12న చిత్తూరులో ‘యువ ఉత్సవ్‌’ పోటీలు

ABN , First Publish Date - 2022-10-07T06:12:32+05:30 IST

ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 12న చిత్తూరులో జిల్లా స్థాయి ‘యువ ఉత్సవ్‌’ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఆర్వో రాజశేఖర్‌ తెలిపారు.

12న చిత్తూరులో ‘యువ ఉత్సవ్‌’ పోటీలు
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సభ్యులు

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 6: ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 12న చిత్తూరులో జిల్లా స్థాయి ‘యువ ఉత్సవ్‌’ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఆర్వో రాజశేఖర్‌ తెలిపారు. గురువారం డీఆర్వో చాంబర్‌లో జరిగిన ఉత్సవ్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో చిత్తూరులోని పీవీకేఎన్‌ డిగ్రీ కళాశాలలో జరుగు పోటీల్లో 15-29 సంవత్సరాల మధ్య వయసు కలిగిన యువతీ యువకులు పాల్గొనవచ్చన్నారు. యువతలోని సృజనాత్మక నైపుణ్యాలను వెలికి తీయడంలో భాగంగా ఈ పోటీలు జరుగుతున్నట్లు తెలిపారు. భారత దేశ సంస్కృతి, వారసత్వం మనకు గర్వకారణమనే అంశంపై కవిత్వం, చిత్రలేఖనం, నృత్యం, వక్తృత్వ పోటీలు, మొబైల్‌ ఫొటోగ్రఫీ, బృంద నృత్య పోటీలు జరిపేందుకు కమిటీ నిర్ణయించిందన్నారు. జిల్లా స్థాయి ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాలను అందజేస్తామన్నారు. వీరు రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనాలన్నారు. తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో పోటీలు జరుగుతాయని వివరించారు. ఇతర వివరాలకు 08572-241317 నెంబరులో సంప్రదించాలన్నారు. ఈ సందర్భంగా యువ ఉత్సవ్‌ పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఐఅండ్‌పీఆర్‌ డీడీ పద్మజ, ఎన్‌వైకే కో- ఆర్టినేటర్‌ ప్రవీణ్‌, అకౌంట్స్‌ అధికారి బాబురెడ్డి, తిరుపతి మాస్‌ సంస్థ అధినేత  జ్ఞానశేఖర్‌రెడ్డి, ఎన్‌ఎ్‌సఎ్‌స ప్రోగ్రామ్‌ అధికారి రామమూర్తి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-07T06:12:32+05:30 IST