బోగస్‌ విద్యార్హతలతో ఉద్యోగాలు పొందేవారికి గుణపాఠం చెప్పాలి

ABN , First Publish Date - 2022-12-31T01:27:53+05:30 IST

భోగస్‌ విద్యార్హతలతో ఉద్యోగాలను పొందాలనుకునే వారికి గుణపాఠం చెప్పి తీరాల్సిందేనని, ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఇలాంటి వారిలో భయాన్ని కలిగించాలని ఎ.పి.లోకాయుక్త అభిప్రాయపడింది.

బోగస్‌ విద్యార్హతలతో   ఉద్యోగాలు పొందేవారికి గుణపాఠం చెప్పాలి

ఇద్దరు ఉపాధ్యాయుల తొలగింపును సమర్థించిన లోకాయుక్త

రంపచోడవరం, డిసెంబరు 30: భోగస్‌ విద్యార్హతలతో ఉద్యోగాలను పొందాలనుకునే వారికి గుణపాఠం చెప్పి తీరాల్సిందేనని, ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఇలాంటి వారిలో భయాన్ని కలిగించాలని ఎ.పి.లోకాయుక్త అభిప్రాయపడింది. ప్రస్తుత అల్లూరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని ఇద్దరు ఉపాధ్యాయులు భోగస్‌ టీటీసీ ధ్రువీకరణలతో ప్రభుత్వాన్ని మోసగించి ఉద్యోగాలను వెలగబెడుతున్న వారిపై వచ్చిన ఫిర్యాదును లోకాయుక్త విచారించింది. శుక్రవారం ఈ విషయంలో లోకాయుక్త తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయంలో గిరిజన సంక్షేమశాఖ ఇప్పటికే సదరు ఇద్దరిని ఉద్యోగాల నుంచి పూర్తిగా తొలగించడమే కాకుండా వారు తీసుకున్న జీత భత్యాలను తిరిగి వసూలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని లోకాయుక్త సమర్థించి ఈ చర్యలపై విస్తృత ప్రచారం జరిగి ఇటువంటి అడ్డదారిని ఎంచుకోవడానికే భయపడేలా ఉండాలని అభిప్రాయపడింది. దీని పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. అడ్డతీగల మండలం డి.భీమవరం స్కూల్‌ కాంప్లెక్సు పరిధిలోని సిహెచ్‌.జె.ఎస్‌.గీతార్థి, కె.సూర్యారావు అనే సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు పాల్పడిన భోగస్‌ టీటీసీ ధ్రువీకరణలతో ఉద్యోగాలను పొందిన వ్యవహారం నేపఽథ్యంలో ఇటువంటి భాగోతాలపై అడ్డతీగలకు చెందిన డి.వీరబాబు లోకయుక్తను ఆశ్రయించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపిన లోకాయుక్త ప్రభుత్వం తీసుకున్న చర్యలపై గిరిజన సంక్షేమ డైరెక్టరు ద్వారా నివేదికను రప్పించుకుంది. అప్పటికే సమగ్ర విచారణ అనంతరం తొలుత సస్పెండ్‌ చేసిన సదరు ఉపాధ్యాయులిద్దరినీ ఉద్యోగాలను నుంచి తొలగిస్తూ అక్టోబరు నెలలోనే చర్యలను తీసుకున్న విషయాన్ని లోకాయుక్తకు ప్రభుత్వం స్పష్టం చేసింది. అందే కాకుండా ఇంతవరకూ వారు ప్రభుత్వం నుంచి తీసుకున్న జీత, భత్యాలను కూడా రాబట్టాలన్న నిర్ణయం మేరకు ఆయా ఉపాధ్యాయులిద్దరి తాఖీదులను కూడా జారీ చేసింది.

Updated Date - 2022-12-31T01:27:55+05:30 IST