తిరుచానూరు హైవేలో యువతి కిడ్నాప్
ABN , First Publish Date - 2022-08-04T06:48:39+05:30 IST
తిరుచానూరు హైవేలో ఓ యువతిని ముగ్గురు వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపింది.
రాజంపేటలో నిందితుల పట్టివేత
తిరుచానూరు, ఆగస్టు 3: తిరుచానూరు హైవేలో ఓ యువతిని ముగ్గురు వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. సకాలంలో పోలీసులు స్పందించడంతో ఆ యువతిని కాపాడి, కిడ్నాపర్లను పట్టుకున్నారు. సీఐ సుబ్రహ్మణ్యంరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి రూరల్ మండలం తనపల్లె గ్రామానికి ఓ యువతి(19) ఎస్వీయూ లా కోర్సు సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అలాగే తిరుచానూరు హరిజనవాడ క్రాస్ సమీపంలోని హైవేలో ఉన్న ఓ హోటల్లో పనిచేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం డ్యూటీ ముగించుకుని హోటల్ సమీపంలోని పెట్రోల్‌బంక్ వద్ద నడిచి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి ఎత్తుకెళ్లారు. బాధితురాలి కేకలు విన్న సమీపంలోని దుకాణదారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి.. సీసీ ఫుటేజీ ఆధారంగా కిడ్నాపర్లు వాడిన కారు నెంబరును గుర్తించారు. ఈ సమాచారాన్ని పక్క జిల్లా పోలీసులకు అందించారు. ఎట్టకేలకు రాజంపేట వద్ద కారును గుర్తించి యువతిని రక్షించి.. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం యువతిని కుటుంబీకులకు అప్పగించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వినయ్‌తోపాటు మరో ఇద్దరిని తిరుచానూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యువతిని ఎందుకు కిడ్నాప్ చేశారన్న విషయం దర్యాప్తులో తేవాల్సి ఉంది.