రానున్న ఎన్నికల్లో మాదిగ ఉపకులాల అభ్యర్థులకే ఓట్లు

ABN , First Publish Date - 2022-08-05T05:12:57+05:30 IST

షెడ్యూల్డ్‌ కులాల్లోని ఒక ప్రధాన సామాజికవర్గం వారే రాజకీయ పదవులు, అధికార హోదాలను అనుభవిస్తూ ఓసీ, బీసీ, ముస్లిం, మైనార్టీ వర్గాలపై వేధింపులకు పాల్పడుతున్న తీరును అన్ని సామాజికవర్గాల ప్రజలు గమనిస్తున్నారని వక్తలు తెలిపారు.

రానున్న ఎన్నికల్లో మాదిగ ఉపకులాల అభ్యర్థులకే ఓట్లు
వివిధ కుల సంఘాల సమావేశం

వివిధ కుల సంఘాల సమావేశంలో నిర్ణయాలు
అమలాపురం ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): షెడ్యూల్డ్‌ కులాల్లోని ఒక ప్రధాన సామాజికవర్గం వారే రాజకీయ పదవులు, అధికార హోదాలను అనుభవిస్తూ ఓసీ, బీసీ, ముస్లిం, మైనార్టీ వర్గాలపై వేధింపులకు పాల్పడుతున్న తీరును అన్ని సామాజికవర్గాల ప్రజలు గమనిస్తున్నారని వక్తలు తెలిపారు. రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయడంతో పాటు 2024 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో మాదిగ, వారి ఉపకులాల అభ్యర్థులను నిలిపి వారికి ఓటు వేయాలని నిర్ణయించారు. అమలాపురంలోని గ్రాండ్‌ పార్కులో గురువారం రాత్రి వరకు ఓసీ, బీసీ, ముస్లిం, మైనార్టీ నాయకుల కీలక సమావేశంలో ఆయా వర్గాలకు చెందిన నాయకులు ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా జిల్లాలో ఒకే సామాజికవర్గానికి చెందిన అధికారులను నియమించడం ద్వారా ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు మిగిలిన కులాలపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇందుకు అంబేడ్కర్‌ విగ్రహాల ధ్వంసం ఘటనలలో అక్రమ కేసులే నిదర్శనమని వారు పేర్కొన్నారు. ఉభయ రాష్ర్టాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్‌, ప్రముఖ న్యాయవాది కుడుపూడి సూర్యనారాయణరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ సామాజికవర్గాలకు చెందిన ప్రముఖులు, న్యాయవాదులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.  ఇటీవల జరిగిన అమలాపురం అల్లర్ల కేసులో అమాయకులపై కేసులు బనాయించారని, వారికి అన్నివిధాలా అండదండలు అందించనున్నట్లు నాయకులు తెలిపారు. కాపు సంఘం నేత సలాది రామకృష్ణ, పలువురు ప్రముఖులు మాట్లా డుతూ రావులపాలెం ఘటనలో ఎవరో ముద్రించిన ప్లేట్ల విషయంపై వివాదం సృష్టించిన వారే అల్లర్లు చేశారన్నారు. మళ్లీ వారు తక్షణమే విడుదలయ్యేలా రాజకీయ పార్టీల నాయకులు ప్రయత్నాలు చేశారన్నారు. ఎక్కడైనా ఇకపై ఏదైనా జరిగితే మిగిలిన సామాజికవర్గాలంతా సంఘటితంగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అనేక మంది ఆవేశపూరిత ప్రసంగాలు చేశారు. అనంతరం సమావేశం కొన్ని తీర్మానాలను ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసుల వ్యవహారంపై అన్ని కులాల వారు  సంఘటితంగా పోరాడకపోతే భవిష్యత్తులో అన్నికులాల వారికి ఇబ్బందులు తప్పవని సమావేశం హెచ్చరిస్తూ తీర్మానించింది. రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో మాదిగ ఉపకులాల వారికి టిక్కెట్లు ఇచ్చే రాజకీయ పార్టీలకే కోనసీమ జిల్లా ప్రజలు సహకరించాలని తీర్మానం చేశారు. పది లక్షల పైచిలుకు  ఓసీ,  బీసీ, ముస్లిం, మైనార్టీల ఓటర్లు ఉన్నారని, వారి సామాజికవర్గాలకు ప్రభుత్వాలు కనీస గౌరవాలు కూడా ఇవ్వని దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో ఓట్‌ ఫర్‌ కోనసీమ పేరిట అభ్యర్థులను నిలిపి వారికే అందరూ ఓట్లు వేసేలా కృషి చేయాలని సమావేశం తీర్మానించింది. అదే విధంగా 2023 నవంబరులో పది లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ తీర్మానాలను కుడుపూడి సూర్యనారాయణరావు, కాపు జేఏసీ నాయకుడు కల్వకొలను తాతాజీలు ప్రతిపాదించగా మిగిలిన నాయకులు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్‌ న్యాయవాదులు కూచిమంచి మల్లపరాజు, కొర్లపాటి గోపాలరావు, ఎండీ ఆజామ్‌, నాయకులు రంబాల సుభాష్‌చంద్రబోస్‌, వాసంశెట్టి కుమార్‌, డాక్టర్‌ కొమ్ముల ధన్వంతరీనాయుడు, సీహెచ్‌ చినరాయుడు, సానబోయిన రామారావు, డాక్టర్‌ ఈఆర్‌ సుబ్రహ్మణ్యం, వాసంశెట్టి సత్యం, సప్పా నాగేశ్వరరావు, పసుపులేటి శ్రీను, రుద్రరాజు రవిరాజు, అరిగెల బలరామమూర్తి, వంకాయల రాజా, బచ్చు ప్రభాకర్‌, కోటిపల్లి దామోదర్‌, గుత్తుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-05T05:12:57+05:30 IST