రాజకీయ దిగ్గజం మూలారెడ్డి ఇకలేరు

ABN , First Publish Date - 2022-08-02T06:07:03+05:30 IST

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి (80) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలోని ఆయన స్వగృహంలో సోమవారం తుది శ్వాస విడిచారు.

రాజకీయ దిగ్గజం మూలారెడ్డి ఇకలేరు

 అనపర్తి, ఆగస్టు 1: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి (80) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలోని ఆయన స్వగృహంలో సోమవారం తుది శ్వాస విడిచారు. 52 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని రాజకీయ దురంధరుడిగా పేరు తెచ్చుకున్నారు. 1942 మే 8న తేదీన రామవరంలో నల్లమిల్లి సుబ్బిరెడ్డి, వీరయ్యమ్మ దంపతులకు ఆరో మగ సంతానంగా మూలారెడ్డి జన్మించారు. ఆయనకు భార్య సత్యవతి, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. చిన్ననాటి నుంచి నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్న మూలారెడ్డి కమ్యూనిస్టు భావజాలంతో కళలవైపు ఆకర్షితుడై నాటికల్లో నటించారు. 1968లో జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1970లో రామవరం సర్పంచ్‌గా ఎన్నికై 1983 వరకు రెండు పర్యాయాలు సర్పంచ్‌గా సేవలందించారు.  1982లో నందమూరి తారకరామారావు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీలో చేరిన మూలారెడ్డి 1983లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాటి నుంచి 2009 వరకు జరిగిన తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీచేసి 1983, 85, 94, 99 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో ఎక్కువ సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేయడమే కాకుండా నేటి వరకు టీడీపీలోనే కొనసాగుతూ మూలారెడ్డి కుటుంబం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 2014 ఎన్నికల్లో తన వారసుడిగా కుమారుడు రామకృష్ణారెడ్డిని బరిలో నింపి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన ఎక్కువ సమయం ఇంటికే పరిమితమయ్యారు. ఎన్టీఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత పేదలకు ఇళ్ల స్థలాలు అందించేందుకు స్థలాలు దొరకకపోవడంతో మూలారెడ్డికి వచ్చిన ఆలోచనను ఎన్టీఆర్‌కు వివరించారు. దేవదాయ శాఖ భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు ఎన్టీఆర్‌ ముందుకు వచ్చి మొట్టమొదటి సారిగా అనపర్తి మండలం రామవరంలో పేదలకు దేవస్థానం భూములను ఇళ్ల పట్టాలుగా ఇచ్చి రాష్ట్రంలోనే మొట్టమెదటి కాలనీని ఏర్పాటు చేసిన ఘనత మూలారెడ్డికే దక్కుతుంది. అలాగే దళిత విద్యార్థులకు విద్యనందించేందుకు రూపకల్పన చేసిన సాంఘిక సంక్షేమ వసతి గృహాల ఏర్పాటులో కూడా మూలారెడ్డి ప్రముఖ పాత్ర పోషించారు. అనపర్తి మండలం లక్ష్మీ నరసాపురంలో మొట్టమొదటి వసతి గృహాన్ని నిర్మించడమే కాకుండా ఎన్టీఆర్‌ని తీసుకువచ్చి ప్రారంభోత్సవం చేయించారు. అనపర్తి అభివృద్ధి ప్రదాతగా మూలారెడ్డి పేరు సంపాదించుకున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం సొంత సోదరులనే వదులుకుని సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. అనపర్తి నియోజకవర్గ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు.ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-08-02T06:07:03+05:30 IST