యాచకుడి సొమ్ము ‘రెడ్‌క్రాస్’కు అందజేత
ABN , First Publish Date - 2022-08-04T07:12:11+05:30 IST
కలెక్టర్ ఆదేశాల మేరకు యాచకుడి వద్ద దొరికిన సొమ్మును రెడ్‌క్రాస్ సంస్ధకు అందజేసినట్టు తహశీల్దార్ పొన్నమండ శ్రీనివాసరావు తెలిపారు. కరప మండలం వేళంగిలో భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్న ఒక యాచకుడు జూన్ 2న అకస్మాత్తుగా మృతి చెందాడు.
- కలెక్టర్ ఆదేశాలతో రూ.3,39,630 అందించిన అధికారులు
కరప, ఆగస్టు 3: కలెక్టర్ ఆదేశాల మేరకు యాచకుడి వద్ద దొరికిన సొమ్మును రెడ్‌క్రాస్ సంస్ధకు అందజేసినట్టు తహశీల్దార్ పొన్నమండ శ్రీనివాసరావు తెలిపారు. కరప మండలం వేళంగిలో భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్న ఒక యాచకుడు జూన్ 2న అకస్మాత్తుగా మృతి చెందాడు. అతడు ఉంటున్న రేకుల షెడ్డులోని పిండి సంచుల్లో పెద్ద మొత్తంలో నగదును గుర్తించిన పోలీసులు అధికారుల సమక్షంలో లెక్కించగా రూ.3,39,630గా తేలింది. ఈ విషయం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆ సొమ్మును రెండు ట్రంకు పెట్టెల్లో ఉంచి సీళ్లు వేసి పోలీసుల కస్టడీలో భద్రపరిచారు. ఆ సొమ్ము అంతటినీ రెడ్‌క్రాస్ సొసైటీకి అందజేయాలని ఐదురోజులక్రితం కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కరప ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మిసత్తిబాబు, జడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు సమక్షంలో తహశీల్దార్ శ్రీనివాసరావు, ఏఎస్ఐ ప్రసన్నకుమార్ రెడ్‌క్రాస్ కాకినాడ బ్రాంచ్ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ జీవీ కామేశ్వరరావుకు ఆ సొమ్మును బుధవారం అందజేశారు. ఈ సొమ్మును బ్యాంక్‌లో జమచేసి పేదలకు, సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని కామేశ్వరరావు తెలిపారు. ఆర్ఐ పేపకాయల మాచరరావు, శ్యామ్, రైటర్ రాజారావు పాల్గొన్నారు.