంక్షేమబోర్డులు ఏర్పాటు చేసి కార్మికులకు సంక్షేమం, సౌకర్యాలు కల్పిస్తూ వచ్చారన్నారు. మోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత సంక్షేమ చట్టానికి తూట్లు పొడుస్తూ రూ.29 వేల కోట్లు కుంభకోణం చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని కాగ్‌ నివేదికలో వెల్లడించడం జరిగిందని, సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధిరాలేదని ఆయన విమర్శించారు. భవన యజమానుల నుంచి వసూలు చేసే ఒక శాతం సెస్‌ సుమారు రూ.80 వేల కోట్లు ఉండగా అందులో రూ.28 వేల కోట్లకు పైగా నిధులు దుర్వినియోగ మయ్యాయని కాగ్‌ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారన్నారు. నాలుగు లేబర్‌ కోడ్‌లు తీసుకొచ్చారని, సోషల్‌ సెక్యూరిటీ కోడ్‌లో 1996 యాక్టును కలిపేయడం వల్ల నిర్మాణ కార్మికులకు తీవ్ర నష్టం వాటిలిందని విమర్శించారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్‌ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక కొరతను సృష్టించి నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా చేశారన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి ఎస్‌.వెంకట సుబ్బయ్య, ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి వహీదా ప్రవీణ్‌, సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కె.రవి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బీవీవీ కొండలరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పడాల రమణ, సత్యనారాయణ, జట్ల సంఘం అధ్యక్షుడు కె.రాంబాబు, సీపీఐ నగర కార్యదర్శి కొండలరావు, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.సోమ సుందర్‌, జాతీయ అధ్యక్షుడు విజయన్‌, శంకర్‌ పూజారి, వివిధ ప్రాంతాల భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

పతంజలి మందులు, ఉత్పత్తులు వాడొద్దు

బాబా రాందేవ్‌ ఇటీవల ఒక సమావేశంలో మహిళలపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనకు సంబంధించిన పతంజలి మందులు, ఉత్పత్తులను భవన నిర్మాణ కార్మికులు వాడొద్దని పిలుపునిచ్చారు. డిసెంబరులో కేరళలో జరిగే ఏఐటీయూసీ జాతీయ మహాసభల్లో కూడా పతంజలి ఉత్పత్తులు, మందుల వినియోగంపై బహిష్కరణ తీర్మానం చేయడం జరుగుతుందన్నారు.స్త్రీలను అవమాన పరిచేలా మాట్లాడిన బాబా రాందేవ్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఆందోళనా కార్యక్రమాలు చేపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే బాబా రాందేవ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-11-28T01:00:07+05:30 IST