వైసీపీ నేత.. భూమేత

ABN , First Publish Date - 2022-09-21T05:38:24+05:30 IST

ఆయన వైసీపీ నేత. ప్రజాప్రతినిధి కూడా. అధికారం అండగా పశువుల మేత భూమి సొంతం చేసుకున్నారు.

వైసీపీ నేత.. భూమేత
ప్రభుత్వ భూమిలో మామిడి మొక్కలు నాటిన వైసీపీ నేత

పశువుల మేత భూమిని ఆక్రమించి మామిడి మొక్కలు నాటిన వైనం 

పాలసముద్రం, సెప్టెంబరు 20: ఆయన వైసీపీ నేత. ప్రజాప్రతినిధి కూడా. అధికారం అండగా పశువుల మేత భూమి సొంతం చేసుకున్నారు. గ్రామస్థులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదు. వివరాలిలా ఉన్నాయి. పాలసముద్రం మండలం ఆముదాలలోని జిల్లాపరిషత్‌ ఉన్నతపాఠశాల ప్రహరీ ఆనుకొని ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిలో ఆముదాల, జయలక్ష్మీపురం కొత్తకండిగ గ్రామస్థులు ఆవులు మేపుకునేవారు. ఈ భూమిపై కన్నేసిన ఆముదాల పంచాయతీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సుమారు నాలుగున్నర ఎకరాల ప్రభుత్వభూమిని చదును చేశారు. అందులో సుమారు 400 మామిడి మొక్కలు నాటించారు. మండలంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో అధికారం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఉద్దేశంతో ఆయన తన పలుకుబడిని ఉపయోగించి ఈ భూమిని ఆక్రమించుకున్నారు. దీనిపై గ్రామస్థులు ఆ ప్రజాప్రతినిధిని అడిగితే.. సమాధానం లేదు. దీంతో కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌కు, నగరి ఆర్డీవో సుజనకు, తహసీల్దార్‌ బాబుకు అర్జీల ద్వారా ఫిర్యాదు చేశారు. ఇంతవరకు వారి ననుంచి ఎలాంటి చర్యలు లేవు. ఈ భూమి చదునుచేసి, మొక్కలు నాటి 20 రోజులు గడుస్తున్నా అటువైపు రెవెన్యూ అధికారులు కన్నెత్తైనా చూడడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురికాకుండా చూడాలని కోరుతున్నారు.


Updated Date - 2022-09-21T05:38:24+05:30 IST